10.2-352-మ.
సుగుణాంభోనిధి, ఫాలలోచను నుమేశున్నాత్మ మెప్పించి శ
క్తి గరిష్ఠంబగు శూలముం బడసె నక్షీణప్రతాపోన్నతిన్,
జగతిన్ మిక్కిలి మేటివీరుఁడు, రణోత్సాహుండు, భూపౌత్త్రుఁ డీ
భగదత్తుం గనుఁగొంటె! పంకజముఖీ! ప్రాగ్జ్యోతిషాధీశ్వరున్.
10.2-353-మ.
వికచాంభోరుహపత్రనేత్రుఁ డగు గోవిందుండు దాఁ బూను నం
దక చక్రాబ్జ గదాది చిహ్నములచేతన్ వాసుదేవాఖ్య ను
త్సుకుఁడై యెప్పుడు మచ్చరించు మదిఁ గృష్ణుండన్ననేమేటి పౌం
డ్రకుఁ గాశీశసఖుం గనుంగొనుము వేడ్కం జంద్రబింబాననా!
10.2-354-మ.
ద్విజ శుశ్రూషయు, సూనృతవ్రతము, నుద్వృత్తిన్ భుజాగర్వమున్,
విజయాటోపముఁ, జాప నైపుణియు, ధీవిస్ఫూర్తియుం గల్గు నీ
రజనీనాథకులప్రదీపకులఁ బాఱంజూడు పద్మాక్షి! ధ
ర్మజ భీమార్జున మాద్రినందనుల సంగ్రామైకపారీణులన్.
భావము:
ఓ పద్మముఖీ! ఈతడు ప్రాగ్జ్యోతిషాధీశ్వరుడు భగదత్తుడు ఫాలలోచనుడైన పరమేశ్వరుణ్ణి మెప్పించి శక్తిమంత మైన శూలాన్ని ఆయుధంగా పొందాడు యుద్ధోత్సాహం గల సాటిలేని మేటివీరుడు. ఓ ఇందుముఖీ! ఇతడు పౌండ్రకుడు పద్మాక్షుడైన గోవిందుడు ధరించే నందకమనే ఖడ్గమూ; సుదర్శనమనే చక్రమూ; పాంచజన్యమనే శంఖమూ; కౌమోదకి అనే గదా మొదలైన వానిని ధరించి వాసుదేవు డనే పేరుపెట్టుకుని, శ్రీకృష్ణుని మీద మాత్సర్యం పెంపొందించుకున్నాడు; కాశీరాజుకు ఆప్తమిత్రుడు. పద్మములవంటి కన్నులున్న సఖీ! చంద్రవంశ ప్రదీపకు లైన పంచపాండవులు వీరు; ఇతడు ధర్మరాజు; ఇతడు భీముడు; ఇతడు అర్జునుడు; వీరిద్దరూ నకుల సహదేవులు; ఈ పాండవులు బ్రాహ్మణభక్తిపరులు; సత్యవ్రతులు; భుజబలసంపన్నులు; విజయశీలులు; బుద్ధిమంతులు; యుద్ధరంగంలో ఆరితేరిన వీరశిరోమణులు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=33&padyam=354
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment