Saturday, June 27, 2020

ఉషా పరిణయం - 28

( అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు )

10.2-382-చ.
కలిగి మహోగ్రవృత్తిఁ బరిఘంబు గరంబున లీలఁ దాల్చి దో
ర్బల ఘనవిక్రమప్రళయభైరవు భంగి విజృంభణక్రియా
కలన నెదిర్చె దానవ నికాయముతోఁ దలపాటుఁబోటునుం
జలముబలంబు దైర్యమునుశౌర్యము వ్రేటునువాటుఁజూపుచున్
10.2-383-చ.
పదములుబాహులుందలలు ప్రక్కలుచెక్కులుజానుయుగ్మముల్‌
రదములుగర్ణముల్‌ మెడలురంబులుమూఁపులువీఁపులూరువుల్‌
చిదురుపలై ధరం దొఱఁగఁ జిందఱవందఱ సేయ సైనికుల్‌
కదన పరాఙ్ముఖక్రమముఁ గైకొని పాఱిరి కాందిశీకులై.

భావము:
అప్పుడు ఆ అనిరుద్ధుడు అనివార్య శౌర్యసాహసాలతో ఇనుపకట్ల గుదియను చేపట్టి, ప్రళయకాల భైరవుడిలా మహోగ్రంగా విజృంభించి, మిక్కిలి పోరాట పటిమతో దానవసేనను ఎదిరించాడు. తన శక్తియుక్తులను శౌర్యధైర్యాలనూ ప్రదర్శించాడు. అనిరుద్ధుడి యుద్ధకౌశలానికి ఆ రాక్షససైనికుల పాదాలు, చేతులు, మోకాళ్ళు, తొడలు, మెడలు, వీపులు, మూపులు, తలలు, పండ్లు, చెవులు చిన్నచిన్న ముక్కలుగా నేలంతా చిందరవందరగా పడ్డాయి. ఆ వీరుడితో యుద్ధం చేయలేక దైత్యసైనికులు రణరంగం నుండి వెనుదిరిగి పారిపోయారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=35&padyam=383

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: