( బాణాసురునితో యుద్ధంబు )
10.2-391-వ.
అయ్యవసరంబున.
10.2-392-క.
శారద నిర్మల నీరద
పారద రుచి దేహుఁ డతుల భాగ్యోదయుఁ డా
నారదముని యేతెంచె న
పార దయామతి మురారిభజనప్రీతిన్.
10.2-393-వ.
ఇట్లు సనుదెంచిన యద్దివ్యమునికి నిర్మల మణివినిర్మిత సుధర్మాభ్యంతరంబున యదువృష్టిభోజాంధక వీరులు గొలువం గొలువున్న గమలలోచనుండు ప్రత్యుత్థానంబు చేసి, యర్ఘ్యపాద్యాది విధులం బూజించి, సముచిత కనకాసనాసీనుంజేసిన నత్తాపసోత్తముండు పురుషోత్తము నుదాత్తతేజోనిధిం బొగడి, యనిరుద్ధు వృత్తాంతం బంతయుఁ దేటపడ నెఱింగించి, యప్పుండరీకాక్షుని చేత నామంత్రణంబు వడసి, యంతర్ధానంబు నొందెఁ; దదనంతరంబ కృష్ణుండు శుభముహూర్తంబున దండయాత్రాభిముఖుండై ప్రయాణభేరి వ్రేయించి, బలంబుల వెడలింప బ్రద్దలవారిం బనిచి; తానును గట్టాయితంబయ్యె; నంత.
భావము:
అలా అనిరుద్ధుని జాడకై యాదవులు ఎదురుచూస్తున్న ఆ సమయంలో శరత్కాల మేఘంవంటి దేహంతో కూడిన మహానుభావుడు నారదమునీంద్రుడు, అపార దయాసముద్రుడు శ్రీకృష్ణుడిని పూజించే కుతూహలంతో ద్వారకకు విచ్చేసాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు స్వచ్ఛమైన మణులతో విశేషంగా నిర్మింపబడిన ఆ దివ్య సుధర్మసభ యందు యదు వృష్టి భోజాంధక వీరులతో కొలువుతీరి ఉన్నాడు. అప్పుడు విచ్చేసిన నారదమునీంద్రునకు శ్రీకృష్ణుడు వెంటనే లేచి ఎదురు వెళ్ళాడు. అర్ఘ్యపాద్యాదులతో పూజించి బంగారు ఆసనంపై ఆసీనుడిని చేసాడు. పిమ్మట నారదమునీంద్రుడు పురుషోత్తముడిని స్తుతించి అనిరుద్ధుడి వృత్తాంతం అంతా వివరించాడు. అనంతరం పుండరీకాక్షుని చెంత సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అటుపిమ్మట శ్రీకృష్ణుడు ఒక శుభముహుర్తంలో బాణాసురునిపై దండయాత్ర చేయడానికి ప్రయాణభేరి వేయించాడు. సైన్యాన్ని సిద్ధం చేయించి, తాను చతురంగబలాలతో యుద్ధరంగానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=36&padyam=393
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment