Thursday, June 25, 2020

ఉషా పరిణయం - 26

( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-378-తే.
ఇట్టిచోఁ గావలున్న మే మెవ్వరమును
నేమి కనుమాయయో కాని యెఱుఁగ మధిప!
నీ కుమారిక గర్భంబు నివ్వటిల్ల
యున్న” దన్నను విని రోషయుక్తుఁ డగుచు.
10.2-379-వ.
అట్టియెడ దానవేంద్రుండు రోషభీషణాకారుండై, కటము లదర, బొమలుముడివడం, గనుంగవల ననలకణంబు లుప్పతిల్ల, సటలు వెఱికినం జటులగతి నెగయు సింగంబు విధంబున లంఘించుచు, భీకర కరవాలంబు గేలందాల్చి సముద్దండగతిం గన్యాసౌధాంతరంబునకుం జని.

భావము:
ప్రభూ! ఈ పరిస్థితిలో, అదేమి కనికట్టో ఏమిటో జాగ్రత్తగా కాపాలా కాస్తున్న మాకు ఎవరికి తెలియదు కాని. నీ కుమార్తె గర్భం ధరించింది” అని చెప్పగానే విని అసురేంద్రుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. రోషభీషణాకారుడైన ఆ బాణ రాక్షసేంద్రుడి చెక్కిళ్ళు అదిరాయి; కనుబొమలు ముడిపడ్డాయి; కళ్ళవెంట నిప్పులు రాలాయి; జూలుపట్టి లాగగా విజృంభించిన సింహంలాగ ముందుకు లంఘించి, భయంకరమైన కరవాలాన్ని ధరించి ఆగ్రహావేశాలతో అత్యంత వేగంగా అంతఃపురానికి వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=378

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: