Sunday, June 7, 2020

ఉషా పరిణయం - 17

( చిత్రరేఖ పటంబున చూపుట )

10.2-358-సీ.
కమనీయశుభగాత్రుఁ, గంజాతదళనేత్రు;
వసుధాకళత్రుఁ, బావనచరిత్రు,
సత్యసంకల్పు, నిశాచరోగ్రవికల్పు;
నతపన్నగాకల్పు నాగతల్పుఁ,
గౌస్తుభమణిభూషు, గంభీరమృదుభాషు;
శ్రితజనపోషు, నంచితవిశేషు,
నీలనీరదకాయు, నిర్జితదైతేయు;
ధృతపీతకౌశేయు, నతవిధేయు,
10.2-358.1-తే.
నఘమహాగదవైద్యు, వేదాంతవేద్యు,
దివ్యమునిసన్నుతామోదుఁ, దీర్థపాదు,
జిష్ణు, వర సద్గుణాలంకరిష్ణుఁ, గృష్ణుఁ
జూడు దైతేయకులబాల! సుభగ లీల!
10.2-359-చ.
స్ఫుర దళి శింజినీ రవ విభూషితపుష్పధనుర్విముక్త భా
స్వర నవచూత కోరక నిశాత శిలీముఖ పాతభీత పం
కరుహభవాది చేతన నికాయు, మనోజనిజాంశు, రుక్మిణీ
వరసుతు, రాజకీరపరివారుని మారునిఁ జూడు కోమలీ! "

భావము:
ఓ దైత్య వంశ సుందరీ! ఇటుచూడు ఇతడు శ్రీకృష్ణుడు; మనోహరగాత్రుడు; పద్మనేత్రుడు; పావనచరిత్రుడు; సత్యసంకల్పుడు; దుష్టరాక్షసవిరోధి; శివునికి సైతం ఆరాధ్యుడు; శేషశయనుడు; కౌస్తుభమణిధారి; గంభీరభాషణుడు; ఆశ్రితజనపోషణకుడు; నీలమేఘశ్యాముడు; పీతాంబరుడు; వేదవేద్యుడు; సుజనవిధేయుడు; తీర్థపాదుడు; జయశీలుడు; సుగుణాలవాలుడు. ఓ కోమలీ! ఇతడు రుక్మిణీ సుతుడు ప్రద్యుమ్నుడు తన తుమ్మెదల నారి సారించి వదలిన పుష్పబాణాల దెబ్బతో బ్రహ్మాది దేవతలనే భయపెట్టగలిగిన మన్మథుని అవతారమే ఈ ప్రద్యుమ్నుడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=33&padyam=359

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: