Thursday, June 25, 2020

ఉషా పరిణయం - 27


( అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు )

10.2-380-సీ.
కనియె శుభోపేతుఁ, గందర్పసంజాతు;
మానితదేహు, నాజానుబాహు,
మకరకుండలకర్ణు, మహితప్రభాపూర్ణుఁ;
జిరయశోల్లాసుఁ, గౌశేయవాసుఁ,
గస్తూరికాలిప్తు, ఘనకాంతికుముదాప్తు;
హారశోభితవక్షు, నంబుజాక్షు,
యదువంశతిలకు, మత్తాలినీలాలకు;
నవపుష్పచాపుఁ, బూర్ణప్రతాపు,
10.2-380.1-తే.
నభినవాకారు, నక్షవిద్యావిహారు,
మహితగుణవృద్ధు, మన్మథమంత్రసిద్ధుఁ,
గలితపరిశుద్ధు, నఖిలలోకప్రసిద్ధుఁ,
జతురు, ననిరుద్ధు, నంగనాజననిరుద్ధు.
10.2-381-చ.
కని కన లగ్గలింప సురకంటకుఁ డుద్ధతి సద్భటావళిం
గనుఁగొని "యీనరాధమునిఁ గట్టుఁడు; పట్టుఁడు; కొట్టుఁ" డన్న వా
రనుపమ హేతిదీధితు లహర్పతి తేజము మాయఁజేయ డా
సిన నృపశేఖరుండు మదిఁ జేవయు లావును నేర్పు దర్పమున్.

భావము:
అక్కడ అంతఃపురంలో శుభకరుడు, మన్మథావతారుడు, చక్కటి రూపువాడు, ఆజానుబాహుడు, మకరకుండలాలతో నిండు తేజస్సుతో విరాజిల్లుచున్నవాడు, గొప్పయశోమూర్తి, పట్టుబట్టలు కస్తూరికాగంధము ధరించి చంద్రుడి వలె ప్రకాశిస్తున్న వాడు, వక్షస్థలమున ముత్యాల హారాలు ధరించిన వాడు, మదించిన తుమ్మెదల వలె నుదుట వాలిన నల్లని ముంగురులు గలవాడు, నవమన్మథ రూపుడు, నిండు పరాక్రమంతో విలసిల్లుతున్నవాడు, నననవాన్వితాకారుడు, సుగుణోపేతుడు, రతితంత్ర సిద్ధుడు, అమలినుడు, మానినుల వద్ద మసలుకొను మర్యాద తెలిసిన వాడు, బహు చతురుడు అని పేరుపొందిన వాడు, యాదవ వంశోత్తముడు అయిన అనిరుద్ధుడు విలాసంగా జూదము ఆడుతుండాగా ఆ రాక్షసరాజు చూసాడు. విపరీతమైన కోపంతో మండిపడుతూ ఆ దేవద్వేషి బాణుడు భటులతో “ఈ మానవాధముడిని బంధించండి! కొట్టండి!” అని ఆజ్ఞాపించాడు. ఆ రాక్షసభటులు సూర్యకాంతిని ధిక్కరించే కాంతులతో శోభించే ఆయుధాలతో అనిరుద్ధుని బంధించడానికి వెళ్ళారు. ఆ రాజశేఖర కుమారకుడు తన చేవ, బల, దర్పములు చూపుతూ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=35&padyam=380

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: