10.1-537-వ.
అని యిట్లు తలవాకిట వాణి గల పోఁడిమిచే వాఁడిమి కెక్కిన నలుమొగంబుల తక్కరిగొంటు పెనుదంట పలువెంటలైన తన మనంబున వితర్కించి, విచారించు నెడ, నతండు కనుగొనుచుండ నబ్బాలకులు మేఘశ్యాములును, హార కుండల కిరీట వనమాలికాభిరాములును, శ్రీవత్స మంగళాంగద నూపుర కనక కటక కంకణ కటిఘటిత కాంచీగుణోద్దాములును, నాపాదమస్తక తులసీదళదాములును, విలస దంగుళీయకస్తోములును, శంఖ చక్ర గదా కమల హస్తులును, జతుర్భుజప్రశస్తులును పీతకౌశేయవాసులును, చంద్రికాధవళహాసులును, కరుణాకటాక్షవీక్షణ విలాసులును, రవికోటిభాసులును, ననంత సచ్చిదానందరూప మహితులును, యణిమాదిగుణోపేతులును, విజాతీయభేదరహితులును, శ్రీమన్నారాయణ ప్రతిమాన విగ్రహస్వరూపులునై తమకుఁ బరతంత్రులగుచు నృత్తగీతాది సేవావిశేషంబులకుం జొచ్చి మెలంగుచు మూర్తిమంతంబు లయిన బ్రహ్మాదిచరాచరంబులును, నణిమాదిసిద్ధులును, మాయాప్రముఖంబులయిన శక్తులును, మహదాది చతుర్వింశతి తత్వంబులును, గుణక్షోభకాలపరిణామ హేతుసంస్కారకామ కర్మగుణంబులును సేవింప వేదాంతవిదులకయిన నెఱుంగరాని తెఱంగున మెఱయుచుఁ గానబడిన వారలం గనుంగొని.
చతుర్వింశతి తత్వాలు
భావము:
అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. అతను తన తలవాకిట సరస్వతి ఉన్నదనే అభిమానం వలన కొంత గర్వపడుతూండే వాడు. నాలుగు మొగాలున్న ఆ మహా మాయగాడు జంకి వెనుకకు తగ్గుతూ, తన మనస్సులో ఎన్నోరకాలుగా ఆలోచించి చూసాడు. ఒకసారి బాలుర వంక చూసాడు. అందరూ మేఘశ్యామల మూర్తులూ, హారాలు కుండలాలు కిరీటాలు వైజయంతీమాలికలూ ధరించి చాలా అందంగా ఉన్నారు; వక్షస్థలం పైన శ్రీవత్సం అనే పుట్టుమచ్చ, శుభకరాలైన బాహుపురుషులు, కాలిగజ్జెలు, బంగారు కడియాలు, నడుములకు కాంచీకలాపాలతో కనిపిస్తూ బ్రహ్మదేవుడిని బెదరగొట్టారు; పాదాలనుండి శిరస్సులవరకూ తులసీ దళాల మాలలు ధరించారు; వ్రేళ్ళకు రవ్వల ఉంగరాలు మెరుస్తున్నాయి; అందరికీ నాలుగేసి బాహువులు ఉన్నాయి; నాలుగు చేతులలో శంఖం, గద, చక్రం, పద్మం ధరించి ఉన్నారు; బంగారు పట్టువస్త్రాలు ధరించి ఉన్నారు; వెన్నెలవంటి చల్లని తెల్లని చిరునవ్వులు వెదజల్లుతున్నారు; కన్నుల నుండి కరుణాకటాక్షాలు వెలువడుతున్నాయి; కోటిసూర్యుల కాంతితో వెలిగిపోతున్నారు; సచ్ చిత్ ఆనందాలు తామే అయిన అనంత రూపాలతో విలసిల్లుతున్నారు; అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము అనబడే ఎనిమిది అష్టసిద్ధుల గుణాలూ తమలోనే ధరించి ఉన్నారు; అందరూ అంతర్యామి స్వరూపులే కనుక, ఇది పరాయిది అనే భేదం వారికి లేదు; లక్ష్మీదేవితో కూడిన నారాయణుని ప్రతిబింబా లైన రూపాలతో విలసిల్లుతున్నారు; సృష్టిలో ఉన్న బ్రహ్మ దగ్గర నుండి చరాచర జీవరాశులు; అణిమ మొదలైన సిద్ధులు, మాయ, అహంకారము, బుద్ధి, మనస్సు, పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు మొదలైన ఇరవైనాలుగు తత్వాలు; మూడు గుణముల కలయిక, కాలము, మార్పు, కారణము, సంస్కారము, కామము, కర్మము, వాని గుణాలు ఇవన్నీ రూపాలు ధరించి నృత్యాలు గానాలు మొదలైనవి చేస్తూ ఈ నారాయణ స్వరూపు లైన బాలకులకు లోబడి సేవిస్తూ ఉన్నాయి; వేదాంత మంతా తెలిసినవారికి ఐనా ఈ విశ్వరూపాలు తెలియవు. ఈవిధంగా దేదీప్య మానంగా ప్రకాశిస్తూన్న బాలురను బ్రహ్మదేవుడు చూసాడు. చూసి ఇలా అనుకున్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=73&padyam=537
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :