Monday, July 31, 2017

శ్రీ కృష్ణ జననం - 7

10.1-36-క.
ఎందును గాలము నిజ మని
పందతనంబునను బుద్ధిఁబాయక ఘనులై 
యెందాఁక బుద్ధి నెగడెడి
నందాఁకఁ జరింపవలయు నాత్మబలమునన్.
10.1-37-వ.
అని నిశ్చయించి.
10.1-38-సీ.
ఆపన్నురాలైన యంగన రక్షింప; 
సుతుల నిచ్చెద నంట శుభము నేడు; 
మీ దెవ్వ డెఱుగును? మెలఁత ప్రాణంబుతో; 
నిలిచిన మఱునాడు నేరరాదె? 
సుతులు పుట్టిర యేని సుతులకు మృత్యువు; 
వాలాయమై వెంట వచ్చెనేని 
బ్రహ్మచేతను వీఁడు పా టేమియును లేక; 
యుండునే? సదుపాయ మొకటి లేదె?
10.1-38.1-తే.
పొంత మ్రాఁకులఁ గాల్పక పోయి వహ్ని
యెగసి దవ్వులవాని దహించు భంగిఁ
గర్మవశమున భవమృతికారణంబు
దూరగతిఁ బొందు; నిఁక నేల తొట్రుపడఁగ?

భావము:
“మనుషులకు బేలతనం పనికి రాదు. ఎప్పుడైనా కాలమే వాస్తవం అయినది అనే వివేకాన్ని పిరికిదనంతో వదల రాదు. ఆత్మబలంతో గట్టిగా నిలబడి తన బుద్ది ఎంతవరకు ప్రసరిస్తుందో అంతవరకూ ఉపాయం ఆలోచించి ఆచరిస్తూ ఉండాలి.” అని వసుదేవుడు ఇలా గట్టిగా నిశ్చయించుకొని.... “ఆపదపాలైన దేవకిని రక్షించడానికి పుట్టబోయే కుమారులను వీడికి ఇచ్చేస్తాను అనడం ప్రస్తుతానికి తగిన పని. ముందు ఏమి జరగబోతున్నదో ఎవరికి తెలుసు? ఈమె ఇప్పటికి ప్రాణాలతో నిలచి ఉంటే, రేపటికి మరోమార్గం లభించదా? పుత్రులే పుట్టి వారికి వెనువెంటనే మృత్యువు కూడా వస్తేరానీ. అందాకా వీడు బ్రహ్మదేవుడి చేత ఏ ఆపద పొందకుండానే ఉంటాడా? అప్పటికి తగ్గ ఉపాయం ఏదో ఒకటి ఉండదా. అడవిలో పుట్టిన దావాగ్ని ప్రక్కనున్న చెట్లను విడచి ఎగసిపడి ఎక్కడో దూరాన ఉన్న చెట్లను దహించి వేస్తుంది. అలాగే కర్మను అనుసరించి జన్మ మృత్యువు అనే కారణాలు దూరదూరంగా పోతూ ఉంటాయి. ఇంతతెలిసీ ఇంకా తొట్రుపడడం ఎందుకు?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=5&padyam=38

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

శ్రీ కృష్ణ జననం - 6

10.1-33-క.
కావునఁ బరులకు హింసలు
గావింపఁగ వలదు తనకుఁ గల్యాణముగా 
భావించి పరుల నొంచినఁ
బోవునె? తత్ఫలము పిదపఁ బొందక యున్నే?
10.1-34-మత్త.
వావిఁ జెల్లెలు గాని పుత్రికవంటి దుత్తమురాలు; సం
భావనీయచరిత్ర; భీరువు; బాల; నూత్నవివాహ సు
శ్రీవిలాసిని; దీన; కంపితచిత్త; నీ కిదె మ్రొక్కెదం; 
గావవే; కరుణామయాత్మక; కంస! మానవవల్లభా!
10.1-35-వ.
అని మఱియు సామభేదంబులగు పలుకులు పలికిన వినియు వాఁడు వేఁడిచూపుల రాలు నిప్పులు గుప్పలుగొన ననుకంపలేక, తెంపుఁజేసి చంపకగంధిం జంపఁ జూచుట యెఱింగి మొఱంగెడి తెఱంగు విచారించి తనలో నిట్లనియె.

భావము:
కాబట్టి, ఇతరులను బాధించడం మంచిపని కాదు. తన సౌఖ్యం కోసం అనుకుంటూ ఇతరులను బాధిస్తే ఊరకే పోతుందా? దానికి ఫలితం తరువాత అయినా పొందక తప్పదు కదా.. ఓ కంసమహారాజా! నువ్వు దయామయుడవు. ఈ దేవకి ఏదో వరసకి చెప్పడానికి నీకు చెల్లెలు కాని నీకు కూతురు వంటిది. చాలా మంచిది. గౌరవించదగ్గ ప్రవర్తన కలది. భయస్తురాలు. కొత్త పెళ్ళికూతురు. మంచి లక్ష్మీకళ ఉట్టిపడుతున్నది. దీనురాలు. భయంతో లోలోన వణికిపోతూ ఉంది. ఇదిగో నీకు మ్రొక్కుతున్నాను, ఈమెను కాపాడవయ్యా ఇలా వసుదేవుడు ఎంతో అనునయంగా కంసుడి మనస్సు కరిగించాలని మాట్లాడాడు. అయినా కంసుడికి జాలి పుట్ట లేదు. అతడు కోపపు చూపులతో కన్నుల నుండి నిప్పులు రాలుతూండగా, దేవకిని చంపబోయాడు. అతని మూర్ఖత్వాన్ని గమనించి వసుదేవుడు ఎలాగైనా అతణ్ని ఒప్పించాలని తనలో ఇలా అనుకున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=5&padyam=34

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Sunday, July 30, 2017

శ్రీ కృష్ణ జననం - 5

10.1-30-క.
తన తొంటి కర్మరాశికి
ననుచరమై బహువికారమై మనసు వడిం
జను; నింద్రియముల తెరువులఁ
దనువులు పెక్కైనఁ జెడవు తన కర్మంబుల్.
10.1-31-ఆ.
జలఘటాదులందుఁ జంద్రసూర్యాదులు
గానబడుచు గాలిఁ గదలు భంగి 
నాత్మకర్మ నిర్మితాంగంబులను బ్రాణి
గదలుచుండు రాగకలితుఁ డగుచు.
భావము:
10.1-32-క.
కర్మములు మేలు నిచ్చును; 
గర్మంబులు గీడు నిచ్చు; గర్తలు దనకుం 
గర్మములు బ్రహ్మ కైనను; 
గర్మగుఁ డై పరులఁ దడవఁగా నేమిటికిన్?

భావము:
తన పూర్వకర్మలు అనుసరించి మనస్సు అనేక వికారాలు చెందుతూ, ఇంద్రియాల వెంట వేగంగా చరిస్తూ ఉంటుంది. ఎన్ని శరీరాలు ధరించినా తన కర్మలు మాత్రం ఎక్కడకీ పోవు. చంద్రబింబం సూర్యబింబం మొదలైనవి నీటికుండలు మొదలైనవాటిలో ప్రతిఫలిస్తూ గాలికి కదులుతూ ఉంటాయి. అలాగే ప్రాణి తన కర్మల చేత నిర్మించుకున్న శరీరాలలో ఆసక్తి చెంది సంచలిస్తూ ఉంటాడు. మంచి అయినా, చెడు అయినా ఎవరికైనా తాను చేసుకున్న కర్మల ఫలితంగానే వస్తుంది. బ్రహ్మదేవుడు అంతటివాడికి అయినా తన కర్మలే తన అనుభవానికి కర్తలు. కర్మను అనుసరించి ప్రవర్తిస్తూ ఇతరులలో దోషాలు వెతకడం ఎందుకు?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=5&padyam=32

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

శ్రీ కృష్ణ జననం - 4

10.1-28-మ.
చెలియల్; కన్నియ; ముద్దరా; లబల; నీ సేమంబె చింతించు ని
ర్మల; దీనిన్ బయలాడుమాటలకు నై మర్యాదఁ బోఁదట్టి, స
త్కుల జాతుండవు పుణ్యమూర్తి వకటా! కోపంబు పాపంబు; నె
చ్చెలి నోహో! తెగవ్రేయఁ బాడి యగునే? చింతింపు భోజేశ్వరా!
10.1-29-సీ.
మేనితోడన పుట్టు మృత్యువు జనులకు; 
నెల్లి నేఁడైన నూఱేండ్ల కైనఁ
దెల్లంబు మృత్యువు దేహంబు పంచత; 
నందఁ గర్మానుగుండై శరీరి 
మాఱుదేహముఁ నూఁది, మఱి తొంటి దేహంబుఁ; 
బాయును దన పూర్వ భాగమెత్తి 
వేఱొంటిపైఁ బెట్టి వెనుకభాగం బెత్తి; 
గమనించు తృణజలూకయును బోలె;
10.1-29.1-ఆ.
వెంటవచ్చు కర్మవిసరంబు; మును మేలు 
కన్నవేళ నరుడు గన్న విన్న 
తలఁపఁబడిన కార్యతంత్రంబు కలలోనఁ
బాడితోడఁ గానఁబడిన యట్లు.

భావము:
ఈ నీ చెల్లెలు వట్టి అమాయకురాలు. అబల. నీ క్షేమాన్నేఎప్పుడూ ఆశిస్తుంది. ఏ పాపమూ ఎరుగనిది. ఇటువంటి ఈమెను ఆక్కడా ఇక్కడా వినబడే మాటలు పట్టుకుని చంపబోవడం న్యాయమేనా? కోపం మహాపాపం సుమా. పవిత్రమైన భోజవంశంలో పుట్టిన వాడివి. పుణ్యమూర్తివి. భోజవంశీయులు అందరికీ నాయకుడవు. ఇలాంటి నువ్వు ప్రియమైన సోదరిని సంహరించడం ధర్మమా? అయ్యో! ఇది నీప్రతిష్టకు భంగకరం కాదా? ఆలోచించి చూడు. జన్మము ఎత్తినవారికి ఆ శరీరం తోపాటే మృత్యువు కూడా పుట్టి ఉంటుంది. నేడో రేపో నూరేళ్ళకైనా మృత్యువు తప్పదు. మరణించడం అంటే శరీరం పంచభూతాలలో కలసిపోవడమే. ఆకుపురుగును చూడు శరీరం ముందు భాగం ఎత్తి మరోచోట పెట్టి వెనుకభాగం ఎత్తి ముందుకు లాక్కుంటుంది కదా. అలాగే శరీరం ధరించిన జీవుడు తన కర్మను అనుసరించి మరొక దేహం ఏర్పాటు చేసుకుని మరి ఉన్నశరీరం విడిచిపెడతాడు. మనకు మెలుకవగా ఉన్నప్పుడు మానవుడు చూచినవి విన్నవి ఆలోచించినవి అయిన పనులు కలలో చక్కగా కనపడినట్లు శరీరం విడువగానే కర్మవాసనలన్నీ ఆ జీవి వెంటవస్తాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=5&padyam=29

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

శ్రీ కృష్ణ జననం - 2

10.1-22-క.
పగ్గములు వదలి వేగిర
మగ్గలముగ రథముఁ గడపు నా కంసుడు లో
బెగ్గిలి యెగ్గని తలఁపగ 
దిగ్గన నశరీరవాణి దివి నిట్లనియెన్.
10.1-23-క.
తుష్ట యగు భగిని మెచ్చఁగ
నిష్టుఁడ వై రథము గడపె; దెఱుగవు మీఁదన్
శిష్ట యగు నీతలోదరి 
యష్టమగర్భంబు నిన్ను హరియించుఁ జుమీ.

భావము:
కంసుడు గుఱ్ఱాల పగ్గాలు సడల్చి రథం వేగంగా నడపసాగాడు. ఇంతలో అకస్మాత్తుగా అతని గుండెలు అదిరేటట్లు అశరీరవాణి ఆకాశంలో నుండి ఇలా పలికింది. “సంతుష్టురాలైన చెల్లెలు దేవకీదేవి మెప్పు కోసం ఎంతో ప్రేమతో రథం నడుపుతున్నావు. కానీ, ముందు రానున్నది తెలుసుకోలేకుండా ఉన్నావు.. ఉత్తమురాలైన ఈ యువతి అష్టమగర్భంలో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడు సుమా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=3&padyam=23

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, July 29, 2017

శ్రీ కృష్ణ జననం - 3

10.1-24-వ.
అని యిట్లాకాశవాణి పలికిన నులికిపడి భోజకుల పాంసనుండైన కంసుండు సంచలదంసుండై యడిదంబు బెడిదంబుగాఁ బెఱికి, జళిపించి దెప్పరంబుగ ననుజ కొప్పుఁ బట్టి కప్పరపాటున నొప్పఱం దిగిచి యొడిసి పట్టి, తోఁబుట్టువని తలంపక తెంపుఁ జేసి తెగవ్రేయ గమకించు సమయంబున వసుదేవుండు డగ్గఱి.
10.1-25-క.
ఆ పాపచిత్తు మత్తుం
గోపాగ్ని శిఖానువృత్తుఁ గొనకొని తన స
ల్లాపామృతధారా వి
క్షేపణమునఁ గొంత శాంతుఁ జేయుచుఁ బలికెన్.
10.1-26-ఉ.
అన్నవు నీవు చెల్లెలికి; నక్కట! మాడలు చీర లిచ్చుటో? 
మన్నన చేయుటో? మధుర మంజుల భాషల నాదరించుటో? 
"మిన్నుల మ్రోతలే నిజము, మే"లని చంపకు మన్న మాని రా
వన్న! సహింపు మన్న! తగ దన్న! వధింపకు మన్న! వేడెదన్.
10.1-27-వ.
అదియునుం గాక.

భావము:
ఇలా ఆకాశవాణి పలుకడంతో భోజవంశాన్ని పాడుచేయడానికి పుట్టిన కంసుడు ఉలిక్కిపడ్డాడు. ఆ దుర్మార్గుడు భుజాలు అదురుతుండగా భయంకరంగా కత్తిదూసి తొట్రుపాటుతో చెల్లెలి కొప్పు పట్టుకుని రథం మీంచి క్రిందికి లాగాడు. తోడపుట్టినది అని కూడా చూడకుండా తెగించి ఆమెను చంపబోతున్న కంసుడికి వసుదేవుడు అడ్డుపడ్డాడు. ఆ కంసుడు అసలే పాపపుబుద్ధి కలవాడు. పైగా మద మెక్కి మైమరచి ఉన్నాడు. ఆగ్రహావేశంతో అగ్నిజ్వాల లాగా మండిపడుతున్నాడు. వసుదేవుడు అమృతధారల వంటి తన చల్లని మాటల చేత అతనిని కొంత శాంతింప చేస్తూ ఇలా అన్నాడు. “బావా! కంసా! నీవు ఈ చిన్నదానికి అన్నగారివి కదా. నీ చెల్లెలికి ధనం ఇవ్వాలి చీరలు పెట్టాలి; ఆడపడుచు అని గౌరవించాలి; మధురమైన మాటలతో ఆదరించాలి; అంతేకానీ, అయ్యో ఇదేమిటి ఏవో గాలిమాటలు విని అవే నిజం అనుకుని ఈ అమాయకురాలిని వధించబోవడం సరికాదు కదా. చంపవద్దు బావా! దయచేసి వెనక్కు వచ్చేయి. ఓర్పుతెచ్చుకో. ఇది నీ వీరత్వానికి తగిన పని కాదు. ఆమెను వధించ వద్దు. నాయనా! నామాట విను నిన్ను వేడుకుంటున్నాను. అంతే కాకుండా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=4&padyam=26

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Thursday, July 27, 2017

శ్రీకృష్ణ జననం - 1:

10.1-20-సీ.
ఆ శూరసేనున కాత్మజుం డగు వసు; 
దేవుఁ డా పురి నొక్క దినమునందు
దేవకిఁ బెండ్లియై దేవకియును దానుఁ; 
గడువేడ్క రథమెక్కి కదలువేళ
నుగ్రసేనుని పుత్రుఁ డుల్లాసి కంసుండు; 
చెల్లెలు మఱఁదియు నుల్లసిల్ల
హరుల పగ్గములఁ జేనంది రొప్పఁ దొడంగె; 
ముందట భేరులు మురజములును
10.1-20.1-ఆ.
శంఖ పటహములును జడిగొని మ్రోయంగఁ
గూఁతుతోఁడి వేడ్క కొనలుసాఁగ
దేవకుండు సుతకు దేవకీదేవికి
నరణ మీఁ దలంచి యాదరించి.
10.1-21-వ.
సార్థంబు లయిన రథంబుల వేయునెనమన్నూటిని, గనకదామ సముత్తంగంబు లయిన మాతంగంబుల నన్నూటిని, బదివేల తురంగంబులను, విలాసవతు లయిన దాసీజనంబుల నిన్నూటి నిచ్చి, యనిచినం గదలి వరవధూయుగళంబు తెరువునం జను సమయంబున.

భావము:
శూరసేనుడి కుమారుడైన వసుదేవుడు దేవకీదేవిని పెండ్లి చేసుకుని ఒకనాడు తన భార్యతో కలిసి రథం ఎక్కి బయలుదేరాడు. ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు చెల్లెలు మీద ప్రేమతో తానే స్వయంగా గుఱ్ఱాల పగ్గాలుపట్టి రథం తోలసాగాడు. అది చూసి దేవకీవసుదేవులు చాలా సంతోషించారు. రథం ముందు భేరీలూ మృదంగాలు శంఖాలు డప్పులు రాజలాంఛనాలుగా మ్రోగుతూ ఉన్నాయి. దేవకికి తండ్రి అయిన దేవకుడు కుమార్తెపై ప్రేమతో ఆమెకు అరణం ఇవ్వాలని అనుకొని. సకల పరికరాలతో కూడిన పద్దెనిమిదివందల రథాలను; బంగారు గొలుసులతో అలంకరించిన నాలుగువందల ఎత్తైన ఏనుగులను; పదివేల గుఱ్ఱాలనూ; రెండువందలమంది విలాసవతులైన పరిచారికలను ఆమెకు అరణంగా ఇచ్చాడు. క్రొత్త దంపతులైన దేవకీవసుదేవులు రథంలో కూర్చుండి రాచబాటలో బయలుదేరారు. ఆ సమయంలో. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=3&padyam=20

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Wednesday, July 26, 2017

దక్ష యాగము - 99


4-211-వ.
అంత దాక్షాయణి యయిన సతీదేవి పూర్వకళేబరంబు విడిచి హిమవంతునకు మేనక యందు జనియించి విలయకాలంబునం బ్రసుప్తం బయిన శక్తి సృష్టికాలంబున నీశ్వరునిఁ బొందు చందంబునఁ బూర్వదయితుండగు రుద్రుని వరించె నని దక్షాధ్వర ధ్వంసకుం డగు రుద్రుని చరిత్రంబు బృహస్పతి శిష్యుండైన యుద్ధవునకు నెఱింగించె; అతండు నాకుం జెప్పె; నేను నీకుం జెప్పితి;" అని మైత్రేయుండు వెండియు విదురున కిట్లనియె.
4-212-క.
"ఈ యాఖ్యానముఁ జదివిన
ధీయుతులకు వినినయట్టి ధీరుల కైశ్వ
ర్యాయుః కీర్తులు గలుగును; 
బాయును దురితములు; దొలఁగు భవబంధంబుల్."

టీకా:
అంత = అంతట; దాక్షాయణి = దక్షుని పుత్రిక; అయిన = అయిన; సతీదేవి = సతీదేవి; పూర్వ = పాత; కళేబరంబున్ = శరీరమును; విడిచి = వదలి; హిమవంతునకు = హిమవంతునకు; మేనక = మేనక; అందున్ = అందు; జనియించి = పుట్టి; విలయ = ప్రళయ; కాలంబునన్ = సమయమునందు; ప్రసుప్తంబు = బాగనిద్రించినది; అయిన = అయిన; శక్తి = శక్తి; సృష్టికాలంబునన్ = సృష్టికాలమున; ఈశ్వరుని = శివుని; పొందు = చెందు; చందంబునన్ = విధముగ; పూర్వ = పూర్వపు; దయితుండు = ప్రియుడు; అగు = అయిన; రుద్రుని = శివుని; వరించెన్ = వరించెను; అని = అని; దక్ష = దక్షుని; అధ్వర = యాగమును; ధ్వంసకుడు = ధ్వంసము చేసినవాడు; అగు = అయిన; రుద్రుని = శివుని; చరితంబున్ = వర్తనమును; బృహస్పతి = బృహస్పతి; శిష్యుండు = శిష్యుడు; ఐన = అయిన; ఉద్ధవున్ = ఉద్ధవుని; కున్ = కి; ఎఱింగించె = తెలిపెను; అతండు = అతడు; నాకున్ = నాకు; చెప్పెన్ = చెప్పెను; నేను = నేను; నీకున్ = నీకు; చెప్పితిన్ = చెప్పాను; అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; వెండియున్ = మరల; విదురున్ = విదురున; కున్ = కు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను. ఈ = ఈ; ఆఖ్యానమున్ = కథను; చదివిన = చదివిన; ధీ = బుద్ధిబలముతో; యుతులకు = కూడినవారికి; వినిన = విన్న; అట్టి = అటువంటి; ధీరుల్ = బుద్ధిబలముకలవారి; కిన్ = కి; ఐశ్వర్య = ఐశ్వర్యము; ఆయుస్ = జీవితకాలము; కీర్తిలున్ = కీర్తి; కలుగును = కలుగును; పాయును = దూరమగును; = దురితములున్ = పాపములు; తొలగున్ = తొలగిపోవును; భవబంధంబుల్ = సంసారబంధములు.

భావము:
ఆ తరువాత దక్షుని కూతురైన సతీదేవి పూర్వ శరీరాన్ని విడిచి, హిమవంతునకు, మేనకకు కుమార్తెగా జన్మించి, ప్రళయకాలంలో ప్రస్తుప్తమైన శక్తి సృష్టికాలంలో ఈశ్వరుని పొందిన విధంగా తన పూర్వభర్త అయిన రుద్రుని వరించింది” అని దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన రుద్రుని చరిత్రను బృహస్పతి తన శిష్యుడైన ఉద్ధవునకు చెప్పాడు. ఆ ఉద్ధవుడు నాకు చెప్పాడు. నేను నీకు చెప్పాను” అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇంకా ఇలా అన్నాడు. “ఈ కథను చదివిన బుద్ధిమంతులకు, విన్న ధీరులకు ఐశ్వర్యం, ఆయువు, కీర్తి లభిస్తాయి. పాపాలు, భవబంధాలు తొలగిపోతాయి.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=212

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

*****************************
నేటితో దక్షయాగము ఘట్టం సమాప్తం... ఈ పోస్టులను ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు... నమః శివాయ.... జై శ్రీ రామ....
*****************************

Tuesday, July 25, 2017

దక్ష యాగము - 98

4-210-సీ.
అంగప్రధానక యాగంబులను జేసి; 
యమరుల రుద్రుని నర్థిఁ బూజ
చేసి విశిష్టేష్ట శిష్టభాగమున ను; 
దవసాన కర్మంబుఁ దవిలి తీర్చి
తాను ఋత్త్విక్కులుఁ దగ సోమపులఁ గూడి; 
యవభృథ స్నానంబు లాచరించి
కడఁక నవాప్త సకల ఫలకాముఁడై; 
తనరు దక్షునిఁ జూచి ధర్మబుద్ధి
4-210.1-తే.
గలిగి సుఖవృత్తి జీవింతుఁగాక యనుచుఁ
బలికి దివిజులు మునులును బ్రాహ్మణులును
జనిరి నిజమందిరముల; కా జలజనయన
భవులు వేంచేసి రాత్మీయ భవనములకు.

టీకా:
అంగ = భాగములతో కూడిన; ప్రధానక = ప్రధానమైనట్టి; యాగంబులను = యహ్ఞములు; చేసి = వలన; అమరుల = దేవతలను; రుద్రుని = శివుని; అర్థిన్ = కోరి; పూజ = పూజ; చేసి = చేసి; విశిష్ట = ప్రత్యేకమైన; ఇష్ట = యాగమును; శిష్ట = ప్రథాన; భాగమునను = భాగమున; ఉదవసాన = ఉద్వసానము అనెడి {ఉదవసానము - ఉత్ (నీరు) తో అవసానము (పూర్తి అగునప్పుడు చేయునట్టిది), ఉద్వాసనము}; కర్మంబున్ = కర్మములను; తవిలి = పూని; తీర్చి = పూర్తిచేసి; తాను = తాను; ఋత్విక్కులున్ = ఋత్విక్కులు; తగన్ = తగ్గట్లు; సోమపులన్ = సోమయాజులు {సోమపులు - యాగముచేసి అవశిష్టమైన సోమలతరసములు తాగినవారు, సోమయాజులు}; కూడి = కూడి; అవభృతస్నానము = యజ్ఞాంతస్నానము; ఆచరించి = చేసి; కడకన్ = పూనికతో; అవాప్త = ప్రాప్తించిన; సకల = సమస్తమైన; ఫల = ఫలించిన; కాముడు = కామములు కలవాడు; ఐ = అయ్యి; తనరు = అతిశయించిన; దక్షునిన్ = దక్షుని; చూచి = చూసి; ధర్మబుద్ధి = ధర్మబుద్ధి; కలిగిన = కలిగి. సుఖ = సుఖమైన; వృత్తిన్ = విధముగ; జీవింతుగాక = జీవించెదవుగాక; అనుచున్ = అంటూ; పలికి = పలికి; దివిజులు = దేవతలు; మునులును = మునులు; బ్రాహ్మణులును = బ్రాహ్మణులు; చనిరి = వెళ్ళిరి; నిజ = తమ; మందిరముల్ = మందిరముల; కున్ = కు; ఆ = ఆ; జలజనయన = విష్ణువు; భవులు = శివుడు; వేంచేసి = వెళ్ళిరి; ఆత్మీయ = స్వంత; భవనముల్ = నివాసముల; కున్ = కు.

భావము:
దక్షుడు అంగప్రధానకాలైన యాగాలను చేసి, దేవతలను, శివుణ్ణి పూజించి, వారి వారి భాగాలను వారికి సమర్పించి, ఋత్విక్కులతోను సోమపానం చేసినవారితోను అవభృథ స్నానం చేసి, యజ్ఞఫలాన్ని సమగ్రంగా పొందాడు. దేవతలు, మునులు, బ్రాహ్మణులు దక్షుని చూచి “ధర్మబుద్ధి కలిగి సుఖంగా జీవింతువు గాక!” అని దీవించి తమ తమ గృహాలకు వెళ్ళారు. విష్ణువు, శివుడు తమ తమ మందిరాలకు వెళ్ళారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=210

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

దక్ష యాగము - 97


4-207-వ.
“అనఘా! యేనును బ్రహ్మయు శివుండు నీ జగంబులకుఁ గారణభూతులము; అందు నీశ్వరుఁడును, నుపద్రష్టయు స్వయంప్రకాశుండు నైన నేను గుణమయం బయిన యాత్మీయ మాయం బ్రవేశించి జనన వృద్ధి విలయంబులకు హేతుభూతంబు లగు తత్తత్క్రియోచితంబు లయిన బ్రహ్మరుద్రాది నామధేయంబుల నొందుచుండు; దట్టి యద్వితీయ బ్రహ్మరూపకుండ నైన నా యందు నజ భవాదులను భూతగణంబులను మూఢుం డగువాడు వేఱుగాఁ జూచు; మనుజుండు శరీరంబునకుఁ గరచరణాదులు వేఱుగాఁ దలంపని చందంబున మద్భక్తుం డగువాఁడు నా యందు భూతజాలంబు భిన్నంబుగాఁ దలంపఁడు; కావున మా మువ్వుర నెవ్వండు వేఱు చేయకుండు వాఁడు కృతార్థుండు" అని యానతిచ్చిన దక్షుండును.
4-208-క.
విని విష్ణు దేవతాకం
బనఁగాఁ ద్రికపాలకలిత మగు నా యాగం
బునఁ దగ నవ్విష్ణుని పద
వనజంబులు పూజ చేసి వారని భక్తిన్.
4-209-వ.
మఱియును.

టీకా:
అనఘా = పుణ్యుడ; ఏనున్ = నేను; బ్రహ్మయు = బ్రహ్మదేవుడు; శివుండున్ = శివుడు; ఈ = ఈ; జగంబుల్ = లోకముల; కున్ = కు; కారణభూతులము = కారణము యైనవారము; అందున్ = అందులో; ఈశ్వరుండను = ప్రభువును; ఉపద్రష్టయు = పర్యవేక్షకుడను; స్వయంప్రకాశుండును = స్వంతమైన ప్రకాశము కలవాడను; ఐన = అయిన; నేను = నేను; గుణ = త్రిగుణ; మయంబున్ = కూడినది; అయిన = అయిన; ఆత్మీయ = నా యొక్క; మాయన్ = మాయను; ప్రవేశించి = చేరి; జనన = పుట్టుక; వృద్ధి = వృద్ధి; విలయంబుల = విలయముల; కున్ = కు; హేతుభూతంబులు = కారణము యైనవి; అగు = అయిన; తత్తత్ = అయా; క్రియా = పనులకు; ఉచితంబులు = తగునవి; అయిన = అయిన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = శివుడు; ఆది = మొదలగు; నామధేయంబులన్ = పేర్లను; ఒందుచున్ = పొందుతూ; ఉండుదు = ఉంటాను; అట్టి = అటువంటి; అద్వితీయ = రెండవదిలేనట్టి, తిరుగులేని; బ్రహ్మ = పరబ్రహ్మ; రూపకుండను = రూపము కలవాడను; ఐన = అయిన; నా = నా; అందున్ = నుండి; అజ = బ్రహ్మదేవుడు; భవ = శివుడు; ఆదులను = మొదలైనవారిని; భూత = జీవ; గణంబులను = జాలములను; మూఢుండు = తెలివిలేనివాడు; అగువాడు = అయినవాడు; వేఱుగా = వేరువేరుగా; చూచు = చూచును; మనుజుండు = మానవుడు; శరీరంబున్ = దేహమున; కున్ = కు; కర = చేతులు; చరణ = కాళ్ళు; ఆదులు = మొదలగునవి; వేఱుగా = వేరువేరుగా; తలంపని = తలచని; చందంబునన్ = వలెనే; మత్ = నా యొక్క; భక్తుండు = భక్తుడు; అగువాడు = అయినవాడు; నా = నా; అందున్ = ఎడల; భూత = జీవ; జాలంబున్ = గణములను; భిన్నంబు = వేరు; కాన్ = అగునట్లు; తలంపడు = అనుకొనడు; కావునన్ = అందుచేత; మా = మా; మువ్వురన్ = ముగ్గురను; ఎవ్వండు = ఎవరైతే; వేఱుచేయకుండు = వేరుగాచూడకుండునో; వాడు = వాడు; కృతార్థుండు = ప్రయోజనము తీర్చుకొన్నవాడు; అని = అని; ఆనతిచ్చిన = శలవుచేసిన; దక్షుండును = దక్షుడును. విని = విని; విష్ణు = విష్ణువు; దేవతాకంబున్ = దేవతగాకలది; అనగాన్ = అన్నట్లుగా; త్రికపాల = మూడు కుండలు; కలితము = కలిగినది; అగు = అయిన; ఆ = ఆ; యాగంబునన్ = యజ్ఞములో; తగన్ = తగినట్లు; ఆ = ఆ; విష్ణుని = నారాయణుని; పద = పాదములు అనెడి; వనజంబులు = పద్మములు {వనజము - వనము (నీరు) యందు జము (పుట్టినది), పద్మము}; పూజ = పూజ; చేసి = చేసి; వారని = హద్దులేని; భక్తిన్ = భక్తితో. మఱియును = ఇంకను.

భావము:
“పుణ్యాత్ముడా! నేనూ, బ్రహ్మా, శివుడూ ఈ లోకాలకు కారణభూతులం. వారిలో నేను ఈశ్వరుడను, సాక్షిని, స్వయంప్రకాశుడను అయి త్రిగుణాత్మకమైన నా మాయలో ప్రవేశించి సృష్టి స్థితి లయ కార్యాలకు కారణాలైన ఆయా పనులకు బ్రహ్మ రుద్రుడు మొదలైన నామాలను పొందుతాను. నాకంటె వేరైన పరబ్రహ్మ రూపం లేదు. బ్రహ్మ శివుడు మొదలైనవారిని, జీవకోటిని బుద్ధిహీనుడు నాకంటె వేరుగా చూస్తాడు. మనుష్యుడు తన చేతులు, కాళ్ళు మొదలైన అవయవాలను తన శరీరం కంటె వేరుగా చూడనట్లు నా భక్తుడు జీవులను నాకంటె వేరుగా భావింపడు. కనుక మా ముగ్గురిని ఎవడైతే వేరు వేరుగా చూడడో వాడే ధన్యుడు” అని ఉపదేశించగా దక్షుడు... (విష్ణువు ఉపదేశాన్ని దక్షుడు) విని విష్ణుదేవతాకమైన త్రికపాల పురోడాశ మనే యజ్ఞాన్ని చేసి విష్ణుమూర్తి పాదపద్మాలను పరమభక్తితో పూజించాడు. ఇంకా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=208

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::