Monday, June 8, 2015

నారాయణుని వైషమ్య అభావం - నరేంద్రా కృష్ణద్వైపాయనునకు

7-7-వచనము
నరేంద్రా! కృష్ణద్వైపాయనునకు నమస్కరించి హరికథనంబులు జెప్పద వినుము; వ్యక్తుండుగాక గుణంబులు లేక ప్రకృతిం జెందక, భవంబుల నొందక, పరమేశ్వరుండు దన మాయవలన నయిన గుణంబుల నావేశించి, బాధ్యబాధకత్వంబుల నొందు; నతండు గుణరహితుండు; సత్త్వరజస్తమంబులు ప్రకృతిగుణంబు; లా గుణంబులకు నొక్కొక్క కాలంబున హానివృద్ధులు గల; వా యీశ్వరుండు సత్త్వంబున దేవఋషులను, రజోగుణంబున నసురులను, దమోగుణంబున యక్ష రక్షోగణంబులను, విభజించె; సూర్యుండు పెక్కెడలం గానంబడియు నొక్కరుం డైన తెఱంగునఁ దద్విభుండును సర్వగతుండయ్యును భిన్నుండు గాఁడు; తత్త్వవిదులైన పెద్దలు దమలోనం బరమాత్మ స్వరూపంబున నున్న యీశ్వరు నివ్విధంబున నెఱుంగుదురు; జీవాత్మకుఁ బరుండైన సర్వమయుండు తన మాయచేత రజంబును విశ్వంబు సృజింపం గోరి, సత్త్వంబును గ్రీడింపం గోరి, తమంబును నిద్రింపం గోరి యుత్పాదించి, చరమైన కాలంబును సృజియించు; నా కాలంబున సర్వదర్శనుం డైన యీశ్వరుండును గాలాహ్వయుండును నై హరి సత్త్వగుణం బయిన దేవానీకంబునకు వృద్ధియు, రజ స్తమోగుణులయిన రాక్షసులకు హానియుం జేయుచుండు.
          ఓ మహారాజా! పరీక్షిత్తు! కృష్ణదైపాయనుడైన వ్యాసునకు ముందుగా నమస్కరించి పవిత్రమైన విష్ణు కథలు చెప్తాను, విను. శ్రీమన్నారాయణుడు ఇట్టి వాడు అని తెలుసుకోలేము. ఆయన తత్వం ఎవరూ తెలుసుకోలేరు. ఆయన గుణ వికారాలకు అతీతుడు. ప్రకృతికి అంటీ అంటనట్టు ఉండు వాడు. జన్మ బంధాలలో చిక్కుట లేనివాడు. త్రిగుణాలకు అతీతుడు. ఆ పరమేశ్వరుడు తన మాయ తో తానే గుణ వికారాలు కల్పించుకుని బాధలు పెట్టేవాడూ, బాధలు పడేవాడూ తానే అవుతాడు. లోకంలో సత్వ గుణము, రజో గుణము, తమో గుణము అని మూడు రకాల గుణములు ఉన్నాయి. అవి ఒక్కొక్కప్పుడు తగ్గి ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ప్రకోపిస్తుంటాయి. భగవానుడు సత్వగుణం ప్రధానంగా దేవతలను, మునులను; రజోగుణం ప్రధానంగా అసురులనూ; తమోగుణం ప్రధానంగా యక్షుల, రాక్షసుల సమూహాలను వేరువేరుగా సృష్టించాడు; సూర్యుడు వివిధ ప్రదేశాల నుండి వేరు వేరుగా కనబడినప్పటికీ, ఒక్కడే అయినట్లుగా, అన్నిటిలోనూ, అందరిలోనూ సర్వకాల సర్వావస్థలలోను నివసిస్తున్నప్పటికిని వేరుకాడు, అతను ఒక్కడే. ఆ విధంగానే, తత్త్వం తెలిసిన జ్ఞానులు తమలో ఆత్మ స్వరూపంలో ప్రకాశించే దైవమును తెలుసుకుంటారు. జీవాత్మకు ఇతరుడుగా కన్పిస్తూ ఉంటాడు. సర్వం తానే అయి, ప్రభువై, తన మాయాజాలంతో విశ్వాన్ని సృష్టించ దలచి రజోగుణాన్ని, లీలా విలాసాలు చూపించ దలచి సత్వ గుణాన్ని, నిద్రింప దలచి తమోగుణాన్ని కలిగించి, నడుస్తూ ఉండే కాలాన్ని సృష్టించాడు. అట్టి కాలం వలన సర్వత్రా దర్శనం ఇచ్చే ఆ పరమేశ్వరుడు కాలస్వరూపుడు గా పిలువబడతాడు. అటువంటి ఆ స్వామి సత్వగుణ ప్రధానులైన దేవతలకు ఆనందాన్ని, తమోగుణ ప్రధానులైన రాక్షసులకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాడు.   
            నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నరుల (మానవుల)కు ఇంద్రుడు (ప్రభువు), రాజు}; కృష్ణద్వైపాయనున్ = వేదవ్యాసున కృష్ణద్వైపాయనుడు – {కృష్ణ ద్వీపమున వసించువాడు, వేదవ్యాసుడు}; కున్ = కు; నమస్కరించి = నమస్కరించి; హరి = విష్ణు; కథనంబులు = చరిత్రలు; చెప్పెదన్ = చెప్పెదను; వినుము = వినుము; వ్యక్తుండు = కనబడువాడు; కాక = కాకుండగ; గుణంబులు = గుణత్రయములు {గుణత్రయములు - 1సత్త్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; లేక = లేకుండగ; ప్రకృతిన్ = మాయకు; చెందక = లోనుగాక; భవంబులన్ = పునర్జన్మంబులు; ఒందక = పొందకుండగ; పరమేశ్వరుండు = భగవంతుడు; తన = తన యొక్క; మాయ = మాయ; వలనన్ = కారణముచేత; అయిన = ఐనట్టి; గుణంబులన్ = గుణత్రయమునందు; ఆవేశించి = చొచ్చి; బాధ్య = బాధింపచేయువాడు; బాధకత్వంబులన్ = బాధింపబడువాడులగుటను; ఒందున్ = పొందును; అతండు = అతడు; గుణ = గుణములు; రహితుండు = లేనివాడు; సత్త్వరజస్తమంబులు = త్రిగుణములు; ప్రకృతి = స్వభావసిద్ధమైన; గుణంబులు = గుణములు; = ; గుణంబుల్ = గుణముల; కున్ = కు; ఒక్కొక్క = వేరువేరు; కాలంబునన్ = సమయములలో; హాని = తగ్గుటలు, శాంతించుటలు; వృద్ధులు = పెరుగుటలు, ప్రకోపించుటలు; కలవు = జరుగుచుండును; = ; ఈశ్వరుండు = భగవంతుడు; సత్త్వంబునన్ = సత్త్వగుణముతో; దేవ = దేవుళ్ళను; ఋషులను = ఋషులను; రజోగుణంబునన్ = రజోగుణముతో; అసురులను = అసురులను; తమోగుణంబునన్ = తమోగుణముతో; యక్ష = యక్షుల; రక్షస్ = రాక్షసుల; గణంబులను = గుణములను; విభజించెన్ = వేరుగగలిగించెను; సూర్యుండు = సూర్యుడు; పెక్కు = అనేక; ఎడలన్ = ప్రదేశములలో; కానంబడియున్ = కనబడినప్పటికి; ఒక్కరుండు = ఒకడే; ఐన = అయిన; తెఱంగునన్ = విధముగ; తత్ = ; విభుండును = భగవంతుడుకూడ; సర్వ = అన్నిటియందును; గతుండు = ఉండువాడు; అయ్యును = అయినప్పటికిని; భిన్నుండు = వేరైనవాడు; కాడు = కాడు; తత్త్వవిదులు = తత్త్వవిద్యతెలిసినవారు; ఐన = అయిన; పెద్దలు = గొప్పవారు; తమ = వారి; లోనన్ = అందు; పరమాత్మ = పరమాత్మ; స్వరూపంబునన్ = స్వరూపములో; ఉన్న = ఉన్నట్టి; ఈశ్వరున్ = భగవంతుని; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; ఎఱుంగుదురు = తెలిసికొందురు; జీవాత్మ = జీవుడైనతని; కున్ = కి; పరుండు = ఇతరమైనవాడు; ఐన = అయిన; సర్వ = అన్నిటియందును; మయుండు = నిండి యుండువాడు; తన = తన యొక్క; మాయ = మాయ; చేతన్ = వలన; రజంబును = రజోగుణమును; విశ్వంబున్ = ప్రపంచమును; సృజింపన్ = సృష్టింపవలెనని; కోరి = భావించియు; సత్త్వంబును = సత్త్వగుణమును; క్రీడింపన్ = క్రీడింపవలెనని; కోరి = భావించియు; తమంబును = తమోగుణమును; నిద్రింపన్ = నిద్రింపవలెనని; కోరి = భావించియు; ఉత్పాదించి = సృష్టించి; చరము = కదలెడిలక్షణముగలది; ఐన = అయిన; కాలంబును = కాలమును; సృజియించున్ = సృష్టించును; ఆ = ఆ; కాలంబునన్ = కాలముయందు; సర్వ = అన్నిటిని; దర్శనుండు = కాంచెడివాడు; ఐన = అయిన; ఈశ్వరుండును = భగవంతుడును; కాల = కాలుడు యనెడి; ఆహ్వయుండును = పేరుగలవాడు; ఐ = అయ్యి; హరి = విష్ణుమూర్తి; సత్త్వగుణంబున్ = సత్త్వగుణముగలవారు; ఐన = అయిన; దేవ = దేవతలు; అనీకంబున్ = సర్వుల; కున్ = కు; వృద్ధియున్ = పెంపును; రజస్ = రజస్సుయైన; తమస్ = తమస్సుయైన; గుణులు = గుణములుగలవారు; అయిన = ఐనట్టి; రాక్షసుల్ = రాక్షసుల; కున్ = కు; హానియున్ = నాశమును; చేయుచుండు = కలిగించుచుండును.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: