Wednesday, June 10, 2015

నారాయణుని వైషమ్య అభావం - మున్ను ధర్మరాజు

7-9-వచనము
మున్ను ధర్మరాజు చేయు రాజసూయయాగంబున బాలుండైన శిశుపాలుండు హరిని నిందించి నిశితనిర్వక్రచక్రధారాదళితమస్తకుం డయి తేజోరూపంబున వచ్చి హరిదేహంబు జొచ్చినం జూచి వెఱఁగు పడి ధర్మజుండు సభలోనున్న నారదునిం జూచి యిట్లనియె.
          పూర్వం ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్నాడు. అజ్ఞాని అయిన శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందించాడు. బహు వాడి అయిన సుదర్శన చక్రంతో కృష్ణుడు అతని తల ఖండించాడు. అతని ఆత్మ తేజోరూపంతో కృష్ణునిలో ఐక్యం అయింది. అది చూసి ఆశ్చర్యపోయి, ధర్మరాజు అప్పుడు అక్కడ సభలో ఉన్న నారదుడితో ఇలా అన్నాడు. 
७-९-वचनमु
मुन्नु धर्मराजु चॅयु राजसूययागंबुन बालुंडैन शिशुपालुंडु हरिनि निंदिंचि निशितनिर्वक्रचक्रधारादळितमस्तकुं डयि तॅजॉरूपंबुन वच्चि हरिदॅहंबु जोच्चिनं जूचि वेर्रँगु पडि धर्मजुंडु सभलॉनुन्न नारदुनिं जूचि यिट्लनिये.
            మున్ను = పూర్వము; ధర్మరాజు = ధర్మరాజు; చేయు = చేసెడి; రాజసూయ = రాజసూయము యనెడి {రాజసూయము - ఒకరాజు తక్కిన రాజులను జయించి చేసెడి యజ్ఞము}; యాగంబునన్ = యజ్ఞమునందు; బాలుండు = అజ్ఞాని; ఐన = అయిన; శిశుపాలుండు = శిశుపాలుడు {శిశుపాలుడు - శ్రీకృష్ణుని మేనత్త కొడుకు, చేదిదేశపు రాజు}; హరిని = శ్రీకృష్ణుని; నిందించి = తిట్టి; నిశిత = వాడియైన; నిర్వక్ర = మరల్పరాని; చక్ర = చక్రముయొక్క; ధారా = అంచులచే; దళిత = ఖండింపబడిన; మస్తకుండు = శిరస్సుగలవాడు; అయి = అయ్యి; తేజస్ = వెలుగు; రూపంబునన్ = రూపముతో; వచ్చి = చేరి; హరి = శ్రీకృష్ణుని; దేహంబున్ = శరీరమును; చొచ్చినన్ = ప్రవేశించగా, ఐక్యముకాగా; చూచి = చూసి; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; ధర్మజుండు = ధర్మరాజు; సభ = సభావాటిక; లోనన్ = అందు; ఉన్న = ఉన్నట్టి; నారదునిన్ = నారదుని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: