7-12-మత్తేభ విక్రీడితము
హరిసాధింతు హరిన్ గ్రసింతు హరిఁ బ్రాణాంతంబు నొందింతుఁ దా
హరికిన్ వైరినటంచు వీఁడు పటురోషాయత్తుఁడై యెప్పుడుం
దిరుగుం, బ్రువ్వదు నోరు, వ్రీలిపడ దా దేహంబు, దాహంబుతో
నరకప్రాప్తియు నొందఁ, డే క్రియ జగన్నాథుం బ్రవేశించెనో?
ఈ శిశుపాలుడు ఎప్పుడూ రోషంతో, ద్వేషంతో
తిరుగుతుండేవాడు; ఎప్పుడూ “కృష్ణుణ్ణి ఓడిస్తా, పట్టుకుంటా, చంపేస్తా, కృష్ణుడు నా బద్ధ విరోధి” అంటూ ఉండే వాడు కదా! పుణ్యపురుషుని దూషించే వీడికి
పురుగులు పట్టి నోరు ఎందుకు పుచ్చిపోలేదు; శరీరావయవాలు
విరిగి పడిపోలేదు; దేహం దహించి నరకంలో పడిపోలేదు; పైగా వాడి ఆత్మ ఎలా సర్వలోకాధి నాయకుడైన శ్రీహరిలో ప్రవేశించింది;
७-१२-मत्तॅभ विक्रीडितमु
हरिसाधिंतु हरिन ग्रसिंतु हरिँ ब्राणांतंबु नोंदिंतुँ
दा
हरिकिन वैरिनटंचु वीँडु पटुरॉषायत्तुँडै येप्पुडुं
दिरुगुं, ब्रुव्वदु नॉरु, व्रीलिपड दा दॅहंबु, दाहंबुतॉ
नरकप्राप्तियु नोंदँ, डॅ क्रिय जगन्नाथुं ब्रवॅशिंचेनॉ?
హరిన్ = శ్రీకృష్ణుని; సాధింతున్ = ఓడించెదను; హరిన్ = శ్రీకృష్ణుని; గ్రసింతున్ = మింగెదను; హరిన్ = శ్రీకృష్ణుని; ప్రాణాంతంబున్ = మరణమునకు; ఒందింతున్ = చెందించెదను; తాన్ = తను; హరి = శ్రీకృష్ణుని; కిన్ = కి; వైరిన్ = శత్రువును; అట = అని; అంచున్ = అనుచు; వీడు = ఇతడు; పటు = దట్టమైన; రోష = కోపము; ఆయత్తుడు = కలవాడు; ఐ = అయ్యి; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; తిరుగున్ = మళ్ళీ; ప్రువ్వదు = పుచ్చిపోదు; నోరు = నోరు; వ్రీలి = విరిగి; పడదు = కూలిపోదు; ఆ = ఆ; దేహంబున్ = శరీరము; దాహంబు = యాతనల; తోన్ = తోటి; నరక = నరకమును; ప్రాప్తియున్ = చెందుటను; ఒందడు = పొందడు; ఏ = ఏ; క్రియన్ = విధముగ; జగన్నాథున్ = విష్ణువునందు {జగన్నాథుడు - జగత్తునకు నాథుడు, విష్ణువు}; ప్రవేశించెనో = చేరెనో.
: :చదువుకుందాం భాగవతం;
బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment