7-13-వచనము
అదియునుం గాక, దంతవక్త్రుండును వీఁడును నిరంతరంబు గోవిందు నింద జేయుదురు; నిఖిలజనులు సందర్శింప నేఁడు వీనికి విష్ణు సాయుజ్యంబు గలుగుట కేమి హేతువు?
వినిపింపుము; పవన చలితదీపశిఖయునుం బోలె నా
హృదయంబు సంచలించుచున్న" దనిన, ధర్మనందనునకు నారదుం
డిట్లనియె; "దూషణభూషణతిరస్కా రంబులు శరీరంబునకుం గాని
పరమాత్మకు లేవు; శరీరాభిమానంబునం జేసి దండవాక్పారుష్యంబులు
హింసయై తోఁచు తెఱంగున; నేను నాయది యనియెడు వైషమ్యంబును
భూతంబులకు శరీరంబు నందు సంభవించు; అభిమానంబు బంధంబు; నిరభిమానుండై వధించినను వధంబుగాదు; కర్తృత్వ
మొల్లనివానికి హింసయు సిద్ధింపదు; సర్వభూతాత్మకుండైన
యీశ్వరునికి వైషమ్యంబు లేదు; కావున.
ఇంతే కాకుండా, ఈ శిశుపాలుడూ, వీడి
తమ్ముడు దంతవక్త్రుడూ ఎప్పుడూ కృష్ణుణ్ణి నిందించే వాళ్ళే కదా! అంతటి పాపీ, ఇందరు చూస్తుండగా పరమ
ముక్తి గమ్యమైన విష్ణుసాయుజ్యం ఎలా పొందాడు? ఈ సందేహం తీరక,
గాలికి కొట్టుమిట్టాడే దీపంలా, నా హృదయం చలించిపోతోంది. దీనికి కారణం ఏమిటో చెప్పి
నా సందేహం తీర్చు?” అన్నాడు. అప్పుడు నారదమహర్షి ఇలా అన్నాడు. “తిట్టినా, పొగిడినా అవి దేహానికే కాని ఆత్మకు,
పరబ్రహ్మకు అంటవు; దండించటం, తిట్టటం, కొట్టటం వంటివి దేహం
మీద మమకారంతో బాధ హింసలా తోస్తాయి; జీవులకు సహజమైన అహంకార
మమకారాలు లేకుండా అభిమాన బంధం లేకుండా చంపేసినా కూడా అది హత్యా కాదు, పాపం అంటదు; చేసిన వాడిని నేను అనే కర్తృత్వం వదలిపెట్టిన వానికి జీవహింస, పాపాలు ఏవీ
అంటవి; ఎల్ల జీవులలో అంతరాత్మగా ఉండే భగవానునికి భేదభావం
అన్నది లేదు; ఎవరిమీదా దేనిమీదా ద్వేషంకానీ, విరోధంకానీ
ఎప్పడూ ఎక్కడా విష్ణుమూర్తికి ఉండదు;
అదియునున్ = అంతే; కాక = కాకుండగ; దంతవక్త్రుండును = దంతవక్త్రుడు {దంతవక్త్రుడు - శిశుపాలుని తమ్ముడు}; వీడునున్ = ఇతడు; నిరంతరంబు = ఎల్లప్పుడును; గోవిందున్ = శ్రీకృష్ణుని; నిందన్ = తెగడుట; చేయుదురు = చేయుచుందురు; నిఖిల = ఎల్ల; జనులున్ = లోకులు; సందర్శింపన్ = చక్కగ
చూచుచుండగా; నేఁడు = ఇప్పుడు; వీని = ఇతని; కిన్ = కి; విష్ణు = విష్ణుమూర్తియందు; సాయుజ్యంబున్ = ఐక్యమగుట; కలుగుట = సంభవించుట; కున్ = కు; ఏమి = ఏమిటి; హేతువు = కారణము; వినిపిపంపుము = తెలుపుము; పవన = గాలికి; చలిత = కొట్టుకొనెడి; దీప = దీపము యొక్క; శిఖయున్ = మంట; పోలెన్ = వలె; నా = నా యొక్క; హృదయంబు = హృదయము; సంచలించుచున్నది = కలతనొందుచున్నది; అనినన్ = అనగా; ధర్మనందనున్ = ధర్మరాజున {ధర్మనందనుడు - యమధర్మరాజు యొక్క పుత్రుడు, ధర్మరాజు}; కున్ = కు; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; దూషణ = తెగడుట; భూషణ = పొగడుట; తిరస్కారంబులు = అవమానించుటలు; శరీరంబున్ = దేహమున; కున్ = కు; కాని = కాని; పరమాత్మ = పరమాత్మ; కున్ = కు; లేవు = లేవు; శరీర = దేహమందలి; అభిమానంబునన్ = అహంకారము; చేసి = వలన; దండ = కొట్టుట; వాక్పారుష్యంబులున్ = కఠినముగామాట్లాడుట; హింస = వధించుట; ఐ = జరుగునట్లు; తోచు = తెలియు; తెఱంగునన్ = విధముగ; నేను = నేను; నాయది = నాది; అనియెడు = అనెడి; వైషమ్యంబును = భేదభావము; భూతంబుల్ = జీవుల; కున్ = కు; శరీరంబున్ = దేహమున; అందున్ = అందు; సంభవించు = కలుగును; అభిమానంబు = అహంకారము; బంధంబు = బంధములు;
నిరభిమానుండు = అభిమానములేనివాడు; ఐ = అయ్యి;
వధించినను = చంపినను; వధంబు = హత్య; కాదు = కాదు; కర్తృత్వము = కర్త యైన భావము; ఒల్లని = అంగీకరించనట్టి; వాని = అతని; కిన్ = కి; హింసయున్ = హత్యాపాపము; సిద్ధింపదు = కలుగదు; సర్వ = సమస్తమైన; భూత = జీవులు; ఆత్మకుండు = లోనుండువాడు, తానైనవాడు; ఐనన్ = అయినట్టి; ఈశ్వరున్
= భగవంతుని; కిన్ = కి; వైషమ్యంబున్ = భేదభావము,శత్రుత్వభావము; లేదు = లేదు; కావున
= అందుచేత.
: :చదువుకుందాం భాగవతం;
బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment