Friday, September 19, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – చిక్కడు

7-243-క.
చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ
జిక్కఁడు దానముల శౌచ శీల తపములం
జిక్కఁడు యుక్తిని భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ!
          ఈ పద్యం ఎంతో గొప్పది అని చెప్పవచ్చు. భాగవత తత్వార్థాన్ని చిన్న చిన్న పదాల్లో సిద్దాంతీకరించి భక్తాగ్రేసరు డైన రాక్షసబాలుని నోట ఈ పద్యం రూపంలో ఇలా పలికించాడు పోతన గారు. ప్రహ్లాదుడు సహాధ్యాయులు అయిన రాక్షస బాలురకు తన దైన నారదోపదిష్ట భాగవత తత్వాన్ని ప్రపత్తి మార్గాన్ని తెలిపి విష్ణుభక్తి విలక్షణత వివరిస్తున్నాడు. –
          భగవంతుడు గాఢ మైన భక్తికి వశమై నట్లు; నోములు, యాగాలు, దానాలు, శుచిత్వాలు, మంచి నడవడికలు, తపస్సులు, యుక్తులు లాంటివి వాటికి వేటికీ వశము కాడు. భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందడానికి సాధనం. భక్తి వినా వేరు మార్గం లేనే లేదు. దిగజారిపోవడమే లేనట్టి ఉన్నతతమ శాశ్వత స్థితిలో ఉండే భగవంతుడు ఇంకే మార్గంలో పట్టుకుందా మన్నా, బిగించే కొద్దీ వేళ్ళ మధ్యనుండి జారిపోయే నీళ్ళలా జారి పోతుంటాడు. భక్తికి అయితేనే భద్రంగా చిక్కుతాడు.
7-243-ka.
chikka@MDu vratamula@M gratuvula@M
jikka@MDu daanamula Saucha Seela tapamulaM
jikka@MDu yuktini bhaktini
jikkina kriya nachyutuMDu siddhamu suMDee!
          చిక్కడు = దొరకడు; వ్రతములన్ = వ్రతముల ఆచరణల చేత; క్రతువులన్ = యజ్ఞములు చేయుట చేత; చిక్కడు = దొరకడు; దానములన్ = దానములు చేయుట చేత; శౌచ = శుచి శుభ్రముల; శీల = మంచి నడవడికల; తపములన్ = తపస్సుల చేత; చిక్కడు = దొరకడు; యుక్తిని = తెలివి మిక్కలిగా వాడుట చేత; భక్తిని = భక్తి వలన; చిక్కిన = దొరకిన; క్రియన్ = వలె; అచ్యుతుండు = హరి {అచ్యుతుడు - చ్యుతము (జారిపోవుట) లేనివాడు, విష్ణువు}; సిద్ధము = సత్యము; సుండీ = సుమా.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: