Saturday, September 6, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 404

అన్నశమింపుమన్న

10.1-150-ఉ.
న్న! శమింపుమన్న! తగ ల్లుఁడు గాఁ డిది మేనగోడ లౌ
న్నన జేయు మన్న! విను మానినిఁ జంపుట రాచపాడి గా
న్న! సుకీర్తివై మనఁగ న్న! మహాత్ములు పోవు త్రోవఁ బో
న్న! భవత్సహోదరిఁ గన్న! నినున్ శరణంబు వేడెదన్.
          ఓ అన్నా కంసా! శాంతించవయ్యా! ఇది నిన్ను సంహరించే మేనల్లుడు అయ్యే మగపిల్లవాడు కాదు. ఈమె ఆడపిల్ల నీకు మేనకోడ లవుతుంది. ముద్దు జేయుమయ్య! ఆడవారిని చంపుట క్షత్రియ మర్యాదలకు తగిన పని కాదు కదయ్య! కోపాన్ని చల్లార్చుకొని మహాత్ములు నడచే దారిలో నడువవయ్య! మంచి కీర్తిమంతుడవు కావయ్య! నేను నీ సోదరి నయ్య! నిన్ను శరణు వేడుతున్నానయ్య! ఈ పిల్లను వదిలెయ్యవయ్య!
దేవకీదేవి కన్న శైశవ కన్నయ్యను యశోద పక్కలో పడుకోబెట్టి, అక్కడి ఆడశిశువుగా జనించిన మాయాదేవిని జైలులోకి తెచ్చాడు వసుదేవుడు. కావలివా రొచ్చి కంసునికి దేవకి ప్రసవించిందని తెలిపారు. అతను శిశువును చంపడానికి సిద్ధమౌతున్నాడు. అప్పుడు దేవకీదేవి చంపవద్దని ఇలా వేడుకుంటోంది.
10.1-150-u.
anna! SamiMpumanna! taga dallu@MDu gaa@M Didi maenagODa lau
mannana jaeyu manna! vinu maanini@M jaMpuTa raachapaaDi gaa
danna! sukeertivai mana@Mga danna! mahaatmulu pOvu trOva@M bO
vanna! bhavatsahOdari@M gadanna! ninun SaraNaMbu vaeDedan.
          అన్న = పెద్దసోదరుడా; శమింపుము = ఓర్చుకొనుము; అన్న = తండ్రి; తగదు = ఇది మంచిది కాదు; అల్లుడు = నీకు అల్లు డయ్యే బాలుడు; కాడు = కాడు; ఇది = ఈమె; మేనకోడలు = మేనకోడలు (ఆడపిల్ల); = అగును; మన్నన జేయుము = మన్నింపుము; అన్న = తండ్రి; విను = వినుము; మానినిన్ = స్త్రీని; చంపుట = వధించుట; రాచ = క్షత్రియులకు; పాడి = తగినది; కాదు = కాదు; అన్న = తండ్రి; సు = మంచి; కీర్తివి = కీర్తికలవాడు; = అయ్యి; మనన్ కద = బ్రతుకుము; అన్న = తండ్రి; మహాత్ములు = గొప్పవారు; పోవు = నడచెడి; త్రోవన్ = దారిలో; పోవు = వెళ్ళుము; అన్న = తండ్రి; భవత్ = నీ యొక్క; సహోదరిన్ = తోడబుట్టినదానిని; కద = కదా; అన్న = తండ్రి; నినున్ = నిన్ను; శరణంబున్ = రక్షణముకై; వేడెదన్ = ప్రార్థించెదను.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: