Sunday, September 19, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౨(342)

( దిగ్విజయంబు) 

10.2-702-క.
మనుచరిత! నీ సహోదరు
లనుపమ దివ్యాస్త్రవేదు లాహవభూమిం
జెనకిన వైరినృపాలురఁ
దునుమఁగఁ జాలుదురు శౌర్యదుర్దమ భంగిన్.
10.2-703-క.
గెలువుము విమతనృపాలుర
వెలయుము బుధవినుతమైన విశ్రుతకీర్తిన్
నిలుపుము నిఖిలధరా మం
డలిని భవచ్ఛాసనము దృఢంబుగఁ జెల్లన్.
10.2-704-క.
నీ పంచుకార్య మొరులం
జూపక యేఁ జేయ నిన్ను జుట్టన వ్రేలం
జూపఁగ వచ్చునె! సకల ధ
రాపతులకు నీకుఁ జేయరానిది గలదే! .
10.2-705-వ.
కావున. 

భావము:
ఓ యుధిష్టరా! నీ తమ్ముళ్ళు దివ్యమైన ఎదురులేని అస్త్రవిద్యా విశారదులు; యుద్ధభూమిలో ఎదిరించిన శత్రురాజులను సంహరించడంలో చక్కని సామర్థ్యం కలవారు. శత్రురాజులను జయించు; శాశ్వతమైన యశస్సుతో ప్రకాశించు; సమస్త భూమండలంలో నీ శాసనం చెల్లేలాగ స్థిరంగా స్థాపించు. నీవు ఏ కార్యం చెప్తే దానిని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక నిన్ను వేలెత్తి చూపడానికి ఈ లోకంలో రాజులు ఎవ్వరికీ సాధ్యం కాదు. నీకు సాధ్యం కాని కార్యం లేదు. అందుచేత..... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=704 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: