Saturday, September 18, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౧(341)

( దిగ్విజయంబు) 

10.2-699-ఉ.
ఎవ్వరు నీ పదాంబుజము లెప్పుడుఁ గొల్తురు భక్తి నిష్ఠులై,
యెవ్వరు నిన్నుఁ బ్రేమ నుతియింతురు భూరివివేకశాలురై,
యవ్విమలాత్ము లందుదు రుదంచితశోభన నిత్యసౌఖ్యముల్‌
నివ్వటిలంగఁ గృష్ణ! నిను నేర్చి భజించిన రిత్తవోవునే! "
10.2-700-వ.
అనినఁ గృష్ణుండు ధర్మనందనున కిట్లనియె.
10.2-701-చ.
"నయగుణశాలి! పాండునృపనందన! నీ తలఁ పొప్పు నీక్రతు
క్రియ మునిదేవతాపితృ సుకృత్యమునై నిఖిలోగ్రశాత్రవ
క్షయమును బాంధవప్రియము సంచితపుణ్యము నిత్యకీర్తియున్
జయము నొసంగు దీనిఁ గురుసత్తమ! వేగ యుపక్రమింపవే! 

భావము:
కృష్ణా! భక్తితో నీ పాదపద్మాలను ధ్యానించే వారు, మంచి బుద్ధిమంతులై నిన్ను ప్రేమతో సన్నుతించు వారు సదా సుఖసంతోషాలను పొందుతారు. నిన్ను శ్రద్దగా పూజించటం ఎన్నటికీ వ్యర్థంకాదు కదా.” ఈ విధంగా పలికిన ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “ఓ పాండురాజు కుమారా! ధర్మరాజా! కురువంశ శ్రేష్ఠుడా! రాజనీతి విశారదుడవు నీ ఆలోచన సమంజసంగా ఉంది. ఈ రాజసూయ ప్రక్రియ మునులకు, దేవతలకు, పితృదేవతలకు అభీష్టమైనది. అది సమస్త శత్రు క్షయాన్ని, సకల బంధువు ప్రియాన్ని, సమధికమైన పుణ్యాన్ని, శాశ్వతమైన కీర్తిని, విజయాన్ని, సిద్ధింప చేస్తుంది. కాబట్టి శీఘ్రమే ఈ యాగాన్ని ప్రారంభించు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=701 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: