Sunday, January 31, 2021

శ్రీ కృష్ణ విజయము - 139

( కాలయవనుడు నీరగుట )

10.1-1638-ఆ.
అనుచు యవనుఁ డట్టహాసంబు గావించి
చటుల కఠిన కులిశ సదృశమైన
పాదమెత్తి తన్నెఁ బాఱి తద్దేహంబు
నగగుహం బ్రతిస్వనంబు నిగుడ.
10.1-1639-ఉ.
తన్నిన లేచి నీల్గి కనుదమ్ములు మెల్లన విచ్చి లోపలన్
సన్నపు గిన్క వర్ధిల దిశల్గని దృష్టి సమిద్ధ విగ్రహో
త్పన్న మహాగ్నికీలముల భస్మముచేసె నతండు సాయక
చ్ఛిన్నవిరోధికంఠవను శ్రీభవనున్ యవనున్ లఘుక్రియన్.
10.1-1640-వ.
ఇట్లేక క్షణమాత్రంబున యవనుండు నీఱయ్యె” ననిన విని రాజు యిట్లనియె.

భావము:
అంటూ కాలయవనుడు అట్టహాసంగా నవ్వి, పరుగెట్టుకొని వెళ్ళి, ఎగిరి, కర్కశమైన వజ్రాయుధంవంటి తన కాలితో ఆ నిద్రపోతున్న పురుషుడిని తన్నాడు. ఆ తన్నుకు పర్వతగుహ అంతా మారుమ్రోగిపోయింది. అలా యవనుడు తన్నడంతోనే నిద్రలేచిన ఆ పురుషుడు ఒళ్ళువిరుచుకుంటూ, పద్మాలవంటి కన్నులువిచ్చి, పొటమరించిన కోపం వృద్ధిపొందగా. నాలుగు మూలలా చూసాడు. తన చూపులలో మహోగ్రమైన ఆగ్రహంవలన జనించిన మహాగ్ని జ్వాలలతో ఆయన, శత్రువుల కుత్తుకలనే అడవులను తన కత్తితో ఛేదించినవాడూ, సంపదలకు నిలయమైనవాడూ అయిన కాలయవనుడిని అలవోకగా బూడిద చేసేసాడు. అలా ఒక్క క్షణకాలంలో యవనుడు భస్మ మైపోయాడు” అని శుకమహర్షి చెప్పగా వినిన పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=198&padyam=1639

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 138

( కాలయవనుడు వెంటజనుట )

10.1-1636-ఉ.
“ఆలము చేయలేక పురుషాధమ! దుర్లభ కంటకద్రుమా
భీల మహాశిలా సహిత భీకర కుంజర ఖడ్గ సింహ శా
ర్దూల తరక్షు సంకలిత దుర్గపథంబునఁ బాఱుతెంచి యీ
శైలగుహన్ సనిద్రుక్రియఁ జాఁగి నటించినఁ బోవనిత్తునే?
10.1-1637-క.
ఎక్కడ నెవ్వారలకును
జిక్క వనుచు నారదుండు చెప్పెను; నాకుం
జిక్కి తి వెక్కడఁ బోయెదు?
నిక్కముగా నిద్రపుత్తు ని న్నీ కొండన్.”

భావము:
“ఓరీ! పురుషాధమా! నాతో యుద్ధం చేయలేక ముళ్ళ చెట్లు, బండ రాళ్ళు, ఏనుగులు, ఖడ్గమృగాలు, సింహములు, శార్దూలములు, సివంగులు మొదలైన జంతువులతో భీతికొల్పుతూ నడవడానికి వీలుకాని దారిలోపడి పరుగెత్తుకుని వచ్చి ఈ కొండగుహలో దూరి నిద్రిస్తున్న వాడి వలె నటిస్తున్నావా? నిన్ను వదుల్తాను అనుకుంటున్నావా? నీవు ఎక్కడా ఎవరికీ చిక్కవని నారదుడు చెప్పాడు. ఇదిగో ఇక్కడ నాకు చిక్కావు. ఇంకెక్కడకి వెడతావు నిద్రనటిస్తున్న నిన్ను నిజంగా ఈ కొండగుహలోనే దీర్ఘనిద్రలోకి పంపుతానులే.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=197&padyam=1637

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, January 30, 2021

శ్రీ కృష్ణ విజయము - 137

( కాలయవనుడు వెంటజనుట )

10.1-1633-క.
దారిత శాత్రవ భవను న
పార మహావేగ విజిత పవనున్ యవనున్
దూరఁము గొనిచని కృష్ణుఁడు
ఘోరంబగు నొక్క శైలగుహ వడిఁ జొచ్చెన్.
10.1-1634-క.
అదె లోఁబడె నిదె లోఁబడె
నదె యిదె పట్టెద నటంచు నాశావశుఁడై
యదుసింహుని పదపద్ధతి
వదలక గిరిగహ్వరంబు వాఁడుం జొచ్చెన్.
10.1-1635-వ.
ఇట్లు చొచ్చి మూఢహృదయంబునుం బోలెఁ దమఃపూర్ణంబయిన గుహాంతరాళంబున దీర్ఘతల్పనిద్రితుండయి గుఱక లిడుచున్న యొక్క మహాపురుషునిం గని శ్రీహరిగాఁ దలంచి.

భావము:
శ్రీకృష్ణుడు, శత్రువుల మందిరాలను భేదించినవాడూ, అంతులేని గొప్పవేగంతో గాలినైనా ఓడించువాడూ అయిన యవనుడిని దూరంగా తీసుకుపోయి భయంకరమైన ఒక కొండగుహలో చటుక్కున దూరాడు. “అదిగో దొరికేసాడు, ఇదిగో దొరికేసాడు, అదిగో పట్టుకుంటున్నాను, ఇదిగో పట్టేసుకుంటాను” అనే ఆశకు లోబడి, ఆ యదువంశపు సింహం అడుగులజాడలమ్మట పట్టుదలగా కాలయవనుడు తాను కూడా ఆ పర్వతగుహలోకి వెళ్ళాడు. అజ్ఞానంతో నిండిన మూఢుని హృదయం మాదిరి చీకటితో నిండిన ఆ గుహలోపలకి యవనుడు ఈలాగ చొరపడి, అక్కడ పెద్ద పాన్పుమీద నిద్రలో మునిగి గురకపెడుతున్న ఒక మహాపురుషుడిని చూసి అతడే శ్రీకృష్ణుడని అనుకుని.....


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=197&padyam=1634

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 136

( కాలయవనుడు వెంటజనుట )

10.1-1631-సీ.
సకలభూతవ్రాత సంవాసుఁ డయ్యును-
  వనములు నగములు వరుస దాఁటు;
లోకోన్నతుండును లోకచక్షుఁడు నయ్యు-
  మాటిమాటికి నిక్కి మగిడి చూచుఁ;
బక్ష విపక్ష సంబంధ శూన్యుం డయ్యుఁ-
  దనుఁ విపక్షుఁడు వెంటఁ దగుల నిగుడు;
విజయాపజయభావ విరహితుం డయ్యుఁ దా-
  నపజయంబునుఁ జెందినట్లు తోఁచు;
10.1-1631.1-ఆ.
నభయ భయ విహీనుఁ డయ్యు భీతుని మాడ్కిఁ
గానఁబడును సర్వకాలరూపుఁ
డయ్యుఁ గాలచకితుఁడైన కైవడి వన
మాలి పఱచు వెఱపుమాలి యధిప!
10.1-1632-వ.
ఇ వ్విధంబున.

భావము:
ఓ పరీక్షన్నరేంద్రా! వనమాల ధరించేవాడైన ఆ శ్రీకృష్ణుడు, (యవనుడు తనను వెంటబడుతుంటే) బెఱుకు వీడి పరుగెడుతున్నాడు. నిఖిల భూతములలో నివసించు వాడు అయినా, అడవులు కొండలు వరుసగా దాటుతున్నాడు; లోకాలకే అధికుడు లోకాలకు కన్నువంటి వాడు అయినా, సారెసారెకూ నిక్కినిక్కి చూస్తున్నాడు; తన వారు పైవారు అన్న భేదం లేనివాడు అయినా, తాను ఓటమి చెందినట్లు గోచరిస్తున్నాడు; భయ నిర్భయాలు లేనివాడు అయినా, భయపడ్డవాని వలె కనిపిస్తున్నాడు; కాలస్వరూపుడు అయినా కాలానికి (కాలయవనుడు) కలతపడ్డవాడిలా కనపడుతున్నాడు. అలా అలా....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=197&padyam=1631

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :l

Monday, January 25, 2021

శ్రీ కృష్ణ విజయము - 135

( కాలయవనుడు వెంటజనుట )

10.1-1629-సీ.
అదె యిదె లోఁబడె నని పట్టవచ్చినఁ-
  గుప్పించి లంఘించుఁ గొంతతడవు
పట్టరా; దీతని పరు వగ్గలం బని-
  భావింపఁ దన సమీపమున నిలుచు
నడరి పార్శ్వంబుల కడ్డంబు వచ్చినఁ-
  గేడించి యిట్టట్టు గికురుపెట్టు;
వల్మీక తరు సరోవరము లడ్డంబైన-
  సవ్యాపసవ్య సంచరతఁ జూపుఁ;
10.1-1629.1-తే.
బల్లముల డాఁగు; దిబ్బల బయలుపడును;
నీడలకుఁ బోవు; నిఱుముల నిగిడి తాఱు
"నన్నుఁ బట్టిన నీవు మానవుఁడ" వనుచు
యవనుఁ డెగువంగ బహుజగదవనుఁ డధిప!
10.1-1630-వ.
మఱియును.

భావము:
“ఇదిగో దొరికేసాడు. అదిగో చిక్కిపోయాడు” అని అనుకుంటూ కాలయవనుడు పట్టుకొనుటకు రాగా కృష్ణుడు కుప్పించి దుముకుతాడు. “ఇతని వేగం చాలా ఎక్కువగా ఉంది. వీణ్ణి పట్టుకోలేను” అని కాలయవనుడు భావించి నప్పుడు దగ్గరగా వచ్చి నిలబడతాడు. అతడు బంధించడానికి ప్రక్కకి వచ్చినపుడు శ్రీహరి వాని కనుగప్పి తప్పించుకుని వెడతాడు. పుట్టలు, చెట్లు, తటాకాలు అడ్డం వచ్చినప్పుడు గోవిందుడు కుడి ఎడమ వైపులకు మళ్ళి పరుగులు తీస్తాడు. పల్లపు నేలలో దాగుకుంటాడు. మిట్టలెక్కి బయట పడతాడు. నీడలలోకి వెడతాడు. మారుమూలలో తారాట్లాడుతాడు. “నన్ను పట్టుకుంటేనే నీవు మగాడివి” అంటూ లోకరక్షకుడైన శ్రీకృష్ణుడు తనను తరుముతున్న కాలయవనుడిని ముప్పతిప్పలు పెట్టాడు. ఇంకా......

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=197&padyam=1629

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 134

( కాలయవనుడు వెంటజనుట )

10.1-1627-మ.
శరముల్ దూఱవు; మద్ధనుర్గుణలతాశబ్దంబు లేతేర; వీ
హరిరింఖోద్ధతిధూళి గప్ప; దకటా! హాస్యుండవై పాఱె; దు
ర్వరపై నే క్రియఁ బోరితో కదిసి మున్ వాతాశితోఁ గేశితో
గరితో మల్లురతో జరాతనయుతోఁ గంసావనీనాథుతోన్."
10.1-1628-వ.
అని పలుకుచుఁ గాలయవనుండు వెంట నరుగుదేర సరకుచేయక మందహాసంబు ముఖారవిందంబునకు సౌందర్యంబు నొసంగ “వేగిరపడకు; రమ్ము ర” మ్మనుచు హరియును.

భావము:
ఇంకా, నా గుఱ్ఱాల కాలిడెక్కల ధూళి నిన్ను కప్పేయ లేదు. నా వింటి అల్లెత్రాటి మ్రోతలు వినిపించనే లేదు. నీ శరీరంలో నా బాణాలు నాటనే లేదు. అయ్యయ్యో అప్పుడే పారిపోతున్నా వేమిటి. మునుపు కాళీయుడితో, కేశితో, కువలయాపీడంతో, మల్లుజెట్టిలతో, జరాసంధుడితో, కంసడితో ఏలా పోరాడావో ఏమిటో? ఇలా అంటూ తనను వెంబడిస్తున్న కాలయవనుడి మాటలను లెక్కచేయకుండా శ్రీకృష్ణుడు చిరునవ్వు అలంకరించిన మోముతో “తొందరపడకు. రమ్ము రమ్ము” అంటూ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=197&padyam=1627

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, January 23, 2021

శ్రీ కృష్ణ విజయము - 133

( కాలయవనుడు వెంటజనుట )

10.1-1623-వ.
అప్పుడు కాలయవనుం డిట్లనియె.
10.1-1624-మ.
"యదువంశోత్తమ! పోకుపోకు రణ మీ నర్హంబు; కంసాదులం
గదనక్షోణి జయించి తీ వని సమిత్కామంబునన్ వచ్చితిన్;
విదితఖ్యాతులు వీటిపోవ నరికిన్ వెన్నిచ్చి యిబ్భంగి నే
గుదురే రాజులు? రాజమాతృఁడవె? వైగుణ్యంబు వచ్చెంజుమీ?
10.1-1625-మ.
బలిమిన్ మాధవ! నేఁడు నిన్ను భువనప్రఖ్యాతిగాఁ బట్టుదున్
జలముల్ సొచ్చిన, భూమి క్రిందఁ జనినన్, శైలంబుపై నెక్కినన్,
బలిదండన్ విలసించినన్, వికృతరూపంబుం బ్రవేశించినన్,
జలధిన్ దాఁటిన, నగ్రజన్మ హలి కాశ్వాటాకృతుల్ దాల్చినన్.
10.1-1626-వ.
అదియునుం గాక.

భావము:
అలా వెంటపడి తరుముకు వెళ్తున్న కాలయవనుడు పద్మాక్షుడితో ఇలా అన్నాడు. “ఓ యదువంశ శ్రేష్ఠుడా! శ్రీకృష్ణా! ఆగు ఆగు. పారిపోకు. నాతో పోరాడు. నీవు యుద్ధరంగంలో కంసుడు మొదలైన వాళ్ళను జయించిన వీరుడవు అని విని, నీతో పోరుకోరి ఎంతో ఉత్సుకతతో వచ్చాను. గడించిన పేరుప్రఖ్యాతులు చెడిపోయేలాగ, నీవంటి రాజులు విరోధికి వెన్నుచూపి ఇలా పారిపోతారా? నీవేమీ సాధారణ రాజువు కూడా కాదు? నీకు అపఖ్యాతి వచ్చేస్తుంది సుమా! మాధవా! నీటిలో ప్రవేశించినా (మత్స్యావతారం) భూమి క్రింద దూరినా (కూర్మావతారం) కొండపైకి ఎక్కినా (వరాహావతారం) బలి సమీపాన చేరినా (వామనావతారం) వికారరూపం గైకొన్నా ( నృసింహావతారం) సాగరాన్ని దాటినా (రామావతారం) బ్రాహ్మణ, హాలిక, అశ్వాట రూపాలు ఏవి దాల్చినా (పరశురామ, బలరామ, కల్క్యావతారములు) సరే బలిమితో లోకప్రసిద్ధి పొందేలా నేడు నిన్ను తప్పక పట్టుకుంటాను. ఇంకా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=197&padyam=1625

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 132

( కాలయవనుడు వెంటజనుట )

10.1-1621-సీ.
చటులవాలాభీల సైంహికేయుని భంగి-
  లాలితేతర జటాలతిక దూలఁ
బ్రళయావసర బృహద్భాను హేతిద్యుతిఁ-
  బరుషారుణ శ్మశ్రుపటలి వ్రేలఁ
గాదంబినీఛన్న కాంచనగిరిభాతిఁ-
  గవచ సంవృత దీర్ఘకాయ మమర
వల్మీక సుప్త దుర్వారాహి కైవడిఁ-
  గోశంబులో వాలు కొమరు మిగుల
10.1-1621.1-ఆ.
నార్చి పేర్చి మించి యశ్వంబుఁ గదలించి
కమలసంభవాది ఘనులకైనఁ
బట్టరాని ప్రోడఁ బట్టెద నని జగ
దవనుఁ బట్టఁ గదిసె యవనుఁ డధిప!
10.1-1622-క.
ఇటు దన్నుఁ బట్టవచ్చినఁ
బటుతర జవరేఖ మెఱసి పట్టుబడక ది
క్తటము లదుర హరి పాఱెం
జటులగతిన్ వాఁడు దోడఁ జనుదేరంగన్.

భావము:
ఓ పరీక్షన్నరేంద్రా! బ్రహ్మదేవుడు మొదలైన దేవతా ప్రముఖులకు కూడా పట్టనలవికాని మహా నెఱజాణ, లోకరక్షకుడు అయిన శ్రీకృష్ణుడిని పట్టుకోడానికి కాలయవనుడు తన అశ్వాన్ని ఉఱికించి గర్జిస్తూ దరికి చేరబోయేడు. అలా గుఱ్ఱం ఎక్కి అతను వస్తుంటే మిక్కిలి భయంకొల్పుతున్న రాహువు తోక వలె కాలయవనుని తీగవంటి జడ కదులుతూ ఉంది; ప్రళయకాలంలో పెద్ద సుర్యగోళపు అగ్నిశిఖల వంటి కాంతితో అతని కఱుకైన ఎఱ్ఱని మీసాలు వ్రేలాడుతున్నాయి; మబ్బుల గుంపుచే కప్పబడిన మేరుపర్వతం లాగా అతని సమున్నతదేహం కవచంతో కప్పబడి ఉంది; పుట్టలో నిద్రిస్తున్న పాము లాగా అతని ఒరలో ఖడ్గం ప్రకాశిస్తోంది. అలా యవనుడు తనను పట్టడానికి వస్తుంటే కృష్ణుడు పట్టుపడకుండా మిక్కిలి వేగంగా దిక్కులదరిలా పరుగెత్తాడు. కాలయవనుడు అతని వెంటపడ్డాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=197&padyam=1621

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, January 22, 2021

శ్రీ కృష్ణ విజయము - 131

( పౌరులను ద్వారకకు తెచ్చుట )

10.1-1619-వ.
ఆ సమయంబు న య్యాదవేంద్రుని నేర్పడం జూచి.
10.1-1620-మ.
వనజాతాక్షుఁడు సింహమధ్యుఁడు రమావక్షుండు శ్రీవత్సలాం
ఛనుఁ డంభోధరదేహుఁ డిందుముఖుఁ డంచద్దీర్ఘబాహుండు స
ద్వనమాలాంగద హార కంకణ సముద్యత్కుండలుం డీతఁ డా
ముని సూచించిన వీరుఁ డౌ ననుచు న మ్మూఢుండు గాఢోద్ధతిన్.

భావము:
అలా యదునాయకుడైన శ్రీకృష్ణుడు వస్తుంటే తేరిపార చూసి కాలయవనుడు తనలో ఇలా అనుకున్నాడు. పద్మాల వంటి కళ్ళూ, సింహం నడుము వంటి నడుము, వక్షస్థలాన శ్రీలక్ష్మి మఱియూ శ్రీవత్సమనే పుట్టుమచ్చ, చంద్రుడి వంటి మోము, ఒద్దికైన పొడుగాటి చేతులు కలవాడూ; చక్కటి వనమాల, భుజకీర్తులు, ముత్యాల దండలు, కంకణాలు, కర్ణకుండలాలు ధరించిన వాడూ అయిన ఈ వీరుడు ఆ నారదముని సూచించిన వీరాధివీరుడే అయి ఉండాలి” అని ఇలా భావించుకునిన ఆ మూర్ఖపు కాలయవనుడు మితిమీరిన కావరంతో మిడిసిపడ్డాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=196&padyam=1620

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 130

( పౌరులను ద్వారకకు తెచ్చుట )

10.1-1617-శా.
ఎన్నే నయ్యె దినంబు లీ నగరిపై నేతెంచి పోరాటకున్
మున్నెవ్వండును రాఁడు వీఁడొకఁడు నిర్ముక్తాయుధుం డేగు దెం
చెన్న న్నోర్వఁగనో ప్రియోక్తులకునో శ్రీఁ గోరియో చూడుఁ" డం
చు న్నాత్మీయజనంబుతోడ యవనేశుం డిట్లు తర్కింపఁగన్.
10.1-1618-క.
విభులగు బ్రహ్మప్రముఖుల
కభిముఖుఁడై నడవకుండునట్టి గుణాఢ్యుం
డిభరాజగమన మొప్పఁగ
నభిముఖుఁడై నడచెఁ గాలయవనున కధిపా.

భావము:
ఈ మథురానగరిపైకి మనం దండెత్తి చాలా రోజులు అయింది కదా. ఇన్నాళ్ళూ ఎవరూ రాలేదు. ఇప్పుడు వీడెవడో ఆయుధాలు లేకుండా వస్తున్నాడు. నన్ను జయించడానికో; రాయబారం మాట్లాడడానికో; ఏదైనా సంపదను అడగడానికో; తెలియకుండా ఉంది. చూడండి” అంటూ ఆ యవనాధిపతి తన వారితో చర్చించాడు. ఓ పరీక్షన్మహారాజా బ్రహ్మదేవాది దేవతాధీశులకు అయినా ఎదురురాని మహా కల్యాణగుణ సంపన్నుడైన శ్రీకృష్ణుడు గజరాజు నడక వంటి నడకతో కాలయవనుడికి అభిముఖంగా వెళ్ళసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=196&padyam=1618

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, January 21, 2021

శ్రీ కృష్ణ విజయము - 129

( పౌరులను ద్వారకకు తెచ్చుట )

10.1-1615-వ.
ఇట్లు విశ్వకర్మ నిర్మితంబైన ద్వారకానగరంబునకు నిజయోగ ప్రభావంబున మథురాపురజనుల నందఱం జేర్చి, బలభద్రున కెఱింగించి; తదనుమతంబున నందనవనంబు నిర్గమించు పూర్వదిగ్గజంబు పెంపున, మేరుగిరిగహ్వరంబు వెలువడు కంఠీరవంబు తెఱంగున హరిహయ దిగంతరాళంబున నుదయించు నంధకారపరిపంథికైవడి మథురానగరంబు వెలువడి నిరాయుధుండై యెదుర వచ్చుచున్న హరిం గని.
10.1-1616-మ.
"కరి సంఘంబులు లేవు; రావు తురగౌఘంబుల్; రథవ్రాతముల్
పరిసర్పింపవు; రారు శూరులు ధనుర్భాణాసి ముఖ్యాయుధో
త్కరముం బట్టఁడు; శక్రచాప యుత మేఘస్ఫూర్తితో మాలికా
ధరుఁ డొక్కం డదె నిర్గమించె నగరద్వారంబునం గంటిరే.

భావము:
అలా, విశ్వకర్మచే నిర్మింపబడిన ద్వారకాపట్టణానికి శ్రీకృష్ణుడు తన యోగమహిమతో మథురానగర ప్రజలు అందరినీ తరలించి బలరాముడికి తెలియజేసాడు. ఆయన అంగీకారంతో నందనవనం నుంచి వెలువడే ఐరావత గజం వలె, మేరుపర్వత గుహ నుంచి బయలుదేరిన వీరకేసరి వలె, తూర్పు దిక్కున ఉదయించే సూర్యుని వలె మాధవుడు మథురాపురం వెలువడి, ఆయుధాలు లేకుండా కాలయవనునికి ఎదురు వెళ్ళాడు. అలా నిరాయుధుడై వస్తున్న ఆయనను కాలయవనుడు చూసి అలా వస్తున్న శ్రీకృష్ణుని చూసి, కాలయవనుడు తన వారితో ఇలా అన్నాడు “ఏనుగుల గుంపులు లేవు; గుఱ్ఱాల పౌజులు లేవు; తేరుల బారులు నడువవు; శూరులు వెంట రావటం లేదు; ధనుస్సు, బాణములు, ఖడ్గము, మొదలైన ఆయుధాలు ధరించకుండా; ఇంద్రధనస్సుతో కూడిన మేఘంవలె శోభిస్తూ; మెడలో హారం ధరించినవాడు పట్టణద్వారం నుంచి ఒంటరిగా వస్తున్న అతగాడిని చూసారా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=196&padyam=1616

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 128

( ద్వారకానగర నిర్మాణము )

10.1-1612-సీ.
ఆసక్తి కృష్ణముఖావలోకనమంద-
  హరిపాదసేవనమంద చింత
వెఱపు నారాయణ విముఖకార్యములంద-
  పారవశ్యము విష్ణుభక్తి యంద
బాష్పనిర్గతి చక్రిపద్య సంస్తుతులంద-
  పక్షపాతము శార్ఙ్గిభక్తులంద
లేమి గోవిందాన్య లీలాచరణమంద-
  శ్రమము గోవిందపూజనములంద
10.1-1612.1-తే.
బంధ మచ్యుతపరదుష్టపథములంద
జ్వరము మాధవవిరహితక్షణములంద
మత్సరము లీశు కైంకర్యమతములంద
నరవరోత్తమ! వినుము త న్నాగరులకు.
10.1-1613-వ.
మఱియు న ప్పురవరంబున హరికిం బారిజాతమహీజంబును సుధర్మ మనియెడి దేవసభను దేవేంద్రుం డిచ్చెఁ; గర్ణైకదేశంబుల నలుపు గలిగి మనోజవంబులును శుక్లవర్ణంబులు నైన తురంగంబుల వరుణుం డొసంగె; మత్స్య కూర్మ పద్మ మహాపద్మ శంఖ ముకుంద కచ్ఛప నీలంబు లను నెనిమిది నిధులఁ గుబేరుండు సమర్పించె; నిజాధికార సిద్ధికొఱకుఁ దక్కిన లోకపాలకులును దొల్లి తమకు భగవత్కరుణా కటాక్షవీక్షణంబుల సంభవించిన సర్వసంపదల మరల నతిభక్తితో సమర్పించిరివ్విధంబున.
10.1-1614-క.
దర్పించి చేసి పురము స
మర్పించెను విశ్వకర్మ మంగళగుణ సం
తర్పిత గహ్వరికిని గురు
దర్పిత దుఃఖప్రవాహ తరికిన్ హరికిన్.

భావము:
ఓ రాజశ్రేష్ఠుడా! పరీక్షన్మహారాజా! విను. ఆ ద్వారక లోని ప్రజలకు శ్రీకృష్ణుని వదనారవింద సందర్శనమందే అపేక్ష. ఆ గోవిందుని చరణాలు సేవించుట యందే వారు తలంపు కలిగి ఉంటారు. హరికి విరుద్ధము లైన పనులు అంటే వారు భయపడతారు. విష్ణుభక్తి యందే వారికి మైమరపు కలుగుతుంది. చక్రధరుని మీద పద్యాలల్లి ప్రస్తుతించే టప్పుడు వారికి ఆనందబాష్పాలు కారుతాయి. విష్ణుభక్తులు అంటేనే వారికి అభిమానం ఎక్కువ. అచ్యుతుని కంటే అన్యములైన లీలలను ఆచరించుట విషయంలో వారికి ఉన్నది లేమిడి. పురుషోత్తముని పూజించుట కోసమే వారు ఎక్కువ శ్రమిస్తారు. శ్రీహరిని పొందించని కుమార్గములే వారికి చెఱలు. క్షణకాలం పద్మనేత్రుని విడిచితే వారు పరితపించిపోతారు. పరమేశ్వరుని కైంకర్యములు విషయంలో వారికి పట్టుదల ఎక్కువ. మఱియు శ్రేష్ఠమగు ఆ పట్టణంలో నివసించే కృష్ణుడికి పారిజాతవృక్షమును, సుధర్మ అనే దేవసభను దేవేంద్రుడు ఇచ్చాడు. ఒక చెవి మాత్రమే నలుపురంగు తక్కిన శరీరం అంతా తెల్లటి రంగు కలిగి మనోవేగం కలిగిన గుఱ్ఱాలను వరుణుడు ఇచ్చాడు. వరము తప్పించి నవనిధులలోని మత్స్యం, కూర్మం, పద్మం, మహాపద్మం, శంఖం, ముకుందం, కచ్ఛపం, నీలం, అనే పేర్లు కల ఎనిమిది నిధులను కుబేరుడు సమర్పించాడు. తక్కిన లోకపాలురు అందరూ తమతమ అధికారాల సిద్ధి కోసం మునుపు తమకు భగవంతుని అనుగ్రహం వలన లభించిన సకల విభూతులను మరల అచ్యుతునికే మిక్కిలి భక్తితో సమర్పించుకున్నారు. ఆ విధముగా, విశ్వకర్మ మిక్కిలి ఉత్సాహంతో నైపుణ్యంతో పట్టణం నిర్మించి; కల్యాణగుణాలు కూడిన భూదేవి భర్త, మహా విజృంభణం కలిగిన దుఃఖమనే ప్రవాహాన్ని దాటడానికి నావ, సకల పాపాలు హరించువాడూ అయిన శ్రీకృష్ణుడికి సమర్పించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=195&padyam=1612

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, January 20, 2021

శ్రీ కృష్ణ విజయము - 127

( ద్వారకానగర నిర్మాణము )

10.1-1609-క.
ప్రియములు జితపవన మనో
రయములు కృతజయము లధికరమణీయ గుణా
న్వయములు సవినయములు ని
ర్భయములు హతరిపుచయములు పట్టణ హయముల్.
10.1-1610-క.
పులుల పగిదిఁ గంఠీరవ
ముల క్రియ శరభముల మాడ్కి ముదిత మదేభం
బుల తెఱఁగున నానావిధ
కలహమహోద్భటులు భటులు గల రా వీటన్.
10.1-1611-క.
ఆ వీట నుండువారికి
భావింపఁగ లేవు క్షుత్పిపాసాదులు త
ద్గోవింద కృపావశమున
దేవప్రతిమాను లగుచు దీపింతు రిలన్.

భావము:
అ నగరంలోని అశ్వాలు అందమైనవి. వాయువేగ మనోవేగాలను మించినవి. విజయము చేకూర్చేవి. మిక్కిలి చక్కని గుణాలూ జాతీ కలవి. భయం లేనివి, అణకువ కలవి. శత్రువు సమూహాలను హతమార్చేవి. ఆ వీటి లోని వీరభటులు పులులు సింహాలు శరభాలు మత్తగజాల వంటివారు అన్నివిధాల యుద్ధాలలో ఆరితేరినవారు. ఆ పట్టణంలోని ప్రజలకు ఆకలిదప్పులు లేవు. గోవిందుని కరుణావశమున వారు దేవతలతో సమానులై తేజరిల్లుతుంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=195&padyam=1610

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 126

( ద్వారకానగర నిర్మాణము )

10.1-1605-క.
నగరీభూసుర కృత లస
దగణిత మఖధూమ పిహితమై గాక మహా
గగనము నీలం బగునే?
మిగులఁగ బెడగగునె గ్రహసమృద్ధం బయ్యున్.
10.1-1606-క.
తిరుగరు పలు కర్థులకును
సురుఁగరు ధన మిత్తు రితర సుదతీమణులన్
మరుగరు రణమునఁ బిఱిఁదికి
నరుగరు రాజన్యతనయు లా నగరమునన్.
10.1-1607-క.
రత్నాకరమై జలనిధి
రత్నము లీ నేర దద్ది రత్నాకరమే?
రత్నములఁ గొనుదు రిత్తురు
రత్నాకరజయులు వైశ్యరత్నములు పురిన్.
10.1-1608-క.
తుంగంబులు కరహత గిరి
శృంగంబులు దానజల వశీకృత భంగీ
భృంగంబులు శైలాభ స
మాంగంబులు నగరి మత్తమాతంగంబుల్.

భావము:
ఆ పురిలోని బ్రాహ్మణులు సలిపే యజ్ఞ హోమలలో పుట్టిన పొగ ఆవరించడం మూలాన ఆకాశం నల్లబడింది. కాకపోతే, సూర్యచంద్రాది గ్రహాలతో కూడినదైనట్టి అంబరం అలా కావడానికి మరో కారణం ఏముంది. ఆ నగరిలోని రాజకుమారులు ఆడినమాట తప్పరు; అర్థిజనులకు ధనమిచ్చుటలో వెనుదీయరు; పరకాంతల పొందుకోరరు; సమరంలో వెనుకంజ వేయరు; సముద్రము రత్నాలకు నిలయమని పేరు పడింది కాని, ఎవరికీ రత్నాలివ్వదు. మరి అదేమి రత్నాకరమో. కాని ఇక్కడి వైశ్యరత్నాలు మాత్రం రత్నాలు కొంటారు. అమ్ముతారు. వారు నిజంగా రత్నాకరమునే జయించారు.
రత్నాకరజయులు వైశ్యరత్నములు అని వారు సముద్ర వ్యాపారంలో దిట్టలు అని సూచిస్తున్నారు. ఆ పట్టణంలోని మదపుటేనుగులు ఎత్తైనవి. కొండల వంటి దేహాలు కలవి. తొండాలతో కొండశిఖరాలనైనా పగలగొట్టగలవు. మదజలాలచే ఆడు తుమ్మెదలను మగ తుమ్మెదలను వశపరచుకుంటాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=195&padyam=1608

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, January 19, 2021

శ్రీ కృష్ణ విజయము - 125

( ద్వారకానగర నిర్మాణము )

10.1-1601-ఉ.
శ్రీరమణీయ గంధములఁ జెన్నువహించుఁ బురీవనంబులం
గోరక జాలకస్తబక కుట్మల పుష్పమరందపూర వి
స్ఫార లతా ప్రకాండ విటపచ్ఛద పల్లవవల్లరీ శిఫా
సారపరాగ మూల ఫల సంభృత వృక్షలతా విశేషముల్.
10.1-1602-క.
శ్రీకరములు జనహృదయ వ
శీకరములు మందపవనశీర్ణ మహాంభ
శ్శీకరములు హంస విహం
గాకరములు నగరి కువలయాబ్జాకరముల్.
10.1-1603-క.
నవకుసుమామోద భరా
జవనము రతిఖిన్నదేహజ స్వేదాంభో
లవనము సమధిగతవనము
పవనము విహరించుఁ బౌరభవనము లందున్.
10.1-1604-క.
బ్రహ్మత్వము లఘు వగు నని
బ్రహ్మయు బిరుదులకు వచ్చి పట్టఁడుగా కా
బ్రహ్మాది కళలఁ దత్పురి
బ్రహ్మజనుల్ బ్రహ్మఁ జిక్కు వఱుపరె చర్చన్

భావము:
అక్కడి ఉద్యానవనాలలో రకరకాల వృక్షాలు, లతలు, మదికి ఇంపుగొల్పుతూ; మొగ్గలతో, పసరుమొగ్గలతో, అరవిరి మొగ్గలతో, విరిసిన పూలతో, తేనెలతో, బోదెలతో, కొమ్మలతో, ఆకులతో, చిగురాకులతో, పూచిన లేత కొమ్మలతో, ఊడలతో, దట్టమైన పుప్పొడితో, వేళ్ళతో, పండ్లతో కూడినవై కమ్మని సువాసనలు విరజిమ్ముతూ ఉంటాయి. ఆ పురంలో సరస్సులు కలువలతో, కమలములతో, కూడి శ్రీకరములై జనులకు మనరంజకములై ఉంటాయి. అక్కడ పిల్లగాలులచే చెదరగొట్టబడిన నీటితుంపరలు విస్తారంగా ఉంటాయి. ఆ సరోవరాలులో అనేక హంసలు, మొదలైన పక్షులు నివాసం ఉంటాయి. ఆ ఉద్యానవనాల నుంచి వచ్చే మలయమారుతం కొత్తపూల పరిమళములను విరజిమ్ముతూ సురతశ్రాంతుల శరీరాలమీది చెమటబిందువులను తొలగిస్తూ ఆ పట్టణ మందిరాలలో విహరిస్తుంది. బ్రహ్మత్వము తేలిక అవుతుందని బ్రహ్మదేవుడు పంతాలకు రాడు కాని, వస్తే ఆ వీటి లోని విప్రులు బ్రహ్మవిద్యా చర్చల్లో అతడిని చీకాకుపరచగలంత వారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=195&padyam=1604

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 124

( ద్వారకానగర నిర్మాణము )

10.1-1597-శా.
సాధుద్వార కవాట కుడ్య వలభి స్తంభార్గళాగేహళీ
వీధీవేది గవాక్ష చత్వర సభా వేశ్మ ప్రఘాణ ప్రపా
సౌధాట్టాలక సాల హర్మ్య విశిఖా సౌపాన సంస్థానముల్
శ్రీధుర్యస్థితి నొప్పుఁ గాంచనమణి స్నిగ్ధంబులై య ప్పురిన్.
10.1-1598-క.
కూడి గ్రహంబులు దిరుగఁగ
మేడలతుది నిలువులందు మెలఁగెడి బాలల్
క్రీడింపరు పురుషులతో
వ్రీడం దద్వేళ లందు విను మా వీటన్.
10.1-1599-ఉ.
ఆయత వజ్ర నీలమణి హాటక నిర్మిత హర్మ్య సౌధ వా
తాయనరంధ్ర నిర్యదసితాభ్ర మహాగరు ధూపధూమముల్
తోయద పంక్తులో యనుచుఁ దుంగమహీరుహ రమ్యశాఖలం
జేయుచునుండుఁ దాండవవిశేషము ల ప్పురి కేకిసంఘముల్.
10.1-1600-ఆ.
సరస నడచుచుండి సౌధాగ్ర హేమ కుం
భములలోన నినుఁడు ప్రతిఫలింప
నేర్పరింపలేక నినులు పెక్కం డ్రంచుఁ
బ్రజలు చూచి చోద్యపడుదు రందు.

భావము:
ఆ పురమందు చక్కని ద్వారములతో, తలుపులతో, గోడలతో, ముందర చూరులతో, స్తంభములతో, గడియలతో, గడపలతో, వీధి అరుగులతో, కిటికీలతో, ముంగిళ్ళతో, చావళ్ళతో, వాకిటి గదులతో కూడిన సౌధములు; మేడలు; పానీయశాలలు; కోటబురుజులు; ప్రాకారములు; రాజమార్గములు; సోపానములు; హేమరత్నమయములై శోభాసమృద్ధితో సొంపారుతూ ఉంటాయి. ఆ పట్టణపు మేడల చివరి అంతస్తులలో సూర్యాదిగ్రహములు సంచరిస్తూ ఉండడం వల్ల ఆ సమయాలలో అక్కడ నివసించే కన్యలు సిగ్గుచేత పురుషులతో క్రీడించడం మానివేస్తారు. ఆ నగరంలో వజ్రాలు, ఇంద్రనీలమణులు, బంగారం మున్నగునవి విస్తృతంగా వాడ కట్టిన మేడలు మిద్దెల కిటికీల నుంచి నల్లని అగరు ధూపధూమాలు వెలువడుతూ ఉంటాయి. అవి మేఘమాలికలు అనే భ్రమ కలిగిస్తాయి. అందుకే అక్కడ ఎత్తైన చెట్లకొమ్మలపై చేరి నెమిళ్ళ గుంపులు నాట్యం చేస్తుంటాయి. సమీపాన సంచరిస్తుండి భవనాల ఉపరిభాగమున ఉన్న బంగారు కలశాలలో సూర్యుడు ప్రతిబింబించగా చూసి నిర్ధారణ చెయ్యలేక, సూర్యులు పలువురు ఉన్నారు అని అక్కడి ప్రజలు భ్రమ చెందుతుంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=195&padyam=1599

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, January 18, 2021

శ్రీ కృష్ణ విజయము - 123

( ద్వారకానగర నిర్మాణము )

10.1-1593-ఆ.
వరుణుపురముకంటె వాసవుపురికంటె
ధనదువీటికంటె దండధరుని
నగరికంటె బ్రహ్మ నగరంబుకంటెఁ బ్ర
స్ఫుటముగాఁగ నొక్క పురముఁ జేసె.
10.1-1594-వ.
అందు.
10.1-1595-క.
ఆకసము తోడిచూ లనఁ
బ్రాకారము పొడవు గలదు పాతాళమహా
లోకముకంటెను లోఁ తెం
తో కల దా పరిఖ యెఱుఁగ దొరక దొకరికిన్.
10.1-1596-క.
కోటయు మిన్నును దమలోఁ
బాటికి జగడింప నడ్డపడి నిల్చిన వా
చాటుల రుచిఁ దారకములు
కూటువలై కోటతుదలఁ గొమరారుఁ బురిన్.

భావము:
విశ్వకర్మ సముద్రం మధ్యన వరుణుడు, దేవేంద్రుడు, కుబేరుడు, యముడు, బ్రహ్మదేవుడు మొదలైన వారి పట్టణాల కంటే దృఢముగా ఒక నగరం నిర్మించాడు. ఆ పట్టణంలో ప్రాకారం ఆకాశానికి అప్పచెల్లెలులా ఉంది. కందకం పాతాళం కంటే లోతయినది. దాని లోతు. ఎంతో ఎవరికీ అంతు చిక్కదు. ఎత్తు విషయములో కోట, ఆకాశము కలహించుకోగా అడ్డుపడి నిలచిన తీర్పరుల వలె కోట అగ్రభాగాన చుక్కల గుంపులు ప్రకాశిస్తూ ఉంటాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=195&padyam=1595

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 122

( కాలయవనుని ముట్టడి)

10.1-1590-వ.
అని పలికి కాలయవనుండు మూడుకోట్ల మ్లేచ్ఛవీరులం గూడుకొని, శీఘ్రగమనంబున దాడివెడలి, మథురాపురంబుమీఁద విడిసినం జూచి, బలభద్ర సహితుండై కృష్ణుం డిట్లని వితర్కించె.
10.1-1591-సీ.
"యవనుండు పుర మెల్ల నావరించెను నేటి-
  యెల్లిటి యెల్లుండి యీ నడుమను
మాగధుండును వచ్చి మనమీఁద విడియును-
  యవన మాగధులు మహాప్రబలులు
పురి రెండువంకలఁ బోరుదు రట్టిచో-
  నోపిన భంగి నొక్కొక్కచోట
మనము యుద్ధముఁ సేయ మఱియొక్కఁ డెడఁ సొచ్చి-
  బంధుల నందఱఁ బట్టి చంపు
10.1-1591.1-తే.
నొండె గొనిపోయి చెఱఁబెట్టు నుగ్రకర్ముఁ
డైన మాగధుఁ; డదిగాన యరివరులకు
విడియఁ బోరాడఁగా రాని విషమభూమి
నొక్క దుర్గంబుఁ జేసి యం దునుపవలయు."
10.1-1592-వ.
అని వితర్కించి సముద్రు నడిగి సముద్రమధ్యంబునం బండ్రెండు యోజనంబుల నిడుపు నంతియ వెడల్పుం గల దుర్గమ ప్రదేశంబు సంపాదించి, తన్మధ్యంబునం గృష్ణుండు సర్వాశ్చర్యకరంబుగ నొక్క నగరంబు నిర్మింపు మని విశ్వకర్మం బంచిన.

భావము:
ఆ విధంగా నారదుడితో వీరోక్తులాడి, కాలయవనుడు మూడుకోట్ల మ్లేచ్ఛవీరులను సమకూర్చుకుని అతి వేగంగా దాడి వెడలి, మధురానగరాన్ని ముట్టడించాడు. అది చూసి బలరాముడితో శ్రీకృష్ణుడు ఇలా ఆలోచించాడు. “యవనుడు పట్టణాన్ని ముట్టడించాడు. ఇవాళో రేపో ఎల్లుండో మాగధుడు కూడా మన మీద దాడిచేస్తాడు. కాలయవనుడు జరాసంధుడు మిక్కిలి బలవంతులు. వారు నగరం రెండు వైపుల చేరి పోరాడుతారు. అప్పుడు, మనం శక్తికొద్దీ ఒకచోట యుద్ధం చేస్తుంటే, మరొకడు సందు చూసుకుని మన చుట్టా లందరినీ పట్టి చంపవచ్చు, లేదా పట్టుకుపోయి చెర పట్టవచ్చు. జరాసంధుడు అతి క్రూరకర్ముడు. కాబట్టి శత్రువులు దండు విడియుటకు, పోరు సల్పుటకు వీలు కాని ప్రదేశంలో ఒక దుర్గం నిర్మించి, అందులో మనవారిని అందరినీ ఉంచాలి.” అని ఆలోచించి, శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి అడిగి సముద్రం మధ్యన పన్నెండు ఆమడల పొడవు, అంతే వెడల్పు కల ఒక దుర్గమ ప్రదేశాన్ని సంపాదించాడు. దాని మధ్య అందరికీ అశ్చర్యం కలిగించే ఒక పట్టణం నిర్మించ మని దేవశిల్పి అయిన విశ్వకర్మను ఆజ్ఞాపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=194&padyam=1591

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, January 17, 2021

శ్రీ కృష్ణ విజయము - 121

( కాలయవనునికి నారదుని బోధ )

10.1-1588-వ.
అని మఱియు నితర లక్షణంబులుం జెప్పిన విని, సరకుజేయక.
10.1-1589-ఉ.
“యాదవుఁ డెంతవాఁడు ప్రళయాంతకుఁడైన నెదిర్చె నేనియుం
గాదనఁ బోర మత్కలహ కర్కశ బాహుధనుర్విముక్త నా
నా దృఢ హేమపుంఖ కఠినజ్వలదస్త్ర పరంపరా సము
ద్పాదిత వహ్నికీలముల భస్మము చేసెదఁ దాపసోత్తమా!”

భావము:
అని ఇంకా ఎంతో వివరంగా వర్ణించి నారదుడు శ్రీకృష్ణుని లక్షణాలు చెప్పాడు. వినిన కాలయవనుడు లెక్కచేయకుండా ఇలా అన్నాడు. “ఓ మునిశ్రేష్ఠుడా! నారదా! యాదవుడు నా ముందు ఎంతటి వాడు. నేను ప్రళయకాలయముడు అయినా సరే ఎదిరిస్తానంటే కాదనను. కదనరంగంలో కఠినమైన నా చేతులు ప్రయోగించే బంగారు పింజలు కల అనేక రకాల గట్టి నిశితాస్త్ర పరంపరలకు జనించే అగ్నిజ్వాలలతో అతడిని బూడిద చేసేస్తాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=193&padyam=1589

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 120

( కాలయవనునికి నారదుని బోధ )

10.1-1585-శా.
"ఏమీ; నారద! నీవు చెప్పిన నరుం డే రూపువాఁ? డెంతవాఁ?
డే మేరన్ విహరించు? నెవ్వఁడు సఖుం? డెందుండు? నేపాటి దో
స్సామర్థ్యంబునఁ గయ్యముల్ సలుపు? నస్మద్బాహు శౌర్యంబు సం
గ్రామక్షోణి భరించి నిల్వఁ గలఁడే? గర్వాఢ్యుఁడే? చెప్పుమా!"
10.1-1586-వ.
అనిన విని దేవముని యిట్లనియె.
10.1-1587-సీ.
"నీలజీమూత సన్నిభ శరీరమువాఁడు-
  తామరసాభ నేత్రములవాఁడు
పూర్ణేందుబింబంబుఁ బోలెడి మోమువాఁ-
  డున్నత దీర్ఘ బాహువులవాఁడు
శ్రీవత్సలాంఛనాంచిత మహోరమువాఁడు-
  కౌస్తుభమణి పతకంబువాఁడు
శ్రీకర పీతకౌశేయ చేలమువాఁడు-
  మకరకుండల దీప్తి మలయువాఁడు
10.1-1587.1-తే.
రాజ! యింతంతవాఁ డనరానివాఁడు
మెఱసి దిక్కుల నెల్లను మెఱయువాఁడు
తెలిసి యే వేళలందైనఁ దిరుగువాఁడు
పట్టనేర్చినఁ గాని లోఁబడనివాఁడు."

భావము:
“ఏమిటేమిటి? నారదా! నీవు చెప్పిన ఆ మానవుడు ఎలా ఉంటాడు? ఎంతటి వాడు? ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? వానికి మిత్రుడు ఎవడు? ఏపాటి భుజబలంతో యుద్ధం చేయగలడు? మా బాహు పరాక్రమమును తట్టుకుని రణరంగములో ఎదురు నిలుబడగలడా? దర్పోద్ధతుడేనా? చెప్పు.” అని అడిగిన కాలయవనుడుతో దేవర్షి అయిన నారదుడు ఇలా అన్నాడు. “ఓ యవనేశ్వరా! కాలయవనా! విను. అతడు నల్లని మేఘంవంటి దేహము కలవాడు. తామరపూలవంటి కన్నులు కలవాడు. పూర్ణచంద్రబింబంవంటి ముఖము కలవాడు. పొడవైన ఎగుభుజములు కలవాడు. శ్రీవత్సము అనే పుట్టుమచ్చతో పొలుపారు విశాలవక్షము కలవాడు. అతడు కౌస్తుభమణి ధరిస్తాడు. సంపత్కరమైన పసుపు పచ్చని పట్టుపుట్టాలు కడతాడు. చెవులకు ధరించిన మకరకుండలాల కాంతులు కలవాడు. ఇంతవాడు అంతవాడు అని చెప్పశక్యం కానివాడు. అన్ని దిక్కులలో పరాక్రమంతో ప్రకాశించేవాడు. ఏవేళలందు అయినా నైపుణ్యంతో సంచరించేవాడు. పట్టుకోడం నేర్చుకుంటే తప్ప లొంగనివాడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=193&padyam=1587

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 119

( కాలయవనునికి నారదుని బోధ )

10.1-1582-మ.
"యవనా! నీవు సమస్త భూపతుల బాహాఖర్వగర్వోన్నతిం
బవనుం డభ్రములన్ హరించు పగిదిన్ భంజించియున్నేల యా
దవులన్ గెల్వవు? వారలన్ మఱచియో దర్పంబు లేకుండియో?
యవివేకస్థితి నొందియో? వెఱచియో? హైన్యంబునం జెందియో?
10.1-1583-క.
యాదవులలోన నొక్కఁడు
మేదినిపై సత్వరేఖ మెఱసి జరాసం
ధాదులఁ దూలం దోలెనుఁ
దాదృశుఁ డిలలేడు వినవె తత్కర్మంబుల్."
10.1-1584-వ.
అనిన విని, కాలయవనుం డిట్లనియె.

భావము:
“ఓ కాలయవనా! వాయువు మేఘములను ఎగురగొట్టునట్లు, నీవు భుజగర్వాతిశయంతో రాజులను అందరిని గెలిచావు కాని, ఎందుకు ఇంకా యాదవులను జయించ లేదు. వాళ్ళను మరచిపోయావా, గర్వములేకనా, తెలియకనా, భయమా లేక అల్పత్వమా ?యాదవులలో ఒకడు బలాధిక్యంతో భూమ్మీద తేజరిల్లుతూ జరాసంధుడూ మొదలైనవారిని తరిమేసాడు. అంతటి వాడు ఈ భూలోకంలోనే మరొకడు లేడు. అతను చేసిన ఘనకార్యములు నీవు వినలేదా?” అలా చెప్పిన నారదుని మాటలు వినిన కాలయవనుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=193&padyam=1583

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 118

(నందోద్ధవ సంవాదము)

10.1-1450-సీ.
అట్టి నారాయణుం డఖిలాత్మభూతుండు-
  కారణమానవాకారుఁడైనఁ
జిత్తంబు లతనిపైఁ జేర్చి సేవించితి-
  రతికృతార్థులరైతి; రనవరతము
శోభిల్లు నింధనజ్యోతి చందంబున-
  నఖిల భూతములందు నతఁ; డతనికి
జననీ జనక దార సఖి పుత్ర బాంధవ-
  శత్రు ప్రియాప్రియ జనులు లేరు
10.1-1450.1-ఆ.
జన్మకర్మములును జన్మంబులును లేవు
శిష్టరక్షణంబు సేయుకొఱకు
గుణవిరహితుఁ డయ్యు గుణి యగు సర్వ ర
క్షణ వినాశకేళి సలుపుచుండు."

భావము:
సర్వ జీవుల యందు ఆత్మగా ఉన్నవాడు, కారణ వశంచే మానవ విగ్రహం గైకొన్న వాడు అయిన అటువంటి శ్రీమన్నారాయణుడు మీద మీరు మనసులు లగ్నం చేసి కొలిచారు; మీరు పరమ ధన్యులు అయ్యారు; ఆయన కట్టెలలో నిప్పు చొప్పున ఎల్లప్పుడూ సకల జీవుల యందు ప్రకాశిస్తూ ఉంటాడు; ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టము, విరోధి, ఇష్టుడు, అనిష్ఠుడు అంటూ ఎవ్వరూ లేరు; జనన మరణాలు లేవు.; సజ్జనులను సంరక్షించుట కొరకు త్రిగుణరహితుడు అయినప్పటికీ, గుణములు ధరించి సృష్టి స్థితి లయములు అనే లీలలు సాగిస్తూ ఉంటాడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=174&padyam=1450

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, January 9, 2021

శ్రీ కృష్ణ విజయము - 117

(నందోద్ధవ సంవాదము)

10.1-1447-వ.
ఇట్లు గోవింద సందర్శనాభావ విహ్వలురైన యశోదానందులకు నుద్దవుం డిట్లనియె.
10.1-1448-క.
"జననీజనకుల మిమ్ముం
గనుఁగొన శీఘ్రంబె వచ్చుఁ గని భద్రంబుల్
వనజాక్షం డొనరించును
మనమున వగవకుఁడు ధైర్యమండనులారా?
10.1-1449-మ.
బలుడుం గృష్ణుఁడు మర్త్యులే? వసుమతీ భారంబు వారింప వా
రల రూపంబులఁ బుట్టినాఁడు హరి నిర్వాణప్రదుం; డిప్పు డు
జ్జ్వలుఁడై ప్రాణవియోగకాలమునఁ దత్సర్వేశుఁ జింతించువాఁ
డలఘుశ్రేయముఁ బొందు బ్రహ్మమయుఁడై యర్కాభుఁడై నిత్యుఁడై

భావము:
కృష్ణుడు కనబడకుండా ఉండడంతో బెంగపట్టుకున్న ఆ యశోదానందులతో ఉద్ధవుడు ఇలా అన్నాడు. “మీరు ధైర్యంగా ఉండండి. కృష్ణుడు త్వరలోనే వస్తాడు. తలితండ్రులైన మిమ్మల్ని చూస్తాడు. మీకు శుభములు చేకూరుస్తాడు. చింతించకండి. ఈ రామకృష్ణులు సామాన్య మానవులు కారు. మోక్షము ఇచ్చే ఆ శ్రీమహావిష్ణువే భూభారాన్ని దించడం కోసం రామకృష్ణుల రూపాలలో అవతరించాడు. జ్ఞాని యై ప్రాణంపోయే టప్పుడు సర్వమునకు ప్రభువైన ఆ హరిని స్మరించిన వాడు బ్రహ్మస్వరూపుడై, సూర్యుడి వలె తేజోవిరాజితుడై, నిత్యత్వం పొంది ముక్తిరూపమైన శ్రేయస్సు చూరగొంటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=174&padyam=1449

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 116

(నందోద్ధవ సంవాదము)

10.1-1444-క.
అంకిలి గలుగక మా కక
లంకేందుని పగిదిఁ గాంతిలలితంబగు న
ప్పంకజనయనుని నెమ్మొగ
మింక విలోకింపఁ గలదె యీ జన్మమునన్?"
10.1-1445-క.
అని హరి మున్నొనరించిన
పను లెల్లనుఁ జెప్పి చెప్పి బాష్పాకుల లో
చనుఁడై డగ్గుత్తికతో
వినయంబున నుండె గోపవీరుం డంతన్.
10.1-1446-క.
పెనిమిటి బిడ్డని గుణములు
వినిపింప యశోద ప్రేమవిహ్వలమతియై
చనుమొనలఁ బాలు గురియఁగఁ
గనుఁగొనలను జలము లొలుకఁగా బెగ్గిలియెన్.

భావము:
మచ్చలేని చంద్రుడిలా అందాలు చిందే కాంతులు వెదజల్లే ఆ కమలాక్షుని నిండుమోము కమ్మగా చూసే అదృష్టం మళ్ళీ మాకు ఈ జన్మలో లభిస్తుందా?” అని గోపాలశ్రేష్ఠుడు నందుడు పలికాడు. శ్రీకృష్ణుడు మునుపు చేసిన కృత్యములు అన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పి చెప్పి బొంగురుపోయిన కంఠంతో మాటాడలేక కన్నీటితో కలకబారిన కన్నులు కలవాడై మిన్నకున్నాడు. అలా భర్త కృష్ణుడి గుణాలు వర్ణిస్తుంటే; నందుడి భార్య యశోద మనసు ప్రేమతో పరవశమై చలించి పోగా చనుమొనల నుండి పాలు జాలువారాయి; కనుకొనల నుండి కన్నీరు ధారలు కారాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=174&padyam=1446

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, January 8, 2021

శ్రీ కృష్ణ విజయము - 115

(నందోద్ధవ సంవాదము)

10.1-1441-శా.
ఆ పుణ్యాత్మునిఁ గౌఁగిలించుకొని నందాభీరుఁ డానంది యై
మా "పాలింటికిఁ గృష్ణు డీతఁ" డనుచున్ మన్నించి పూజించి వాం
ఛాపూర్ణంబుగ మంజులాన్నమిడి మార్గాయాసముం బాపి స
ల్లాపోత్సాహముతోడ నిట్లనియె సంలక్షించి మోదంబునన్.
10.1-1442-క.
"నా మిత్రుఁడు వసుదేవుఁడు
సేమంబుగ నున్నవాఁడె? చెలువుగఁ బుత్రుల్
నేమంబున సేవింప మ
హామత్తుండైన కంసుఁ డడగిన పిదపన్.
10.1-1443-శా.
అన్నా! భద్రమె? తల్లిదండ్రుల మమున్ హర్షించి చింతించునే?
తన్నుం బాసిన గోపగోపికల మిత్రవ్రాతమున్ గోగణం
బు న్నిత్యంబు దలంచునే? వన నదీ భూముల్ ప్రసంగించునే?
వెన్నుం డెన్నఁడు వచ్చు నయ్య! యిట మా వ్రేపల్లెకు న్నుద్ధవా?

భావము:
నందుడు ఆ పుణ్యాత్ముడిని ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు. “ఇతడు మా పాలిటి గోపాలకృష్ణుడు” అంటూ సాదరంగా మన్ననలు చేసాడు. కడుపునిండా కమ్మని భోజనం పెట్టించాడు. ప్రయాణం బడలిక పోగొట్టాడు. ముచ్చటలాడే కోరికతో ఉద్దవుడితో ఎంతో సంతోషంగా ఇలా అన్నాడు. “నా చెలికాడు వసుదేవుడు క్షేమమే కదా! గర్వాంధు డైన కంసుడు కనుమూసాక తన కుమారులు చక్కగా సేవలు చేస్తుంటే సుఖంగా ఉన్నారు కదా. అన్నా! ఉద్ధవా! మమ్మల్ని తల్లితండ్రులను కృష్ణుడు సంతోషంతో తలచుకొంటూ ఉంటాడా? తనకి దూరంగా ఉంటున్న గోపగోపికలనూ, చెలికాండ్రనూ, ఆలమందలనూ ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటాడా? ఇక్కడి వనాలనూ నదులను గూర్చి ముచ్చటిస్తూ ఉంటాడా? వెన్నుడు ఇటు మా వ్రేపల్లెకు ఎప్పుడు వస్తాడయ్యా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=174&padyam=1443

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 114

( గోపస్త్రీలకడకుద్ధవుని బంపుట )

10.1-1439-క.
సందేహము మానుం డర
విందాననలార! మిమ్ము విడువను వత్తున్
బృందావనమున కని హరి
సందేశము పంపె" ననుము సంకేతములన్."
10.1-1440-వ.
అని మందహాస సుందర వదనారవిందుండై కరంబు కరంబున నవలంబించి, సరసవచనంబు లాడుచు వీడుకొల్పిన నుద్ధవుండును రథారూఢుండై సూర్యాస్తమయ సమయంబునకు నందవ్రజంబు జేరి వనంబులనుండి వచ్చు గోవుల చరణరేణువులం బ్రచ్ఛన్న రథుండై చొచ్చి, నందు మందిరంబు ప్రవేశించిన.

భావము:
సంకేతస్థలమునకు వెళ్ళి గోపికలతో “పద్మముల వంటి మోములు కల పడతులారా! సంశయం మానండి. మిమ్మల్ని వదలిపెట్టను. బృందావనానికి వస్తాను” అని కృష్ణుడు వార్త పంపాడని నీవు చెప్పు.” అని చిరునవ్వుతో అందమైన అరవిందం వంటి వదనము గల గోవిందుడు ఉద్ధవుడి చేతిలో చెయ్యేసి పట్టుకుని, సరసమైన మాటలు పలుకుతూ సాగనంపాడు. ఉద్ధవుడు రథము ఎక్కి సూర్యుడు అస్తమించే వేళకు గోకులం చేరాడు. అడవులలో మేతమేసి వచ్చే గోవుల పాద ధూళి అతని రథాన్ని కప్పివేస్తుండగా, ఉద్ధవుడు వ్రేపల్లె చేరి నందుడి ఇంటికి వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=173&padyam=1440

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, January 2, 2021

శ్రీ కృష్ణ విజయము - 113

( గోపస్త్రీలకడకుద్ధవుని బంపుట )

10.1-1436-క.
సిద్ధవిచారు గభీరున్
వృద్ధవచోవర్ణనీయు వృష్ణిప్రవరున్
బుద్ధినిధి నమరగురుసము
నుద్ధవునిం జూచి కృష్ణుఁ డొయ్యనఁ బలికెన్.
10.1-1437-శా.
"రమ్మా యుద్ధవ! గోపకామినులు నా రాకల్ నిరీక్షంచుచున్
సమ్మోహంబున నన్నియున్ మఱచి యే చందంబునం గుందిరో
తమ్మున్ నమ్మినవారి డిగ్గవిడువన్ ధర్మంబు గాదండ్రు; వే
పొమ్మా; ప్రాణము లే క్రియన్ నిలిపిరో ప్రోద్యద్వియోగాగ్నులన్.
10.1-1438-క.
"లౌకిక మొల్లక న న్నా
లోకించు ప్రపన్నులకును లోఁబడి కరుణా
లోకనములఁ బోషింతును
నా కాశ్రితరక్షణములు నైసర్గికముల్.

భావము:
ఫలవంత మైన భావాలు కలవాడు, గంభీరుడు, పెద్దలు మెచ్చదగిన వాడు, వృష్ణివంశోత్తముడు, గొప్ప తెలివి కలవాడు, దేవతల గురువైన బృహస్పతితో సమానుడు అయిన ఉద్ధవుడిని పిలచి, మెల్లగా ఇలా చెప్పాడు. “ఉద్ధవా! ఇలా రా! గోపికలు ప్రణయమూర్తులు. నా ఆగమనానికి ఎదురుచూస్తూ, నా మీది వ్యామోహంతో అన్నీ మరచిపోయి ఎంతగానో దుఃఖపడుతూ ఉంటారు. నమ్ముకున్న తమను విడవడం ధర్మం కాదని పెద్దలుఅంటూ ఉంటారు. వేగంగా వెళ్ళు. పెచ్చుమీరుతున్న వియోగమనే అగ్నిజ్వాలలతో వారెలా ప్రాణాలు నిలబెట్టుకుంటూ ఉన్నారో? లోకధర్మాలు అన్నీ విడచిపెట్టి నా మీదనే చూపు నిలిపి, భక్తి ప్రపత్తులు సలిపేవారికి నేను లోబడి, వారిని దయతో చూస్తూ కాపాడుతాను. ఆశ్రితులను ఆదుకోవడం నాకు స్వభావసిద్ధమైన గుణం.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=172&padyam=1438

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 112

( గురుపుత్రుని తెచ్చి ఇచ్చుట )

10.1-1432-క.
కాలుని వీటికిఁ జని మృత
బాలకుఁ దే నొరుల వశమె? భవదీయ కృపన్
మేలు దొరఁకొనియె మాకు; వి
శాల మగుంగాత మీ యశము లోకములన్.
10.1-1433-వ.
మహాత్ములార! యేను కృతార్థుండ నైతి" నని దీవించిన సాందీపుని వీడ్కొని కృతకృత్యులై రామకృష్ణులు రథారోహణంబు చేసి మథురకుఁ జనుదెంచి పాంచజన్యంబుఁ బూరించిన విని నష్టధనంబులు గనినవారి భంగిం బ్రజలు ప్రమోదించి; రంత నొక్కనాఁ డేకాంతంబున.
10.1-1434-శా.
"నా పైఁ జిత్తము లెప్పుడున్ నిలుపుచున్ నా రాకఁ గాంక్షించుచున్
నా పే రాత్మల నావహించుచు వగన్ నానాప్రకారంబులన్
గోపాలాంగన లెంత జాలిఁబడిరో? కోపించిరో? దూఱిరో?
వ్రేపల్లెన్ నిజధర్మ గేహములలో విభ్రాంతచైతన్యలై."
10.1-1435-వ.
అని చింతించి.

భావము:
యమపురికి వెళ్ళి చనిపోయిన పిల్లవాడిని తెచ్చి ఇవ్వడము అన్నది మీకు చెల్లింది కాని, ఇతరులకు సాధ్యమా? ఎంతో శ్రద్ధాభక్తులతో మాకు మేలు కలిగించారు. మీ కీర్తి లోకాలలో విస్తరిల్లు కాక! ఓ పుణ్యాత్ములారా! నేను ధన్యుడను అయ్యాను.” అని సాందీపని వారిని దీవించాడు. రామకృష్ణులు కృతార్ధులై గురువు దగ్గర సెలవు పుచ్చుకుని రథం ఎక్కి మధుర వెళ్ళి శంఖాన్నిఊదారు. అప్పుడు ప్రజలు పోయిన సొమ్ము తిరిగి లభించిన వారిలా సంతోషించారు. శ్రీకృష్ణుడు ఒకరోజు ఏకాంతంలో ఇలా ఆలోచించసాగాడు “వ్రేపల్లెలోని గొల్లముదితలు సదా నా మీదనే మనసు లగ్నం చేసుకుని ఉంటారు. నా ఆగమనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. నా పేరు మనసులో నిరంతరం ధ్యానిస్తూ, ప్రణయపారవశ్యంతో తమ పుణ్య గృహాలలో అనేక విధాలుగా వగలు చెందుతుంటారు. పాపం వారెంత దైన్యం పాలవుతున్నారో? నాపై ఎంత కినుక వహించారో? నన్నెంతగా దూషించుతున్నారో?”. ఇలా తలపోసిన కృష్ణుడు . . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=172&padyam=1434

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, January 1, 2021

శ్రీ కృష్ణ విజయము - 111

( గురుపుత్రుని తెచ్చి ఇచ్చుట )

10.1-1429-క.
అనిన విని "వీఁడె వీనిం
గొనిపొం" డని భక్తితోడ గురునందను ని
చ్చినఁ గృష్ణుఁడు వీడ్కొలిపెను
ఘనదుర్జనదమను మహిషగమనున్ శమనున్.
10.1-1430-వ.
ఇట్లు జము నడిగి తెచ్చి రామకృష్ణులు సాందీపునికిం బుత్రుని సమర్పించి “యింకనేమి చేయవలయు నానతిం” డనిన న మహాత్ముం డిట్లనియె.
10.1-1431-క.
"గురునకుఁ గోరిన దక్షిణఁ
గరుణన్ మున్నెవ్వఁ డిచ్చె? ఘనులార! భవ
ద్గురునకుఁ గోరిన దక్షిణఁ
దిరముగ నిచ్చితిరి మీరు దీపితయశులై.

భావము:
శ్రీకృష్ణుడి మాటలు వినిన యమధర్మరాజు “ఇడుగో వీడే. వీడిని తీసుకుపొండి.” అని భక్తితో గురుపుత్రుని ఇచ్చివేశాడు. దుర్మార్గులను అణచివేసేవాడూ దున్నపోతు వాహనంగా కలవాడు అయిన యముడికి కృష్ణుడు వీడ్కోలు చెప్పి, గురుకుమారుణ్ణి కూడా తీసుకొని బయలుదేరాడు. అలా యముడి దగ్గర నుండి గురుపుత్రుడిని తీసుకొని వచ్చి తమ గురువు సాందీపనుడికి ఇచ్చి, రామకృష్ణులు “ఇంకా ఏమి చేయమంటారో చెప్పండి” అని అడిగారు. ఆ మహానుభావుడు సాందీపని వారితో ఇలా అన్నాడు. “ఓ మహాత్ములారా! గురువు కోరిన దక్షిణ తెచ్చి ఇచ్చారు. మీ యశస్సు దిగంతాలలో ప్రకాశింపజేసారు. ఇంతవరకూ తన గురువునకు అతడడిగిన ఇలాంటి దక్షిణ దయతో ఇచ్చినవాడు ఎక్కడా లేడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=172&padyam=1430

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :