Thursday, October 1, 2020

శ్రీ కృష్ణ విజయము - 43

( కృష్ణుడు మథురను గనుట )

10.1-1252-సీ.
"వీఁడఁటే రక్కసి విగతజీవగఁ జన్నుఁ-
  బాలు ద్రావిన మేటిబాలకుండు; 
వీఁడఁటే నందుని వెలఁదికి జగమెల్ల-
  ముఖమందుఁ జూపిన ముద్దులాఁడు; 
వీఁడఁటే మందలో వెన్నలు దొంగిలి-
  దర్పించి మెక్కిన దాఁపరీఁడు; 
వీఁడఁటే యెలయించి వ్రేతల మానంబు-
  చూఱలాడిన లోకసుందరుండు;
10.1-1252.1-తే.
వీఁడు లేకున్న పుర మటవీస్థలంబు
వీనిఁ బొందని జన్మంబు విగత ఫలము
వీనిఁ బలుకని వచనంబు విహగ రుతము
వీనిఁ జూడని చూడ్కులు వృథలు వృథలు;
10.1-1253-మ.
చెలియా! గోపిక లీ కుమారతిలకుం జింతించుచుం బాడుచుం
గలయం బల్కుచు నంటుచున్ నగుచు నాకర్షించుచున్ హస్తగా
మలకక్రీడకుఁ దెచ్చి నిచ్చలును సమ్మానంబులం బొందఁగాఁ
దొలి జన్మంబుల నేమి నోఁచిరొ కదే దుర్గప్రదేశంబులన్?"

భావము:
“రాకాసి పూతన ప్రాణాలు తోడేసేలా స్తన్యపానం చేసిన అసాధ్యపు అర్భకుడు వీడేనటే; నందుని ఇల్లాలికి తన నోట్లో విశ్వమంతా చూపించిన ముద్దుబిడ్డడు వీడేనటే; మందలో వెన్నలు అన్నీ దర్పంగా దొంగిలించి భక్షించిన దొంగ వీడే నటే; గొల్లకన్నెల మనసుల ఆసక్తి రగిల్చి మానాలను కొల్లగొట్టిన భువనైక సుందరుడు వీడేనటే; ఇతడు లేని ఊరు ఉత్త అరణ్యమేలే; ఇతడిని కలియని జన్మ మెందుకూ పనికిరానిదేనే; ఇతడిని పలకరించని పలుకు పక్షి కూతలేనే; ఇతడిని దర్శంచని చూపులు వట్టి వ్యర్ధములేనే. ఓ చెలీ! బాలక శ్రేష్ఠుడైన ఈ కృష్ణుడిని గోపకన్యలు నిత్యం ధ్యానిస్తూ, కీర్తిస్తూ, చేతిలో ఉసిరికాయ ఆట వంకతో పిలిచి తాకుతూ, పిలుస్తూ, సంభాషిస్తూ, నవ్వుతూ, లాలిస్తూ ఆనందిస్తుంటారు. ఇంతటి ఆదరాన్ని అందుకోడానికి పూర్వజన్మలలో చేరలేని ఏ చోటులకు చేరి, ఎంతటి నోములు నోచారో కదా”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=144&padyam=1252

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: