Sunday, October 11, 2020

శ్రీ కృష్ణ విజయము - 52

( కుబ్జననుగ్రహించుట )

10.1-1274-క.
ఆ నళినాక్షుఁడు గాంచెను
నానా లేపముల భాజనముఁ జేఁగొనుచుం
బూని చనుదెంచు దానిని
నానన రుచి నిచయ వినమితాబ్జం గుబ్జన్.
10.1-1275-వ.
కని యిట్లనియె.
10.1-1276-క.
"ఎవ్వరిదానవు? లేపము
లెవ్వరికిం గోరికొనుచు నేగెదు? నీ పే
రెవ్వరు మా కి మ్మిన్నియు
నివ్వటిలెదు చక్కనగుచు నీరజనేత్రా!"
10.1-1277-వ.
అనిన న య్యబల యిట్లనియె.

భావము:
అలా రాచవీథిని వెళ్తున్న, కమలముల వంటి కన్నులు కల కన్నయ్య రకరకాల మైపూతలు గల పాత్ర పట్టుకుని వస్తున్న కుబ్జను చూసాడు. అప్పుడు ఆమె ముఖము ముందు పద్మం తలవంచుకునే టంత కాంతివంతంగా వెలిగిపోతోంది. అలా వెలిగిపోతున్న ముఖంతో ఎదురు వచ్చిన కుబ్జను చూసి కృష్ణుడు ఇలా అన్నాడు. “ఓ పద్మాక్షీ! నీ వెవరి దానివి? ఈ పూతలు ఎవరి కోసము తీసుకువెళ్తున్నావు? నీ పేరేమిటి? ఈ లేపనము లన్నీ మాకియ్యి. నీవు చక్కనిదాని వయ్యి ప్రకాశిస్తావులే. కృష్ణుడి మాటలు విని, ఆ ముదిత ఇలా అంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=148&padyam=1276

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: