Thursday, October 29, 2020

శ్రీ కృష్ణ విజయము - 63

( మల్లరంగ వర్ణన )

10.1-1312-మ.
సకలాంభోనిధి మేఖలావహనముం జాలించి యేతెంచు నా
గ కులాగంబుల భంగి నొప్పుచుఁ దగం గైసేసి చాణూర ము
ష్టికకూటుల్ చలకోసలుల్ గురువులన్ సేవించుచున్ రంగధా
త్రికి నేతెంచిరి తూర్యఘోషముల నుద్రేకం బనేకంబుగన్.
10-1313-క.
నందాదులైన గోపకు
లందఱు చని కానుకలు సమర్పించి నృపున్
సందర్శించి తదనుమతిఁ
జెంది మహామంచముల వసించిరి వరుసన్.

భావము:
సమస్త సముద్రాలు సరిహద్దులుగా ఉన్న భూమండలాన్ని మోయడం మానుకుని నడచి వస్తున్న దిగ్గజాలలా, కులపర్వతాలలా ఒప్పుతూ, తగినట్లు అలంకరించుకుని చాణూరుడూ, ముష్టికుడూ, కూటుడూ, చలుడూ, కోసలుడూ తమ గురువులను కొలుస్తూ వాయిస్తున్న వాద్యాల శబ్దాలకు ఉద్రేకం చెలరేగుతుండగా రంగస్థలానికి వచ్చారు. నందుడు మొదలగు గోపాలురు అందరూ వెళ్ళి కంసరాజును దర్శించి, కానుకలు సమర్పించి, అతని అనుమతితో పెద్దపెద్ద ఆసనాల మీద వరుసలు కట్టి కూర్చున్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=154&padyam=1313

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: