Sunday, October 18, 2020

శ్రీ కృష్ణ విజయము - 56

( విల్లు విరుచుట )

10.1-1284-క.
సురరాజు వింటికైవడి
గురుతరమై భూరివీరగుప్తంబై దు
స్తరమైన విల్లు పొడగని
నరులు వల దనంగ బిట్టు నగి వికసితుఁడై.
10.1-1285-శా.
బంధుల్ మేలన వామహస్తమునఁ జాపం బెత్తి మౌర్వీలతా
సంధానం బొనరించి కొంచెపుఁదెగన్ శబ్దించుచున్ ధీరతా
సింధుం డా హరి దాని ఖండితముగాఁ జేసెన్ జనుల్ చూడగా
గంధేభంబు రసాలదండము నొగిన్ ఖండించు చందంబునన్.

భావము:
దేవేంద్రుడి ధనుస్సు వలె మిక్కిలి గొప్పదైనది. మేటి వీరులచే రక్షింపబడుతున్నది, పట్టరాని అయిన ఆ ధనుస్సును కృష్ణుడు చూసాడు. రక్షకులు వద్దంటుంటే విప్పారిన మోముతో పక్కున నవ్వి సముద్రమంత ధైర్యము కల శ్రీకృష్ణుడు తన చుట్టాలు మెచ్చుకునేలా, ఎడమచేత్తో ధనుస్సును పైకెత్తాడు. అల్లెత్రాడు తగిలించాడు. మెల్లగా నారిని మోగిస్తూ, మదపుటేనుగు చెరకుగడను విరిచినంత సుళువుగా జనులు అందరూ చూస్తుండగా దానిని విరిచేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=149&padyam=1285

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: