Thursday, October 8, 2020

శ్రీ కృష్ణ విజయము - 50

( సుదాముని మాలలు గైకొనుట )

10.1-1270-క.
దామోదర రాముల కు
ద్దామ యశోహసిత తుహినధాములకు వధూ
కాములకుఁ దెచ్చి యిచ్చె సు
దాముఁడు ఘనసురభి కుసుమదామము లధిపా!
10.1-1271-క.
వారును మాలికుఁ డిచ్చిన
భూరి కుసుమ దామములను భూషితులై నీ
కోరిన వరమిచ్చెద మని
కారుణ్యము సేయ నతఁడు గని యిట్లనియెన్.

భావము:
చంద్రుడిని సైతం అపహసించగల అతిశయించిన కీర్తి గలవారూ, మగువల పాలిటి మన్మథాకారులూ అయిన ఆ రామకృష్ణులకు సుదాముడు గొప్ప పరిమళములు గల పూలమాలలు సమర్పించాడు. సుదాముడు ఇచ్చిన ఆ పెద్ద పెద్ద దండలను రామకృష్ణులు అలంకరించుకుని “నీవు కోరిన వరమిస్తాము. ఏమి వరం కావాలో కోరుకో” అని దయతో అనుగ్రహించారు. అతడు అది గ్రహించి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=147&padyam=1271

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: