Tuesday, October 27, 2020

శ్రీ కృష్ణ విజయము - 60

( కంసుడు దుశ్శకునముల్గనుట )

10.1-1302-సీ.
కర్ణరంధ్రములు చేఁ గప్పిన లోపలి-
  ప్రాణ ఘోషము వినఁబడక డిందెఁ
దోయాదికములందుఁ దొంగిచూచుచు నుండ-
  తల గానరాదయ్యెఁ దనువుమీఁదఁ
గరశాఖ నాసికాగ్రంబుపై నిడి చూడ-
  గ్రహతారకలు రెంటఁ గానబడియె
వెలుఁగున నిలుచుండి వీక్షింపఁగా మేని-
  నీడ సరంధ్రమై నేలఁ దోఁచె
10.1-1302.1-ఆ.
నడుగుజాడ దృష్టమౌట లే దయ్యెను
దరువులెల్ల హేమతరువు లగుచు
మెఱయుచుండెఁ గాలమృత్యువు డగ్గఱ
బుద్ధి యెల్లఁ గలఁగె భోజపతికి.
10.1-1303-క.
గరళముఁ దినుటయుఁ బ్రేతము
బరిరంభించుటయు నగ్నభావుఁ డవుటయున్
శిరమునఁ దైలము పడుటయు
ఖరపతి నెక్కుటయు నతఁడు కలలోఁ గనియెన్.

భావము:
భోజరాజు కంసుడికి చేతులతో చెవిరంధ్రాలను మూసుకుంటే తన లోపలి ప్రాణవాయువు శబ్దం వినపడకుండా పోయింది. నీటిలోకానీ అద్దములోకానీ తొంగిచూస్తే శరీరము మీద శిరస్సు కన్పించడం లేదు. వ్రేలు ముక్కుకొనను ఉంచి చూస్తే సూర్యుడు మొదలైన గ్రహాలు అశ్విని మున్నగు నక్షత్రాలు ఒక్కక్కటీ రెండు రెండుగా కనిపించసాగాయి. వెలుతురులో నిలబడి చూస్తే తన దేహం నీడలో ఖాళీలు కనబడసాగాయి. నేల మీద తన అడుగుల గుర్తులు కనబడటం లేదు. చెట్లన్నీ బంగారు వన్నెతో భాసించాయి. కాలమృత్యువు సమీపించి అతని బుద్ధి కలత చెందింది. కంసుడికి కలలో విషం తిన్నట్లు; చనిపోయిన వారిని కౌఁగిలించుకొన్నట్లు; దిగంబరంగా ఉన్నట్లు; తల మీద నూనె పడినట్లు; గాడిద మీద ఎక్కినట్లు అనిపించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=152&padyam=1302

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: