Tuesday, October 6, 2020

శ్రీ కృష్ణ విజయము - 48

( రజకునివద్ద వస్త్రముల్గొనుట )

10.1-1265-క.
అంతట నొక వాయకుఁ డా
క్రంతన్ వసుదేవసుతులఁ గని బహువర్ణా
త్యంతమృదు పటాభరణము
లెంతయు సంతసముతోడ నిచ్చెన్ మెచ్చన్.
10.1-1266-శా.
కారుణ్యంబున వానిఁ గైకొని యలంకారంబు గావించి శృం
గారోదంచిత దిగ్గజేంద్ర కలభాకారంబులం బొల్చి రా
శూరుల్; మాధవుఁ డంత వాయకుని శుశ్రూషన్ మహాప్రీతుఁడై
సారూప్యంబును లక్ష్మియు న్నొసఁగె నైశ్వర్యాది సంధాయియై. 

భావము:
అటు పిమ్మట ఆ దారిలో వస్తున్న ఒక నేతపనివాడు వసుదేవుడి కుమారులైన రామకృష్ణులను చూసి వారు మెచ్చుకొనేలా మిక్కిలి మెత్తనైన రంగు రంగుల వస్త్రాభరణాలను పరమ సంతోషంతో ఇచ్చాడు. శూరులైన రామకృష్ణులు ఆ వస్త్రాభరణాలను దయతో స్వీకరించి అలంకరించుకుని సింగారింపబడిన దిగ్గజాల గున్నల మాదిరి అందగించారు. పిమ్మట కృష్ణుడు ఆ నేతపనివాడి పరిచర్యకు మిక్కిలి సంతుష్టుడు అయ్యాడు. వాడికి సకల ఐశ్వర్యాలను అనుగ్రహించి, తన సారూప్యమును సంపత్తినీ ప్రసాదించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=145&padyam=1266

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: