Sunday, October 11, 2020

శ్రీ కృష్ణ విజయము - 53

( కుబ్జననుగ్రహించుట )

10.1-1278-ఉ.
"చక్కనివాఁడ వౌదు; సరసంబుల నొంపకు; మెల్లవారికిం
జక్కఁదనంబు లెక్కడివి; చారుశరీర! త్రివక్ర యండ్రు; నే
నిక్కము కంసుదాసిని; వినిర్మల లేపన విద్యదాన; నన్
మిక్కిలి రాజుమెచ్చుఁ; దగ మీరు విలేపనముల్ ధరింపరే!"
10.1-1279-క.
అని పలికి యా కుమారుల
తనువులు నగవులును వీక్షితమ్ములు మాటల్
తన చిత్తముఁ గరఁగించిన
ననులేపము లిచ్చె వారి కబల ప్రియముతోన్.

భావము:
“ఓ సుందరాంగుడా! నీవు బలే అందగాడివేలే కానీ, సరసాలతో నన్ను వేధించకు. అందరికీ అందాలు ఎక్కడ నుంచి వస్తాయి? త్రివిక్ర అంటారు నన్ను. నేను కంసుడి దాసిని. స్వచ్ఛమైన మైపూతలు చేయుట తెలిసినదానిని. నన్ను రాజు ఎంతో మెచ్చుకుంటూ ఉంటాడు. మీరు ఈ విలేపనాలు చక్కగా రాసుకోండి.” ఆ పడచువారైన బలరామకృష్ణుల చక్కటి స్వరూపాలు, నవ్వులు, చూపులు, మాటలు తన మనస్సును కరగించగా, ఆ కుబ్జ ప్రేమతో ఇలా అంటూ వారికి మైపూతలు ఇచ్చింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=148&padyam=1279

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: