Friday, June 21, 2019

కపిల దేవహూతి సంవాదం - 42


( విష్ణు సర్వాంగ స్తోత్రం )

3-923-వ.
మఱియు,
3-924-సీ.
కంజాతకింజల్క పుంజరంజిత పీత; 
కౌశేయవాసు జగన్నివాసు
శత్రుభీకర చక్ర శంఖ గదాపద్మ; 
విహిత చతుర్భాహు విగతమోహు
నుతభక్తలోక మనోనేత్రవర్ధిష్ణు; 
లాలిత సద్గుణాలంకరిష్ణు
వరకుమారక వయఃపరిపాకు సుశ్లోకు; 
సుందరాకారు యశోవిహారు
3-924.1-తే.
సకలలోక నమస్కృతచరణకమలు
భక్తలోక పరిగ్రహప్రకటశీలు
దర్శనీయ మనోరథదాయిఁ గీర్త
నీయ తీర్థయశోమహనీయమూర్తి.

భావము:
ఇంకా పద్మకేసరాల రంగుతో మిసమిసలాడే పసుపుపచ్చని పట్టువస్త్రం కట్టుకున్నవాడు, లోకాలను తనలో పెట్టుకున్నవాడు, శత్రుభయంకరాలైన శంఖ చక్ర గదా పద్మాలను చతుర్బాహువులలో ధరించేవాడు, మోహాన్ని హరించేవాడు, స్తోత్రం చేసే భక్తులకు జ్ఞాననేత్రాన్ని అనుగ్రహించేవాడు, సుగుణాలనే సురుచిర భూషణాలను పరిగ్రహించేవాడు, నిత్యయౌవనుడు, భువనపావనుడు, సౌందర్యశీలుడు, యశోవిశాలుడు, సమస్త లోకాలూ నమస్కరించే పాదపద్మాలు కలవాడు, భక్తజనులను ఆదరించే భావాలు కలవాడు, కోరిన కోరికలను ప్రసాదించేవాడు, మహనీయ కీర్తితో ప్రకాశించేవాడు అయిన శ్రీహరిని (ధ్యానించాలి).

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=50&padyam=924

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: