Tuesday, June 4, 2019

కపిల దేవహూతి సంవాదం - 31

3-909-సీ.
శ్రద్ధాగరిష్ఠుఁడై సత్య మైనట్టి మ; 
ద్భావంబు మత్పాద సేవనంబు
వర్ణిత మత్కథాకర్ణనంబును సర్వ; 
భూత సమత్వమజాతవైర
మును బ్రహ్మచర్యంబు ఘన మౌనమాదిగా; 
గల నిజ ధర్మసంగతులఁ జేసి
సంతుష్టుఁడును మితాశనుఁడు నేకాంతియు; 
మననశీలుఁడు వీత మత్సరుండు
3-909.1-తే.
నగుచు మిత్రత్వమున గృపఁ దగిలి యాత్మ
కలిత విజ్ఞాని యై బంధకంబు లైన
ఘన శరీర పరిగ్రహోత్కంఠ యందు
నాగ్రహము వాసి వర్తింప నగును మఱియు.

భావము:
చలించని శ్రద్ధాసక్తులతో నాయొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకోవాలి. నా పాదాలు సేవించాలి. నా కథలను ఆకర్ణించాలి. సర్వజీవులయందు సమబుద్ధితో ప్రవర్తిందాలి. ఎవ్వరితోను వైరం లేకుండా ఉండాలి. బ్రహ్మచర్యం, మౌనం మొదలైన ఆత్మధర్మాలను అవలంబించాలి. ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి. మితంగా భుజించాలి. ఏకాంతంగా ఉండాలి. మననశీలుడై ఉండాలి. మాత్సర్యాన్ని దూరం చేసుకోవాలి. మైత్రి, కరుణ అభ్యసించాలి. ఆత్మజ్ఞానం అలవరచుకోవాలి. తన శరీరం మీద, ఆత్మీయులైనవారి మీద ఆసక్తి తగ్గించుకోవాలి. అవి బంధనానికి హేతువు లవుతాయి. ఇంకా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=49&padyam=909

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: