Tuesday, June 11, 2019

కపిల దేవహూతి సంవాదం - 35

3-913-సీ.
"విమలాత్మ యీ పృథివికిని గంధమునకు; 
సలిలంబునకును రసంబునకును
నన్యోన్య మగు నవినాభావసంబంధ; 
మైన సంగతిఁ బ్రకృత్యాత్మలకును
సతతంబు నన్యోన్య సంబంధమై యుండు; 
ప్రకృతి దా నయ్యాత్మఁ బాయు టెట్లు
దలపోయ నొకమాటు తత్త్వబోధముచేత; 
భవభయంబుల నెల్లఁ బాయు టెట్లు
3-913.1-తే.
చచ్చి క్రమ్మఱఁ బుట్టని జాడ యేది
యిన్నియుఁ దెలియ నానతి యిచ్చి నన్నుఁ
గరుణ రక్షింపవే దేవగణసుసేవ్య! 
భక్తలోకానుగంతవ్య! పరమపురుష!"

భావము:
“పుణ్యాత్మా! పంచభూతాలలో పృథివికి, గంధానికి, జలానికి, రసానికి అన్యోన్యమైన అవినాభావ సంబంధం ఎలా ఉన్నదో అదే విధంగా ప్రకృతికి, ఆత్మకు ఎల్లప్పుడు పరస్పర సంబంధం ఉంది కదా! అటువంటప్పుడు ప్రకృతి ఆత్మను ఎలా విడిచి పెట్టగలుగుతుంది? ఒక్కసారి కలిగిన తత్త్వజ్ఞానంవల్ల సంసారభయాలు ఎలా తొలగిపోతాయి? చచ్చిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉండే మార్గం ఏది? ఇవన్నీ నాకు బాగా తెలిసేటట్లు చెప్పు. దేవతలచే సేవింపబడేవాడా! భక్తజన శరణ్యా! పరమపురుషా! దయతో ఈ జ్ఞానం నాకు కటాక్షించు. నన్ను రక్షించు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=49&padyam=913

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: