Wednesday, June 12, 2019

కపిల దేవహూతి సంవాదం - 36

3-914-వ.
అనిన భగవంతుం డిట్లనియె "అనిమిత్తం బయిన స్వధర్మంబునను, నిర్మలాంతఃకరణంబునను, సునిశ్చితంబైన మద్భక్తియోగంబునను, సత్కథాశ్రవణసంపాదితంబైన వైరాగ్యంబునను, దృష్ట ప్రకృతిపురుష యాధ్యాత్మంబగు జ్ఞానంబునను, బలిష్ఠం బయి కామానభిష్వంగం బగు విరక్తివలనఁ దపోయుక్తం బయిన యోగంబునను, దీవ్రం బయిన చిత్తైకాగ్రతం జేసి పురుషుని దగు ప్రకృతి దందహ్యమానం బై తిరోధానంబును బొందు; అదియునుం గాక యరణిగతం బైన వహ్నిచే నరణి దహింపఁ బడు చందంబున జ్ఞానంబునను దత్త్వదర్శనంబుననుం జేసి నిరంతరంబు బలవంతంబును దృష్టదోషంబును నగు ప్రకృతి జీవునిచేత భుక్తభోగమై విడువంబడు" అని చెప్పి.

భావము:
దేవహూతి ఇలా ప్రశ్నించగా భగవంతుడైన కపిలుడు ఇలా అన్నాడు. “సాధకుడైన పురుషుడు ఎటువంటి ఫలాన్ని కోరకుండా తన ధర్మాలను తాను నిర్వర్తిస్తూ ఉండాలి. తన మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. నాయందు అచంచలమైన భక్తి కలిగి ఉండాలి. పుణ్యకథలను ఆసక్తితో వినాలి. ప్రకృతి పురుష సంబంధమైన యథార్థజ్ఞానాన్ని అవగతం చేసుకోవాలి. కోరికలను దూరంగా పారద్రోలి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. తపస్సుతో కూడిన యోగాభ్యాసం చేయాలి. అఖండమైన ఏకాగ్రతను అవలంభించాలి. ఈ సాధనవల్ల పురుషుని అంటుకొని ఉన్న ప్రకృతి దందహ్యమానమై అదృశ్యమైపోతుంది. అరణినుంచి ఉదయించిన అగ్ని అరణిని కాల్చి వేసినట్లు జ్ఞానం వల్లనూ, తత్త్వదర్శనం వల్లనూ పటిష్ఠమూ బలిష్ఠమూ దోషభూయిష్ఠమూ అయిన ప్రకృతిని అనుభవిస్తున్న జీవుడు సగంలోనే మొగం మొత్తి పరిత్యాగం చేస్తాడు” అని చెప్పి (ఇంకా ఇలా అన్నాడు).

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=49&padyam=914

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: