Friday, June 14, 2019

కపిల దేవహూతి సంవాదం - 38

3-918-సీ.
"అధ్యాత్మ తత్పరుం డగు వాఁడు పెక్కు జ; 
న్మంబులఁ బెక్కు కాలంబు లందు 
బ్రహ్మపదప్రాప్తి పర్యంతమును బుట్టు; 
సర్వార్థవైరాగ్యశాలి యగుచుఁ
బూని నా భక్తులచే నుపదేశింపఁ; 
బడిన విజ్ఞానసంపత్తిచేత
బరఁగఁ బ్రబుద్ధుఁడై బహువారములు భూరి; 
మత్ప్రసాదప్రాప్తిమతిఁ దనర్చు
3-918.1-తే.
నిజపరిజ్ఞాన విచ్ఛిన్ననిఖిలసంశ
యుండు నిర్ముక్తలింగదేహుండు నగుచు
ననఘ! యోగీంద్రహృద్గేయ మగు మదీయ
దివ్యధామంబు నొందు సందీప్తుఁ డగుచు.

భావము:
"పుణ్యాత్మురాలా! ఆత్మజ్ఞాన సంపన్నుడైనవాడు బ్రహ్మపదం ప్రాప్తించే వరకు ఎంతకాలమైనా ఎన్ని జన్మలైనా ఎత్తుతూనే ఉంటాడు. వాని వైరాగ్యం చెక్కు చెదరదు. నా భక్తులు ఉపదేశించిన విజ్ఞాన సంపదవల్ల ప్రబోధం పొందినవాడై ఎన్నో మారులు నా అనుగ్రహానికి పాత్రుడవుతూ ఉంటాడు. తాను పొందిన ఆత్మజ్ఞానంతో తన సందేహా లన్నింటినీ పోగొట్టుకుంటాడు. లింగదేహాన్ని విడిచిపెట్టి యోగిపుంగవుల అంతరంగాలకు సంభావ్యమైన నా దివ్యధామాన్ని తేజస్వియై చేరుకొంటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=49&padyam=918

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: