Sunday, June 9, 2019

కపిల దేవహూతి సంవాదం - 32

3-910-వ.
జీవేశ్వర తత్త్వజ్ఞానంబునం జేసి నివృత్తం బయిన బుద్ధి దదవస్థానంబునుం గలిగి దూరీభూతేతరదర్శనుండై జీవాత్మజ్ఞానంబునం జేసి చక్షురింద్రియంబున సూర్యుని దర్శించు చందంబున నాత్మ నాయకుం డయిన శ్రీమన్నారాయణుని దర్శించి నిరుపాధికంబై మిథ్యాభూతం బగు నహంకారంబున సద్రూపంబుచేఁ బ్రకాశమానం బగుచుఁ బ్రధాన కారణంబునకు నధిష్ఠానంబును గార్యంబునకుఁ జక్షువుం బోలెఁ బ్రకాశంబును సమస్త కార్యకారణానుస్యూతంబును బరిపూర్ణంబును సర్వవ్యాపకంబును నగు బ్రహ్మంబును బొందు" నని చెప్పి వెండియు నిట్లనియె.

భావము:
జీవేశ్వరుల యథార్థస్వరూపం (త్రిగుణాత్మకమైన ప్రకృతిలో చిక్కుకొన్నవాడు జీవుడనీ, త్రిగుణాలకు అతీతుడై వానిని నడిపించేవాడు ఈశ్వరుడనీ) తెలుసుకొనడంవల్ల బుద్ధి అంతర్ముఖ మౌతుంది. అందువల్ల బుద్ధియందలి సంకల్ప వికల్పాల క్రమం తెలుస్తుంది. అప్పుడు ఇతర పదార్థాలేవీ కన్పించవు. జీవాత్మజ్ఞానంతో కంటితో సూర్యుణ్ణి చూచినంత సూటిగా ఆత్మనాయకుడైన శ్రీమన్నారాయణుని దర్శనం లభిస్తుంది. అప్పుడు అహంకారానికి తావుండదు. అది మిథ్యాభూతమై తొలగిపోతుంది. సత్యం ప్రకాశమాన మవుతుంది. అందువల్ల ప్రధానకారణమైన మూలప్రకృతికి ఆధారమూ, సమస్త సృష్టినీ దృష్టివలె ప్రకాశింప చేసేదీ, విశ్వంలోని సమస్త కార్యకారణాలకూ మూలభూతమూ, పరిపూర్ణమూ, సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మాన్ని పొందగలుగుతాడు” అని చెప్పి కపిలుడు ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=49&padyam=910

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: