Wednesday, June 12, 2019

కపిల దేవహూతి సంవాదం - 37

3-915-క.
"విను ప్రకృతి నైజమహిమం
బునఁ దనలో నున్న యట్టి పురుషునకు మహే
శునకు నశుభవిస్ఫురణం
బనయముఁ గావింపజాల దది యెట్లనినన్.
3-916-చ.
పురుషుఁడు నిద్రవోఁ గలలఁ బొందు ననర్థకముల్ ప్రబోధమం
దరయగఁ మిథ్యలై పురుషు నందు ఘటింపని కైవడిం బరే
శ్వరునకు నాత్మనాథునకు సర్వశరీరికిఁ గర్మసాక్షికిం
బరువడిఁ బొంద వెన్నఁటికిఁ బ్రాకృతదోషము లంగనామణీ!"
3-917-వ.
అని వెండియు నిట్లనియె.

భావము:
“అమ్మా! విను. ప్రకృతి తన సహజ ప్రభావం వల్ల తనకు అధీశ్వరుడై తనలో ప్రవర్తించే పురుషునకు అమంగళాన్నీ, అనర్థాన్నీ ఆచరించలేదు. ఓ ఉత్తమనారీ! మానవుడు నిద్రపోతున్నపుడు పీడకలలలో పొందే కష్టనష్టాలు మేలుకొనగానే అసత్యాలని తెలుసుకుంటాడు. అదే విధంగా ఆత్మనాథుడూ, కర్మసాక్షీ అయిన పరమేశ్వరునకు ప్రకృతికి సంబంధించిన దోషాలు ఎన్నటికీ అంటవు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=49&padyam=916

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: