3-921-వ.
అది యెట్లనిన, శక్తికొలఁది స్వధర్మాచరణంబును; శాస్త్ర వినిషిద్ధ ధర్మకర్మంబులు మానుటయు; దైవికంబై వచ్చిన యర్థంబువలన సంతోషించుటయు; మహాభాగవత శ్రీపాదారవిందార్చనంబును; గ్రామ్యధర్మ నివృత్తియు; మోక్షధర్మంబుల యందు రతియు; మితం బై శుద్ధం బయిన యాహార సేవయు; విజనం బయి నిర్బాధకం బయిన స్థానంబున నుండుటయు; హింసా రాహిత్యంబును; సత్యంబును; నస్తేయంబును; దన కెంత యర్థం బుపయోగించు నంత యర్థంబ స్వీకరించుటయు; బ్రహ్మచర్యంబును; తపశ్శౌచంబులును; స్వాధ్యాయ పఠనంబును; బరమ పురుషుం డైన సర్వేశ్వరుని యర్చనంబును; మౌనంబును; నాసన జయంబును; దానం జేసి స్థైర్యంబును; బ్రాణవాయు స్వవశీకరణంబును; నింద్రియ నిగ్రహరూపం బైన ప్రత్యాహారంబును; మనంబుచే నింద్రియంబుల విషయంబులవలన మరలించి హృదయ మందు నిలుపటయు; దేహగతం బైన మూలాధారాది స్థానంబులలో నొక్క స్థానంబు నందు హృదయ గతం బయిన మనస్సుతోడంగూడఁ బ్రాణ ధారణంబును; వైకుంఠుం డైన సర్వేశ్వరుండు ప్రవర్తించిన దివ్య లీలాచరిత్ర ధ్యానంబును; మానసైకాగ్రీకరణంబును; బరమాత్మ యగు పద్మనాభుని సమానాకారతయును; నిదియునుం గాక తక్కిన వ్రతదానాదులం జేసి మనోదుష్టం బయిన యసన్మార్గంబును బరిహరించి జితప్రాణుం డై, మెల్లన యోజించి శుచి యైన దేశంబునం బ్రతిష్టించి విజితాసనుం డై, యభ్యస్త కుశాజిన చేలోత్తరాసనం బైన యాసనంబు సేసి, ఋజుకాయుం డై ప్రాణమా ర్గంబును గుంభక రేచక పూరకంబులం గోశశోధనంబు సేసి, కుంభక పూరకంబుల చేతం బ్రతికూలంబు గావించి, చంచలం బయిన చిత్తంబు సుస్థిరంబు గావించి, తీవ్రం బయిన యమంబునం బ్రతప్తం బయి విగత సమస్త దోషం బగు చామీకరంబు కరణి విరజంబు సేసి, జిత మారుతుం డగు యోగి గ్రమ్మఱం బ్రాణాయామం బను పావకుని చేత వాత పిత్త శ్లేష్మంబులను దోషంబుల భస్మీకరణంబు సేసి, ధారణంబు చేతఁ గిల్బిషంబులను బ్రత్యాహారంబు చేత సంసర్గంబులను దహనంబు సేసి ధ్యానంబుచేత రాగంబుల సత్త్వాదిగుణంబులను నివారించి స్వ నాసాగ్రావలోకనంబు సేయుచు.
భావము:
అది ఎలాగంటే తన శక్తి వంచన లేకుండా తన ధర్మాలను తాను ఆచరించడం, శాస్త్రాలలో నిషేధింపబడిన కర్మలను మానడం, దైవికంగా అనగా తన ప్రయత్నం లేకనే లభించిన ధనంతో సంతోషించడం, మహాత్ములైన భగవద్భక్తుల దివ్యపాదపద్మాలను సేవించడం, ఇతరులకు ఏవగింపు కలిగించే పనులను మానుకొనడం, మోక్షధర్మాలైన శాంతి అహింస మొదలైన విషయాలపైన ఆసక్తి కలిగి ఉండటం, పరిశుద్ధమైన ఆహారాన్ని మితంగా తినడం, ప్రశాంతమై ఇబ్బందిలేని ఏకాంతప్రదేశంలో నివాసం చేయడం, హింస చేయకుండా ఉండడం, సత్యమార్గాన్ని తప్పక పోవడం, ఇతరుల వస్తువులను దొంగిలించకుండా ఉండడం, తనకు ఎంత అవసరమో అంతవరకే ధనం గ్రహించడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, తపశ్శౌచాలు కలిగి ఉండడం, సద్గ్రంధాలు చదవడం, సర్వేశ్వరుణ్ణి పూజించడం, మౌనంగా ఉండడం, ఎక్కువకాలం అనుకూలమైన పద్ధతిలో భగవంతుని ధ్యానిస్తూ కూర్చోవడం, ఈ ఆసనవిజయం వల్ల స్థిరత్వం సంపాదించడం, ప్రాణవాయువును స్వాధీనం చేసుకోవడం, ఇంద్రియాలను విషయాలనుండి నిగ్రహించడం, ఇంద్రియాల నుండి మరలిన మనస్సునందు హృదయాన్ని నిల్పడం, దేహమందున్న మూలాధారం మొదలైన స్థానాలలో ఏదో ఒక స్థానమందు హృదయంలో కల మనస్సుతో కూడా ప్రాణధారణ చేయడం, శ్రీమన్నారాయణుని దివ్య చరిత్రలోని లీలలను ధ్యానించడం, మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోవడం, పరమాత్మ అయిన పద్మనాభుడు అంతటా నిండి ఉన్నాడని విశ్వసించడం ఇత్యాదులు యోగధర్మాలు. ఇవే కాకుండా ఇతర వ్రతాలను, దానాలను ఆచరించాలి. మనోమాలిన్యంతో కూడిన చెడుమార్గాలను విడిచిపెట్టాలి. ప్రాణాయామపరుడై చక్కగా ఆలోచించి శుచియైన ప్రదేశంలో ఎటువంటి ఆటంకం లేకుండా దర్భాసనంపై ఒక జింకచర్మాన్ని, దానిపైన వస్త్రాన్ని పరచి సుఖాసనంపై కూర్చోవాలి. శరీరాన్ని నిటారుగా నిలుపుకొని కుంభక పూరక రేచక రూపమైన ప్రాణాయామంతో అన్నమయ ప్రాణమయాది కోశాలను శుద్ధి చేసుకొని చంచలమైన చిత్రాన్ని సుస్థిరం చేసుకొని, తీవ్రమైన సాధనతో బాగా కాచి కరిగించి మాలిన్యం పోగొట్టిన బంగారాన్ని వలె మనస్సును స్వచ్ఛం చేసుకోవాలి. ఈ విధంగా వాయువును వశం చేసుకొన్న యోగికి ప్రాణాయామం అనే అగ్ని చేత వాతపీత్తశ్లేష్మాలనే దోషాలు నశిస్తాయి. ఏకాగ్రత వల్ల పాపాలు రూపుమాసిపోతాయి. మనోనిగ్రహం వల్ల చెడు సంసర్గాలు విడిపోతాయి. అటువంటి యోగి ధ్యానంవల్ల రాగద్వేషాలకు, త్రిగుణాలకు అతీతుడై తన ముక్కు చివరి భాగాన దృష్టిని కేంద్రీకరించాలి.
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=49&padyam=921
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :