Tuesday, August 14, 2018

శ్రీకృష్ణ లీలలు - 64:

10.1-403-వ.
ఇట్లు నిర్మూలంబు లై పడిన సాలంబులలోనుండి కీలికీలలు వెల్వడు పోలిక నెక్కుడు తేజంబున దిక్కులు పిక్కటిల్లం బ్రసిద్ధు లైన సిద్ధు లిద్దఱు వెడలివచ్చి ప్రబుద్ధులై భక్తలోకపాలకుండైన బాలకునకు మ్రొక్కి లేచి కరకమలంబులు మొగిడ్చి యిట్లనిరి.
10.1-404-క.
బాలుఁడవె నీవు? పరుఁడ వ
నాలంబుఁడ వధికయోగి వాద్యుడవు తను
స్థూలాకృతి యగు విశ్వము
నీ లీలారూప మండ్రు నిపుణులు కృష్ణా!

భావము:
అలా మొదలంటా కూలిన ఆ జంట మద్ది చెట్లలోనుండి, అగ్నిజ్వాలలు వెలువడినట్లు ఇద్దరు యక్షులు నిద్రమేల్కొన్నట్లు లేచి, దిక్కులు నిండిన తేజస్సులతో ప్రత్యక్ష మయ్యారు. భక్తులందరినీ రక్షించే కృష్ణబాలకునికి వికసించిన జ్ఞానంతో తలవంచి నమస్కారాలు చేసారు. చేతులు జోడించి అతనితో ఇలా అన్నారు. "శ్రీకృష్ణా! నీవు సామాన్య మానవ బాలుడవా? కాదు కాదు. పరబ్రహ్మవు. నీకు నీవే కాని వేరే ఆధారం అక్కరలేని వాడవు. మహాయోగివి. అన్నిటికీ మొదటివాడవు. అత్యంత సూక్ష్మం నుండి అత్యంత స్థూలం వరకూ ఈ విశ్వమంతా నీ రూపమే అని వివేకులు అంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=57&padyam=404

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: