Tuesday, August 14, 2018

శ్రీకృష్ణ లీలలు - 66

10.1-406-క.
భువనములు చేయఁ గావఁగ
నవతీర్ణుఁడ వైతి కాదె యఖిలేశ్వర! యో
గివరేణ్య! విశ్వమంగళ! 
కవిసన్నుత! వాసుదేవ! కల్యాణనిధీ!
10.1-407-ఉపేం.
తపస్వివాక్యంబులు దప్ప వయ్యెన్; 
నెపంబునం గంటిమి నిన్నుఁ జూడన్
దపంబు లొప్పెన్; మముఁ దావకీయ
ప్రపన్నులం జేయుము భక్తమిత్రా!


భావము:
ఓ వాసుదేవా! శ్రీకృష్ణా! ఈ లోకాలను అన్నింటినీ సృష్టించడానికీ, రక్షించడానికీ అవతరించావు గదా! నీవు ఈ సమస్తానికి ఈశ్వరుడవు. యోగులు అందరూ నిన్ను దైవంగా వరించారు. నీవు ఈ సృష్టికి శుభాలు చేకూర్చుతావు. సృష్టిలోని శుభాలు అన్నీ నీ నుండే పుడుతూ ఉన్నాయి. ఓ కృష్ణపరమాత్మా! నారదమునీంద్రుల వారు మహాతపస్వి. వారి మాటలు వట్టిపోకుండా అలాగే జరిగింది. వారి శాపం పుణ్యమా అని నిన్ను చూడగలిగాము. ఇన్నేళ్ళ నుండీ నిన్ను చూడాలనే తపించాము. ఇప్పటికి ఫలించింది. నీవు భక్తులకు పరమ మిత్రుడవు. మమ్ములను నీ శరణాగత భక్తులుగా మన్నించి అనుగ్రహించు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: