10.1-405-సీ.
ఎల్లభూతంబుల కింద్రియాహంకృతి;
ప్రాణంబులకు నధిపతివి నీవ;
ప్రకృతియుఁ బ్రకృతిసంభవమహత్తును నీవ;
వీని కన్నిటికిని విభుఁడ వీవ;
ప్రాకృతగుణవికారములఁ బొందక పూర్వ;
సిద్దుఁడ వగు నిన్నుఁ జింత జేయ
గుణయుతుం డోపునే? గుణహీన! నీ యంద;
కల గుణంబుల నీవ కప్పఁబడుదు;
10.1-405.1-తే.
మొదల నెవ్వని యవతారములు శరీరు
లందు సరిదొడ్డు లేని వీర్యముల దనువు
లడర జన్మించి వారల యందుఁ జిక్క;
వట్టి పరమేశ! మ్రొక్కెద మయ్య! నీకు.
భావము:
సకల జీవరాశులకు, పంచభూతములు, చతుర్దశదశ ఇంద్రియములు, అహంకారము, పంచప్రాణములు సమస్తమునకు అధిపతివి; ప్రకృతీ నీవే, దానినుండి పుట్టిన మహత్తూ నీవే; అయినా వీటికి వేటికినీ అందకుండా అన్నిటిపైన ఉండే అధిపతివి నీవే; ప్రకృతి గుణాలు, నీలో ఏమార్పును కలిగించలేవు. నీలోంచే అవి పుట్టుకు వస్తాయి. సృష్టికి పూర్వంనుండి స్వయం ప్రకాశము కలవాడవు. ఇక గుణాలతో ఆవరింపబడినవాడు నిన్ను గూర్చి ఎలా ధ్యానం చేయగలడు? నీకు ఏ గుణాలూ లేవు; నీ నుండి గుణాలు వస్తూ ఉంటాయి; వాటిచేత కప్పబడి రహస్యంగా దాగి ఉంటావు; శరీరం ధరించిన వీరెవ్వరూ నీ అవతార వైభవాలకి సాటిరారు; నీ రూపాలు వేరు, వీళ్ళరూపాలు వేరు; ఈ జీవులంతా నీ తేజస్సుతో శరీరాలు ధరించి పుడతారు; కనుక వీళ్ళకి అంతుపట్టవు. అటువంటి పరమపురుష! నీకు నమస్కారం చేస్తున్నాము.
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment