10.1-408-శా.
నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్
నీ పేరం బనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపైఁ జూపులున్
నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపైఁ జిత్తముల్
నీ పై బుద్దులు మాకు నిమ్ము కరుణన్నీరేజపత్రేక్షణా!
10.1-409-వ.
అని యిట్లు కీర్తించిన గుహ్యకులం జూచి నగుచు నులూఖల బద్ధుండైన హరి యిట్లనియె.
భావము:
ఓ కమలపత్రాల వంటి కన్నులున్న కన్నయ్యా! నీ స్తుతి చేసే పద్యాలను విడువక వింటూ ఉండే చెవులను, నిన్ను విడువక స్తోత్రం చేస్తు ఉండే వాక్కులను మాకు అనుగ్రహించు. ఏ పని చేస్తున్నా నీ పేరనే నీ పనిగానే చేసే చేతలను, ఎప్పుడు విడువక నిన్నే చూసే చూపులను మాకు అనుగ్రహించు. నీ పాదపద్మాలను విడువక నమస్కరించే శిరస్సులను, నీమీద ఏకాగ్రమైన భక్తి కలిగి ఉండే మనస్సును, నిరంతరం నీ ధ్యానం పైనే నిలిచి ఉండే బుద్ధిని మాకు దయతో ప్రసాదించు, పరమేశ్వరా!
బాలకృష్ణుడు తన నడుముకు కట్టిన ఱోలు ఈడ్చుకుంటూ రెండు మద్దిచెట్లను కూల్చాడు. వాటినుండి విముక్తులైన గుహ్యకులు కపటబాలుని స్తుతించి మాకు నీ యందు ప్రపత్తిని అనుగ్రహించమని ఇలా వేడుకున్నారు. ఇది భాగవతుల ధర్మాలని నిర్వచించే ఒక పరమాద్భుతమైన పద్యం. అందుకే ఒక శార్దూలాన్ని వదలి, ప్రాసాక్షార నియమాన్ని యతి స్థానాలైన మొదటి, పదమూడవ స్థానాలకు కూడా ప్రసరింపజేసి పంచదార పలుకులకు ప్రత్యేక జిలుగులు అద్దారు పోతనామాత్యులు. ఇలా స్తుతిస్తున్న యక్షులు నలకూబర, మణిగ్రీవులతో రోటికి కట్టబడి ఉన్న కృష్ణమూర్తి చిరునవ్వులు నవ్వుతూ ఇలా అన్నాడు.
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment