Tuesday, February 10, 2015

మధురిమలు – కాటుక కంటినీరు

ఉ.
కాటుక కంటి నీరు చనుట్టు పయింబడ నేల యేడ్చెదో
కైభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణా కిరాట కీచకులుమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!
          నీవు కంటికి పెట్టుకున్న కాటుక, కన్నీటికి కరిగి రవికపై పడేలా ఎందుకు ఏడుస్తావు, తల్లీ? ఆ మహా విష్ణువునకు ఇష్టమైన కోడలా! ఓ మా తల్లీ! బ్రహ్మదేవునికి సాక్షాత్తు ఇల్లాలా! నిన్నుతీసుకుపోయి అంగట్లో పెట్టినట్లు, ఆ కర్ణాట కిరాట కీచకులకు అమ్మివేయను. త్రికరణ శుద్ధిగా ఒట్టు వేస్తున్నాను. నన్ను నమ్ము సరస్వతీదేవి!
          ఆంధ్రమహాభాగవతాన్ని రాజుకి అంకితం యిమ్మని, బమ్మెర పోతనను అనేక రకాలుగా వత్తిడి చేస్తున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా. ఆ పైన వత్తిడి చేసేవారు సాక్షాత్తు శ్రీనాథ కవిసార్వభౌములు. పోతరాజు నలిగిపోతున్నాడు. అయినా శ్రీరామునికి తప్ప నరుల కెవ్వరికి అంకిత మివ్వను అంటున్నాడు. గంటం పట్టింది సంపాదించటానికి కాదు, నా నాగలి పెట్టేది మాకు చాలు అంటున్నాడు. అట్టి పరిస్థితులలో ఒకమారు దేవతా పీఠం వద్ద కలత మనసుతో వచ్చి కూర్చున్నాడు. సాక్షాత్తు తల్లి వాణి కన్నీరు కారుస్తూ ప్రత్యక్ష మైంది. చూసి తట్టుకోలేని బాధలో చెమర్చిన కన్నులతో పోతన్నగారి నోటివెంట ఈ పద్యం అలవోకగా జాలువారిందిట. ఆమె తృప్తిగా వెళ్ళింది. ఎలా అయితేనేమి ఈ పరమాద్భుతమైన చాటువు తెలుగువారికి దక్కింది.
u.
kaaTuka kaMTi neeru chanukaTTu payiMbaDa naela yaeDchedO
kaiTabhadaityamardanuni gaadili kODala! yO madaMba! yO
haaTakagarbhuraaNi! ninu naakaTikiM gonipOyi yalla ka
rNaaTa kiraaTa keechakulu kamma triSuddhiga nammu bhaaratee!
          కాటుక = కంటికి పెట్టుకొనెడి నల్లని అంజనము; కంటినీరు = కన్నీరు; చనుకట్టు = రవిక {చనుకట్టు - స్తనములపై కట్టుకొను బట్ట, రవిక}; పయిన్ = మీద; పడన్ = పడునట్లు; ఏలన్ = ఎందుకు, ఏడ్చెదో = ఏడుస్తున్నావు; కైటభదైత్యమర్దనుని = విష్ణుమూర్తికి {కైటభాసురుని చంపిన వాడు, విష్ణువు}; గాదిలి = ప్రియమైన; కోడల = కొడుకు పెండ్లామా {విష్ణువు కొడుకు బ్రహ్మ ఆయన భార్య వాణి};=; మత్ = నా యొక్క; అంబ = తల్లి; = ఓ, హాటకగర్భురాణి = సరస్వతీదేవి {హాటకగర్భురాణి = హాటకగర్భు (హాటకము (బంగారము / హిరణ్యం) గర్భ (గర్భముగ కలవాడు), బ్రహ్మ} రాణి (భార్య), వాణి; నినున్ = నిన్ను; ఆకటికిన్ = ఆకలికి; కొనిపోయి = తీసుకెళ్ళి; ఆల్ల =; కర్ణాట కిరాట కీచకులు = కర్ణాట కిరాట కీచకులు; కున్ = కు; అమ్మన్ = అమ్ముకొనను; త్రిశుద్ధిగన్ = ఒట్టు {మనోవాక్కాయకర్మల శుద్ధ}; నమ్ము = సందేహించవద్దు; భారతీ = సరస్వతీదేవి {భారతి = ఈ లోకమునకు భరతముని చేత తేబడినది, సరస్వతి}.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

3 comments:

servantkris said...

కృతఙ్ఞతలు

Anonymous said...

🙏🙏🙏

Anonymous said...

Thanks