10.1-249-వచనము
ఆ సమయంబున.
ఆ = ఆ;
సమయంబునన్ = సమయమునందు.
శైశవ కృష్ణుడు
బోర్లా పడ్డాడు. యశోదాదేవి పండుగ జేస్తున్నది. గోపకులను గౌరవించే హడావిడిలో,
చంటిపిల్లడిని ప్రీతిగా పాన్పు మీద నిద్రపోగొట్టింది. పనులలో మునిగిపోయింది.
అప్పుడు. .
10.1-250-కంద పద్యము
నిదురించిన శిశు వాకొని
కిదుకుచుఁ జనుఁ గోరి కెరలి కిసలయ విలస
న్మృదు చక్రచాపరేఖా
స్పద పదమునఁ దన్నె నొక్క బండిన్ దండిన్.
అలా నిద్రనటిస్తున్న చంటిపిల్లాడుగా
ఉన్న శ్రీకృష్ణునికి ఆకలివేసింది. పాలకోసం ఒళ్ళు విరుచుకుంటు కాళ్ళు చేతులు
ఆడిస్తున్నాడు. ఆ పాదాలు మామూలువా, కాదు చక్రం చాపం మున్నగు శుభరేఖలతో అలరారేది.
అట్టి పాదంతో ఒక బండిని గట్టిగా తన్నాడు.
కృష్ణుడు షడ్భావ సూన్యుడు, షడూర్మి
శూన్యుడు. అయినను నిద్ర నటిస్తున్నాడు. లోకవిడంబనార్థం తల్లిపాలు తాగాలని
చూస్తున్నట్లు నటిస్తున్నాడు. స్తన్యం ఇచ్చేవారు లేరని కోపం వచ్చి, కాలుతో
శకటాన్ని తన్నాడు. శకటం అంటే మానవ శరీరం. అసురుడు అంటే అమానుష తత్త్వము ధరించి
నిద్రా సంగమాదులలో మునిగితేలు మూర్ఖుడు. భోగవాంఛలు బండిలోని వస్తువులు. వాని వలన
సంసారసాగరంలో పడుతున్నాడు. వాటిని పరిత్యజింతాలని బండిని తన్నటం. ఆ తన్నిన
పాదం విశ్వాన్ని నడిపే చక్రం శాసించే చాపం తానైన పరమాత్మ. పరిత్యజించటానికైనా
భగవానుని అనుగ్రహం కావాలి కనుక భక్తి ముఖ్యం అని అనుకోవచ్చు.
[ఆధారం శ్రీ పాలపర్తి నాగేశ్వర్లు శాస్త్రులు
గారి శ్రీమదాంధ్రభాగవత గ్రంధం. ఆ పండితోత్తమునికి కృతజ్ఞతా పూర్వక ప్రణామ శతాలు]
10.1-250-kaMda padyamu
niduriMchina shishu vaakoni
kidukuchuM~ januM~ gOri kerali kisalaya vilasa
nmRidu chakrachaaparEkhaa
spada padamunaM~ danne nokka baMDin daMDin.
నిదురించిన = నిద్రపోయిన; శిశువు = పసిపిల్లవాడు; ఆకొని = ఆకలివేసి; కిదుకుచన్ = ఒళ్ళువిరుచుకొనుచు; చనున్ = చనుబాలు; కోరి = కోరి; కెరలి = విజృంభించి; కిసలయ = చిగురుటాకు; విలసత్ = వంటి విలాసము గల; మృదు = మృదువైన, మెత్తనైన; చక్ర = చక్రము; చాప = విల్లు; రేఖా = రేఖలు; ఆస్పద = ఉనికిపట్టైన, ఉన్న; పదమునన్ = కాలితో; తన్నెన్ = తన్నెను, కాలితోకొట్టెను; ఒక్క = ఒకానొక; బండిన్ = బండిని; దండిన్ = గట్టిగా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment