Tuesday, February 24, 2015

కృష్ణలీలలు

10.1-252-వచనము
అప్పు డందున్న సరస పదార్థంబులు వ్యర్థంబులై నేలంగూలుటం జూచి యశోదానంద ముఖ్యులైన గోపగోపికాజనంబులు పనులు మఱచి పబ్బంబులు మాని యుబ్బుచెడి వెఱపులు ఘనంబులుగ మనంబులందుఁ గదుర.
         బాలకృష్ణుని తన్నుకు బండి ఎగిసి పడింది. దానిలోని రసవంతమైన పదార్థాలు వ్యర్థాలు అయ్యి నేలపాలయ్యాయి. అప్పుడది చూసి, యశోద, నందుడు మున్నగు గోపీ గోపకులు సంభ్రమంతో చేస్తున్న పనులు మరచారు. వేడుకలు మానారు. ఉత్సాహాలు నశించి మిక్కిలి బెదరసాగారు.
         అప్పుడు = ఆ సమయము నందు; అందున్ = దానిలో; ఉన్న = ఉన్నట్టి; సరస = మంచి, రసవంతము లైన; పదార్థంబులున్ = వస్తువులు; వ్యర్థంబులు = ప్రయోజనము లేనివి; = అయ్యి; నేలన్ = నేలమీద; కూలుటన్ = పడిపోవుటను; చూచి = చూసి; యశోద = యశోద మరియు; నంద = నందుడు; ముఖ్యులు = మున్నగు వారు; ఐన = అయిన; గోప = గోపకులు; గోపికా = గోపికలైన; జనంబులున్ = వారు; పనులున్ = చేస్తున్న పను లందు; మఱచి = విస్మతి చెంది; పబ్బంబులున్ = వేడుకలను; మాని = వదలి పెట్టి; ఉబ్బు = ఉత్సాహములు; చెడి = లేనివారై; వెఱపులు = భయములు; ఘనంబులుగా = మిక్కిలధికముగ; మనంబులన్ = మనసు లందు; కదుర = పుట్టగా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: