Thursday, February 5, 2015

1-2 వాలిన భక్తి మ్రొక్కెద

1-2-ఉ.
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్
బా శశాంక మౌళికిఁగ పాలికి మన్మథ గర్వ పర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్.
            అనంత లీలా తాండవలోలుడు, మిక్కలి దయ గలవాడు, త్రిశూలం ఆయుధంగా కలవాడు, పర్వతుని పుత్రిక పార్వతి యొక్క ముఖ పద్మమును వికసింపజేసే సూర్యుడు, తలపై చంద్రరేఖ ధరించినవాడు, మెడలో కపాల మాల ధరించినవాడు, మన్మథుడి పర్వత మంత గర్వం సర్వం అణిచేసిన వాడు, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించే వాడు అయిన పరమ శివునికి శిరస్సు వంచి భక్తితో మ్రొక్కుతాను.
            గ్రంధారంభంలో చేసిన శివ స్తుతి యిది. ఒకే హల్లు అనేకమార్లు మరల మరల వస్తే వృత్యనుప్రాసం అని చెప్పుకోవచ్చు. బహుసుందరమైన ఈ పద్యంలో లయకారుని శివుని స్తుతిస్తు, లకారంతో వృత్యనుప్రాస చక్కగా చేసిన అలంకారం ఎంత అందంగా అలరిస్తోందో.
1-2-u.
vaalina bhakti mrokkeda navaarita taaMDava kELikin dayaa
shaaliki shoolikin shikharijaa mukha padma mayookha maalikin
baala shashaaMka mauLikiM~ga paaliki manmatha garva parvatO
nmooliki naaradaadi munimukhya manassaraseeruhaalikin.
          వాలిన = అతిశయించిన; భక్తి = భక్తితో;  - మ్రొక్కెదన్ = మ్రొక్కెదను; అవారిత = వారింపలేని; తాండవ = తాండవ మనే; కేళి = ఆట ఆడే వాని; కిన్ = కి;  - దయాశాలి = దయ కల వాడి; కిన్ = కి;  శూలి = శూల ధారి; కిన్ = కి;  - శిఖరి = పర్వతుని; జా = పుత్రికయొక్క; ముఖ = ముఖము అనే; పద్మ = పద్మానికి; మయూఖమాలి = సూర్యుడు {మయూఖమాలి - కిరణములు కలవాడు, సూర్యుడు}; కిన్ = కి;  - బాల = లేత; శశాంక = చంద్రుని {శశాంక - శశ (కుందేలు) గుర్తు కలవాడు - చంద్రుడు}; మౌళి = శిరస్సున ధరించిన వాడు; కిన్ = కి; కపాలి = పుర్రె ధరించే వాడు; కిన్ = కి;  - మన్మథ = మన్మథుని; గర్వ = గర్వమనే; పర్వత = పర్వతాన్ని; ఉన్మూలి = నిర్మూలించిన వాడు; కిన్ = కి;  - నారద = నారదుడు; ఆది = మొదలైన; ముని = ముని; ముఖ్య = ముఖ్యుల;  - మనస్ = మనసులనే; సరసీరుహ = పద్మాలలోని {సరసీరుహ - సరస్సులో పుట్టినది, పద్యం; అలి = తుమ్మెద లాంటి వాడు; కిన్ = కి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: