Sunday, February 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౬(486)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1037-సీ.
ధరణీశ! బలుఁడును సరసిజోదరుఁడు న-
  వోన్నతసుఖలీల నుండునంతఁ
జటులోగ్రకల్పాంత సమయమందునుఁ బో-
  దృగసహ్యమై సముద్దీప్త మగుచు
రాజిల్లు సూర్యోపరాగంబు సనుదెంచు-
  టెఱిఁగి భూజను లెల్ల వరుసఁ గదలి
మును జమదగ్ని రాముఁడు పూని ముయ్యేడు-
  మాఱులు ఘనబలోదారుఁ డగుచు
10.2-1037.1-తే.
నిజభుజాదండ మండిత నిబిడ నిశిత
చటుల దంభోళిరుచిరభాస్వత్కుఠార
మహితధారావినిర్భిన్న మనుజపాల
దేహనిర్ముక్త రుధిర ప్రవాహములను.
10.2-1038-తే.
ఏను మడువులు గావించె నెచటనేని
నట్టి పావనసుక్షేత్రమగు శమంత
పంచకంబున కపుడు సంభ్రమముతోడఁ
జనిరి బలకృష్ణులును సంతసం బెలర్ప. 

భావము:
“మహారాజా బలరామకృష్ణులు ద్వారకలో సుఖంగా ఉన్న రోజులలో కల్పాంత కాలంలో వలె చూడశక్యంగాని విధంగా సూర్యగ్రహణం రానున్నదని తెలుసుకున్నారు. ప్రజలందరూ తమ వెంట రాగా వారు శమంతపంచకం అనే మహా పుణ్యక్షేత్రానికి వెళ్ళారు. ఆ క్షేత్రం ఎంత గొప్పదంటే, పరశురాముడు అవక్రవిక్రమంతో అభిరాముడై ఇరవైఒక్క మార్లు దండెత్తి, వజ్రాయుధం లాంటి తన కఠోర కుఠారంతో రాజలోకం కుత్తుకలు తునిమాడు. లోకాన్ని నిఃక్షత్రం చేసాడు. ఆసమయంలో ఆ రాజుల శరీరాలనుండి స్రవించిన రక్తం ప్రవాహం కడితే అలా ప్రవహించిన మహీపతుల రక్తప్రవాహాన్ని పరశురాముడు ఐదుమడుగులు కావించాడు. అవి శమంతపంచకం అనే పేరుతో పవిత్రక్షేత్రంగా రూపొందాయి. అట్టి శమంతకానికి శ్రీబలరామకృష్ణాది యాదవులు గ్రహణ సందర్భంగా చేరుకున్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1038 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




No comments: