Friday, February 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౭౮(478)

( అటుకులారగించుట ) 

10.2-1021-సీ.
భానుచంద్రప్రభా భాసమానస్వర్ణ-
  చంద్రకాంతోపల సౌధములునుఁ
గలకంఠ శుక నీలకంఠ సముత్కంఠ-
  మానిత కూజితోద్యానములును
ఫుల్లసితాంభోజ హల్లక కహ్లార-
  కైరవోల్లసిత కాసారములును
మణిమయ కనక కంకణ ముఖాభరణ వి-
  భ్రాజిత దాసదాసీజనములుఁ
10.2-1021.1-తే.
గలిగి చెలువొందు సదనంబుఁ గాంచి విస్మ
యమునుఁ బొందుచు "నెట్టి పుణ్యాత్ముఁ డుండు
నిలయ మొక్కొ! యపూర్వమై నెగడె మహిత
వైభవోన్నత లక్ష్మీనివాస మగుచు."
10.2-1022-వ.
అని తలపోయుచున్న యవసరంబున.
10.2-1023-తే.
దివిజ వనితలఁ బోలెడు తెఱవ లపుడు
డాయ నేతెంచి "యిందు విచ్చేయుఁ" డనుచు
విమల సంగీత నృత్య వాద్యములు సెలఁగ
గరిమఁ దోడ్కొని చని రంతిపురమునకును. 

భావము:
సూర్యచంద్రుల కాంతితో ప్రకాశించే పాలరాతి మేడలు, శుక, పిక, మయూరాల కూజితాలతో అలరారే చక్కటి ఉద్యానవనాలు, వికసించిన అనేక వన్నెల తామరలతో కలువలతో కనులపండువుగా ఉన్న సరోవరాలు, మణికంకణాలు మున్నగు రకరకాల భూషణాలూ ధరించి ప్రకాశిస్తున్న దాస దాసీజనము కలిగిన భవనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. “ఏ పుణ్యాత్ముని భవనమో ఇది సిరిసంపదలకు నిలయముగా అపూర్వంగా ప్రకాశిస్తున్నది.” ఇలా అనుకుంటూ సంకోచిస్తున్న సమయంలో దేవకాంతల వంటి యువతులు కుచేలుని దగ్గరకు వచ్చి, “ఇటు దయచేయండి.” అంటూ స్వాగతం పలికారు. సంగీత నృత్య వాద్యాలతో అతడిని అంతఃపురం లోనికి తీసుకుని వెళ్ళారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1021 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: