Thursday, February 10, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౭౩(473)

( అటుకులారగించుట ) 

10.2-1012-వ.
అవ్విప్రుండు సనుదెంచిన కార్యంబు కృష్ణుండు దన దివ్యచిత్తంబున నెఱింగి “యితండు పూర్వభవంబున నైశ్వర్యకాముండై నన్ను సేవింపండైన నిక్కుచేలుండు నిజకాంతాముఖోల్లాసంబుకొఱకు నా యొద్దకుఁ జనుదెంచిన వాఁ; డితనికి నింద్రాదులకుం బడయ రాని బహువిధంబులైన సంపద్విశేషంబు లీక్షణంబ యొడఁగూర్పవలయు” నని తలంచి యతండు జీర్ణవస్త్రంబు కొంగున ముడిచి తెచ్చిన యడుకుల ముడియఁ గని “యిది యేమి” యని యొయ్యన నమ్ముడియఁ దనకరకమలంబుల విడిచి యయ్యడుకులు కొన్ని పుచ్చుకొని “యివియ సకల లోకంబులను, నన్నును బరితృప్తిం బొందింపఁ జాలు” నని యప్పుడు. 

భావము:
కుచేలుడు వచ్చిన కారణాన్ని శ్రీకృష్ణుడు గ్రహించాడు. పూర్వజన్మ నుండి ఇతడు ఐశ్వర్యాన్ని కోరి నన్ను సేవించినవాడు కాదు. ఇప్పుడు తన భార్య సంతోషం కోసం నా దగ్గరకు వచ్చాడు. కావున ఇంద్రాదులకు సైతం లభించని సకల సంపదల్ని ఈక్షణమే ఇతనికి ఇవ్వాలని భగవంతుడు భావించాడు. తన చినిగిన ఉత్తరీయంలో ముడివేసి కుచేలుడు తీసుకువచ్చిన అటుకులను చూసి, కృష్ణుడు ఆలా అన్నాడు. ఇదేమిటి అని అడుగుతూ ముడి విప్పి అటుకులు గుప్పెడు తీసుకున్నాడు, “నాకూ సమస్త లోకాలకూ సంతృప్తి కలిగించడానికి ఇవి చాలు.” అంటూ కృష్ణుడు ఆ అటుకుల్ని ఆరగించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1012 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




No comments: