( అటుకులారగించుట )
10.2-1026-క.
ఆ నారీరత్నంబునుఁ
దానును ననురాగరసము దళుకొత్తఁగ ని
త్యానందము నొందుచుఁ బెం
పూనిన హరిలబ్ధ వైభవోన్నతి మెఱయన్.
10.2-1027-సీ.
కమనీయ పద్మరాగస్తంభకంబులుఁ-
గొమరారు పటికంపుఁ గుడ్యములును
మరకత నవరత్నమయ కవాటంబులుఁ-
గీలిత హరి నీల జాలకములు
దీపిత చంద్రకాంతోపల వేదులు-
నంచిత వివిధ పదార్థములును
దగు హంసతూలికా తల్పంబులును హేమ-
లాలిత శయనస్థలములుఁ దనరు
10.2-1027.1-తే.
సమధికోత్తుంగ భద్రపీఠముల సిరులు
మానితోన్నత చతురంతయానములును
వలయు సద్వస్తు పరిపూర్ణ వాటికలును
గలిగి చెలువొందు మందిరం బెలమిఁ జొచ్చి.
భావము:
కృష్ణుని అనుగ్రహంవలన కలిగిన ఐశ్వర్య వైభవాలకు ఆ భార్యాభర్తలు ఇద్దరకూ సరిక్రొత్త అన్యోన్యానురాగాలు చిగురిస్తుండగా అపారమైన ఆనందాన్ని పొందారు. పద్మరాగాలు తాపిన చిరుస్తంభాలు; చలువరాతితో నిర్మించిన గోడలు; మరకతమణులు నవరత్నాలు పొదిగిన గుమ్మాలు, తలుపులు; ఇంద్రనీలాల కిటికీలు; అందగించే చంద్రకాంత శిలావేదికలు; బహువిధ పదార్ధాలు; హంసతూలికా తల్పాలు; స్వర్ణమయ శయన మందిరాలు; వైభవోపేతమైన ఉన్నత పీఠములు; చక్కటి నాలుగు బొంగుల పల్లకీలు; కావలసిన సమస్త వస్తువులతో నిండుగా ఉన్న వాటికలు; కలిగి అందాలు చిందే ఆ భవనం లోనికి కుచేలుడు సతీసమేతంగా ఆనందంగా ప్రవేశించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1027
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment