Wednesday, February 23, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౩(483)

( అటుకులారగించుట ) 

10.2-1031-వ.
అట్టి పురుషోత్తముండు భక్తినిష్ఠులైన సజ్జనులు లేశమాత్రంబగు పదార్థంబైన భక్తి పూర్వకంబుగా సమర్పించిన నది కోటిగుణితంబుగాఁ గైకొని మన్నించుటకు నిదియ దృష్టాంతంబు గాదె! మలిన దేహుండును, జీర్ణాంబరుండు నని చిత్తంబున హేయంబుగాఁ బాటింపక నా చేనున్న యడుకు లాదరంబున నారగించి నన్నుం గృతార్థునిం జేయుట యతని నిర్హేతుక దయయ కాదె! యట్టి కారుణ్యసాగరుండైన గోవిందుని చరణారవిందంబుల యందుల భక్తి ప్రతిభవంబునఁ గలుగుంగాక!” యని యప్పుండరీకాక్షుని యందుల భక్తి తాత్వర్యంబునం దగిలి పత్నీసమేతుండై నిఖిల భోగంబులయందు నాసక్తిం బొరయక, రాగాది విరహితుండును నిర్వికారుండును నై యఖిలక్రియలందు ననంతుని యనంత ధ్యాన సుధారసంబునం జొక్కుచు విగత బంధనుండై యపవర్గ ప్రాప్తి నొందె; మఱియును. 

భావము:
భగవంతుడు, భక్తితత్పరులైన సజ్జనులు సమర్పించిన వస్తువు రవ్వంతే అయినా దానిని కోటానుకోట్లుగా స్వీకరించి, భక్తులను అనుగ్రహిస్తాడు అనడానికి నా వృత్తాంతమే తార్కాణం. మాసిన నా శరీరాన్ని చినిగిన బట్టలను చూసి శ్రీకృష్ణుడు మనస్సులో నైనా ఏవగించుకోలేదు. నా దగ్గర ఉన్న అటుకులను ప్రీతిగా ఆరగించాడు. నన్ను ధన్యుణ్ణి చేయడం దామోదరుని నిర్హేతుకవాత్సల్యం మాత్రమే. అంతటి కరుణాసాగరుడైన గోవిందుని పాదారవిందాల మీద నాకు నిండైన భక్తి నెలకొని ఉండు గాక.” అని ఈ మాదిరి తలుస్తూ హరిస్మరణం మరువకుండా కుచేలుడు తన ఇల్లాలితో కలసి జీవించాడు. భోగాలపై ఆసక్తి లేకుండా, రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారస వాహినిలో ఓలలాడుతూ, భవబంధాలను బాసి మోక్షాన్ని అందుకున్నాడు. మఱియును... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1031 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




No comments: