Saturday, February 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౭౯(479)

( అటుకులారగించుట ) 

10.2-1024-వ.
ఇట్లు సనుదేర నతని భార్య యైన సతీలలామంబు దన మనంబున నానందరసమగ్న యగుచు.
10.2-1025-సీ.
తన విభురాక ముందటఁ గని మనమున-
  హర్షించి వైభవం బలర మనుజ
కామినీరూపంబు గైకొన్న యిందిరా-
  వనిత చందంబునఁ దనరుచున్న
కలకంఠి తన వాలుఁగన్నుల క్రేవల-
  నానందబాష్పంబు లంకురింప
నతని పాదంబుల కాత్మలో మ్రొక్కి భా-
  వంబున నాలింగనంబు సేసె
10.2-1025.1-తే.
నా ధరాదేవుఁ డతుల దివ్యాంబరాభ
రణ విభూషితలై రతిరాజు సాయ
కముల గతి నొప్పు పరిచారికలు భజింప
లలిత సౌభాగ్య యగు నిజ లలనఁ జూచి. 

భావము:
కుచేలుడు ఇలా వస్తుండటం చూసిన ఆయన భార్య చాలా సంతోషించింది. ఆ ఇల్లాలు తన భర్త ఎదురుగా వస్తుంటే చూసి, ఎంతో ఆనందంతో ఎదురువచ్చింది. అప్పుడు ఆమె అపర మహాలక్ష్మిలా ఉంది. ఆమె కనుకొలకుల్లో ఆనందభాష్పాలు రాలుతున్నాయి. మనస్సులోనే భర్త పాదాలకు నమస్కరించి, కౌగలించుకుంది. దివ్యాంబరాలూ ఆభరణాలు ధరించి మన్మథుడి బాణాల లాగ ఉన్న పరిచారికల సేవలందుకుంటూ ఐశ్వర్యంతో తులతూగే తన భార్యను కుచేలుడు చూసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1025 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




No comments: