Thursday, February 24, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౪(484)

( అటుకులారగించుట ) 

10.2-1032-ఆ.
దేవదేవుఁ, డఖిల భావజ్ఞుఁ, డాశ్రిత
వరదుఁ డైన హరికి ధరణిసురులు
దైవతములు గాన ధారుణీదివిజుల
కంటె దైవ మొకఁడు గలడె భువిని?
10.2-1033-క.
మురహరుఁ డిట్లు కుచేలుని
చరితార్థునిఁ జేసినట్టి చరితము విను స
త్పురుషుల కిహపరసుఖములు
హరిభక్తియు యశముఁ గలుగు నవనీనాథా!" 

భావము:
దేవదేవుడైన వాసుదేవుడికి తెలియని విషయం లేదు; భక్తవత్సలు డగు హరికి బ్రాహ్మణులు అంటే దైవ సమానులు; తరచిచూస్తే, భూలోకంలో వారి కంటే వేరే దైవం లేడు. ఓ రాజా! మురాసురుని సంహరించిన శ్రీకృష్ణుడు కుచేలుని చరితార్థుడినిగా చేసిన ఈ వృత్తాంతం విన్న వారికి ఇహపర సుఖాలూ, హరిభక్తి, యశస్సూ కలుగుతాయి.” అని శుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1033 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




No comments: