10.2-1016-క.
"నా పుణ్య మరయ నెట్టిదొ
యా పుణ్యనిధిం, బ్రశాంతు, నచ్యుతు, నఖిల
వ్యాపకు, బ్రహ్మణ్యునిఁ, జి
ద్రూపకుఁ, బురుషోత్తమునిఁ, బరుం గనుఁగొంటిన్.
10.2-1017-సీ.
పరికింపఁ గృపణస్వభావుండ నై నట్టి-
యే నేడ? నిఖిలావనీశ్వరి యగు
నిందిరాదేవికి నెనయంగ నిత్య ని-
వాసుఁడై యొప్పు న వ్వాసుదేవుఁ
డేడ? న న్నర్థిమైఁ దోడఁబుట్టిన వాని-
కైవడిఁ గౌఁగిటఁ గదియఁ జేర్చి
దైవంబుగా నన్ను భావించి నిజతల్ప-
మున నుంచి సత్క్రియల్ పూనినడపి
10.2-1017.1-తే.
చారు నిజవధూ కరసరోజాత కలిత
చామరానిలమున గతశ్రమునిఁ జేసి
శ్రీకుచాలిప్త చందనాంచితకరాబ్జ
తలములను నడ్గు లొత్తె వత్సలత మెఱసి.
భావము:
“ఆహా ఏమి నాపుణ్యం? ఆ పుణ్యల రాశిని; పరమ శాంతుని; అచ్యుతుని; అఖిల వ్యాపకుని; చిన్మయ స్వరూపుని; పర మాత్మను; పురు షోత్తముని; శ్రీకృష్ణపరమాత్మను దర్శించ గలిగాను. మందుడను అయిన నే నెక్కడ? లక్ష్మికి నిత్యనివాస మైన వాసుదేవు డెక్కడ? అచ్యుతుడు అనురాగంతో నన్ను తన తోడబుట్టినవాడిలా కౌగిట చేర్చాడు. దేవుడితో సమానమైన వాడిలా భావించి తన పానుపు మీద కూర్చోబెట్టుకున్నాడు. పూని నన్ను గొప్పగా సత్కరించాడు. ఆయన పట్టపుదేవి రుక్మిణీదేవి నాకు వింజామర వీచింది. నా శ్రమను పోగొట్టింది. అతిశయించిన వాత్సల్యంతో శ్రీకృష్ణుడే సాక్షాత్తూ లక్ష్మీదేవిని లాలించే తన చందనాలు అలదిన పాణిపల్లవాలతో ఆప్యాయంగా నా పాదా లొత్తాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1017
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment