10.2-1039-వ.
ఇట్లు నిష్కర్ములైన రామకృష్ణులు లోక ధర్మానుపాలన ప్రవర్తనులై ద్వారకానగర రక్షణంబునకుం బ్రద్యుమ్న, గద, సాంబ, సుచంద్ర, శుక, సారణానిరుద్ధ, కృతవర్మాది యోధవరుల నియమించి తాము నక్రూర వసుదేవోగ్రసేనాది సకల యాదవులుం గాంతాసమేతులై స్రక్చంద నాభరణ వస్త్రాదులు ధరియించి, శోభనాకారంబులతోడం బుష్పక విమానంబులనం బొలుచు నరదంబులను, మేఘంబుల ననుకరించు గజంబులను, మనోవేగంబులైన తురగంబుల నెక్కి వియచ్చరులం బురుడించు పురుషులు దమ్ము సేవింపం జని య ప్పుణ్య తీర్థంబుల నవగాహనంబు సేసి యుపవసించి, యనంతరంబ.
భావము:
బలరామకృష్ణులు లోకధర్మపాలనకు పూనుకుని, ప్రద్యుమ్నుడు, గదుడు, సాంబుడు, సుచంద్రుడు, శుకుడు, సారణుడు, అనిరుద్ధుడు, కృతవర్మ మున్నగు యాదవ మహాయోధులను నగర రక్షణ కోసం ద్వారకలో నిలిపారు. అక్రూరుడు, వసుదేవుడు ఉగ్రసేనుడు మొదలైన యాదువులుతో కలిసి, వారు సర్వాలంకారశోభితులై కాంతాసమేతంగా బయలుదేరారు. పుష్పక విమానాల వంటి రథాలు, మేఘాలను పోలు ఏనుగులు, మనోజవములైన అశ్వాలు వంటి, వారివారికి తగిన వాహనాలలో శమంత పంచకానికి ప్రయాణం అయ్యారు. దేవతలకు సాటి వచ్చే సేవకులు వారిని సేవిస్తుండగా ఆ పుణ్యక్షేత్రం చేరారు. ఆ పుణ్యతీర్ధాలలో స్నానాలు చేసి ఉపవాసాలు చేశారు. పిమ్మట....
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1039
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :